Congress Second List: తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థుల మలి జాబితా ఏ క్షణంలో అయిన విడుదలయ్యే అకవాశం ఉంది. ఈమేరకు రెండో జాబితాపై పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) బుధవారం చర్చలు జరిపింది. ఢిల్లీలో మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన కమిటీ సమావేశంలో దాదాపు 55 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. గురువారం సాయంత్రం లేదా శుక్రవారం అభ్యర్థుల జాబితా విడుదల చేయవచ్చని తెలుస్తోంది.
వామపక్షాలతో పొత్తుపై కుదరని ఏకాభిప్రాయం..
వామపక్షాలకు సీట్లు కేటాయించే విషయంపైనే పార్టీ అగ్రనేతలు ఒక అభిప్రాయానికి రాలేకపోయారు. కాగా సీఈసీ ఖరారు చేయగా మిగిలిన 9 అసెంబ్లీ సీట్లపై బుధవారం రాత్రి పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో స్క్రీనింగ్ కమిటీ మరోసారి కసరత్తు చేసింది. వామపక్షాల డిమాండ్లపై స్క్రీనింగ్ కమిటీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనట్లు సమాచారం.
ఖమ్మం సీటు కోసం పట్టు..
ఖమ్మం జిల్లా పాలేరులో కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బలమైన అభ్యర్థిగా రంగంలో ఉండగా అదే సీటును సీపీఎంకు ఇవ్వాలని తమ్మినేని వీరభద్రం పట్టుబట్టారు. దీనిపై కాంగ్రెస్ నేతలుతీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తమకు చెన్నూరు బదులు మునుగోడు ఇవ్వాలని సీపీఐ కోరుతున్నా, ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరడంతో ఆయనకు ఆ స్థానం ఖరారు అయినట్లే. కాబట్టి మునుగోడుపై సీపీఐ ఆశ వదులుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పరిస్థితిని ముందే పసిగట్టిన సీపీఐ చెన్నూరులో పోటీకి సిద్ధమైంది. కాగా, సీపీఎం విషయంలో ఒక మిర్యాలగూడ స్థానం వరకు కాంగ్రెస్ సుముఖంగా ఉంది. సీపీఎం అడిగిన పాలేరు లేదా భద్రా చలం స్థానాలపై కాంగ్రెస్ విముఖతగా ఉంది. పాలేరు ఇచ్చే పరిస్థితే తలెత్తదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఇక భద్రాచలం స్థానంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తన సిట్టింగ్ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. దీంతో సీపీఎంకు మరో స్థానం ఎక్కడ ఇస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. గురువారం మరోసారి సీఈసీ తుది కసరత్తు జరిపి వివాదాస్పద సీట్లపైనా అంతిమ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని సమాచారం.
పొత్తు పొడిచేనా..
కాంగ్రెస్, వామపక్షాల పొత్తు వ్యవహారం ఇప్పటికీ తేలడం లేదు. దీంతో సీపీఐ, సీపీఎం కేడర్లలో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. చెరి రెండు అసెంబ్లీ స్థానాలు ఇస్తామని చెప్పినా, ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు స్థానాలు ఇస్తామని, సీపీఎంకు మిర్యాలగూడ స్థానం ఇస్తామని కాంగ్రెస్ వెల్లడించింది. కానీ మరో స్థానం విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు. కనీసం ఆ మూడు స్థానాల్లోనైనా ప్రచారం చేసుకోండంటూ తమకు భరోసా ఇవ్వడం లేదని వామపక్షాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.