Smita Sabharwal: తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం మారింది. బీఆర్‌ఎస్ గద్దె దిగింది. కాంగ్రెస్ గద్దెనెక్కింది. సీఎంగా రేవంత్ బాధ్యతులు చేపట్టారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో, సీఎంవోలో అత్యంత కీలకంగా వ్యవహరించిన స్మితాసబర్వాల్ అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆమె పేరు చెప్తే తెలంగాణ అధికార వర్గాల్లోనే కాదు, రాజకీయ వర్గాల్లోనూ, ఇటు ప్రజల్లోనూ ఎక్కడలేని ఆసక్తి కలుగుతుంది. సీఎం ప్రత్యేక కార్యదర్శితోపాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా నిర్వర్తించిన ఆమె కేసీఆర్ మెప్పు పొందిన అధికారిగా కీలక బాధ్యతలను నిర్వర్తించారు. బీఆర్‌ఎస్ పాలనతో సీఎం కేసీఆర్‌తోపాటు ముఖ్యమైన మంత్రిగా ఉన్న కేటీఆర్ స్మితా సబర్వాల్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్మిత సబర్వాల్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు దరఖాస్తు కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాంటిదేమీ లేదని, స్మితాసబర్వాల్ ఖండించినప్పటికీ, నిప్పులేనిదే పొగ రాదు అన్నట్లు ఆమె ప్రయత్నం చేసే ఉంటారు అన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుంది.
సీఎంను కలవని స్మితా సబర్వాల్..
కొత్త సర్కారు కొలువుదీరినప్పటినుంచి స్మితా సబర్వాల్ ఎక్కడ కనిపించకపోవడం ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమైన అధికారులంతా మర్యాదపూర్వకంగా ఆయనను కలిసినప్పటికి స్మితా సబర్వాల్ మాత్రం ఆయనను కలవలేదు. ఆమె కేసీఆర్ పాలనా సమయంలో ప్రభుత్వ పాలనకు కితాబిస్తూ అనేక పోస్టులు పెట్టారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో 23 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నానని, కొత్త ఛాలెంజ్‌లకు తను ఎప్పుడు సిద్ధమేనంటూ స్మితసబర్వాల్ పోస్ట్ పెట్టడం ఆసక్తికరంగా మారింది.
‘ఆకునూరి’ ఆసక్తికర వ్యాఖ్యలు
మరోవైపు కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆమ్రపాలి తెలంగాణ రాష్ట్రానికి రావాలని ప్రయత్నాలు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి స్మిత సబర్వాల్ ను టార్గెట్ చేశారు. ‘‘అప్పటి ప్రభుత్వంలో చేసినవన్నీ చేసి కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర ప్రభుత్వానికి వెళ్లి ఇక్కడి తప్పులను తప్పించుకోడం ఫ్యాషన్ అయ్యింది కొంత మంది ఐఏఎస్‌లకు’ అంటూ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం వీళ్లను కేంద్రానికి పంపకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏం తప్పులు చెయ్యకపోతే ఎందుకు భుజాలు తడుముకోడం అమని ప్రశ్నించారు. ‘‘దేశం మొత్తంలో హెలిక్యాప్టర్‌లో వెళ్లి పనులను ఏకైక ఐఏఎస్ ఆఫీసర్ ఈమెగారు మాత్రమే’’ అంటూ స్మిత సబర్వాల్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.