Congress Second List
Congress Second List: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ పట్టు బిగిస్తోంది. ఇప్పటికే అధికార బీఆర్‌ఎస్ రేసులో ముందు ఉన్నట్లు కనిపిస్తున్నా.. ఆచి తూచి అడుగులు వేస్తున్న కాంగ్రెస్ క్రమంగా ఎన్నికల మూడ్‌ను తమవైపు తిప్పుకుంటోంది. ప్రజల్లో బీఆర్‌ఎస్‌పై ఉన్న వ్యతిరేక పవనాలను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టె తయారీ, ఎన్నికల ప్రచారం విషయాల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే 55 స్థానాలకు అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించింది.
రెండో జాబితా రెడీ..
ఇప్పుడు కాంగ్రెస్ రెండో జాబితా సిద్ధం అయింది. శనివారం రాత్రి వరకు ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. దాదాపు 30 మందితో సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసే చాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ ఈరోజు జరుగనుంది. ఈ సమావేశంలో ఏఐసీసీ అగ్రనేతలతోపాటు రాహుల్‌గాంధీ కూడా పాల్గొననున్నారు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్, ఎంపీ ఉత్తమకుమార్‌రెడ్డి కూడా ఢిల్లీ చేరుకున్నారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ అనంతరం ఈరోజు సాయంత్రం లేదా రేపు లిస్ట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది.
రెండో విడత బస్సుయాత్రపై చర్చ!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రెండో విడత బస్సు యాత్రపై కూడా ఏఐసీసీలో ఈరోజు చర్చ జరగనుంది. ఇప్పటికే రాహుల్ చేపట్టిన యాత్ర సూపర్ సక్సెస్ అయింది. ఉత్తర తెలంగాణలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. దీంతో ఎన్నికల నాటికి కనీసం నాలుగైదు బస్సుయాత్రలు చేపట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. రెండో విడత యాత్ర రూట్ మ్యాప్, చీఫ్ గెస్ట్లు వంటి అంశాలతోపాటు షెడ్యూల్ కూడా శనివారం నిర్వహించే సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది.
దసరా తర్వాత మూడో జాబితా..
ఇక కాంగ్రెస్ మూడో జాబితా దసరా తర్వాత ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే బీఆర్‌ఎస్ నుంచి కొంతమంది కాంగ్రెస్‌లో చేరారు. బీజేపీ ఫస్ట్ లిస్ట్ వచ్చిన తర్వాత బీజేపీ నుంచి కూడా కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. మరోవైపు సీసీఐ, సీపీఎం పార్టీలతో పొత్తుపై చర్చలు జరుగుతున్నాయి. టీజేఎస్ కూడా కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతోంది. ఈ క్రమంలో కోదండరామ్ కరీంనగర్‌లో రాహుల్‌గాంధీని కూడా కలిశారు. ఈ నేపథ్యంలో దసరా తర్వాత పొత్తులతోపాటు చేరికలు కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. దీంతో మూడో జాబితాను దసరా తర్వాత ప్రకటించేలా కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.