Congress Khammam Meeting: తెలంగాణలో కాంగ్రెస్ వేవ్ మొదలైంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రతో మొదలైన మార్పునకు కర్ణాటక ఎన్నికల ఫలితాలు మరింత ఊపు తెచ్చాయి. యాత్ర ముగింపు వేళ పరిస్థితులు చాలా వరకు పార్టీకి అనుకూలంగా మారాయి. భట్టి పాదయాత్ర హైకమాండ్‌ను సైతం కదిలించింది. జూలై 2న నిర్వహించే యాత్ర ముగింపు సభకు కాంగ్రెస్ అగ్రనేత హాజరవుతున్నారు. ఇదే సభలో బీఆర్‌ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావుతోపాటు 30 మంది కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం సభ ద్వారానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమరశంఖం పూరించాలని కాంగ్రెస్ భావిస్తోంది. కర్ణాటక ఫలితాల ఊపును తెలంగాణలోనూ కొనసాగించాలని అధిష్టానం భావిస్తోంది.
అధిష్టానం ఆశ్చర్యపోయేలా..
కాంగ్రెస్ అధిష్టానం ఆశ్చర్యపోయేలా ఖమ్మం సభ నిర్వహించాలని టీపీసీసీ భావిస్తోంది. ఒకవైపు భట్టి పాదయాత్ర ముగింపు, మరోవైపు భారీగా చేరికలు ఉన్న నేపథ్యంలో ఈ సభను రేవంత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. మరోవైపు అధిష్టానం కూడా సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభను తలదన్నేలా కాంగ్రెస్ సభ ఉండాలని కాంగ్రెస్‌లో చేరనున్న బీఆర్‌ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భావిస్తున్నారు. తన సొంత జిల్లాలో తన బలం, బలగం చూపించాలని ఆయన అనుకుంటున్నారు.
పీపుల్స్ మార్చ్‌తో మార్పు..
ఇక సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ యాత్రతో కాంగ్రెస్ పార్టీలో క్షేత్రస్థాయిలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీ నేతల్లోనూ మార్పు స్పష్టంగా తెలుస్తోంది. అందరూ ఐక్యతారాగం అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం ఖమ్మ సభలో భట్టిని ఘనంగా సత్కరించేలా ఏర్పాట్లు చేస్తోంది. రాహుల్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
అజెండా రూపకల్పన..
తెలంగాణలో తాజా పరిణామాల నడుమ కాంగ్రెస్ సెంట్రల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. మేధావులతో భేటీలు నిర్వహిస్తున్నాయి. పార్టీకి పెరిగిన ఆదరణ.. భవిష్యత్ కార్యాచరణపై వారి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఈ మీటింగ్ అజెండా రూపొందిస్తున్నాయి. మరోవైపు ఖమ్మంలో జరగనున్న జనగర్జన తెలంగాణ రాజకీయ చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభ సక్సెస్ గ్రహించిన రేవంత్ అలర్ట్ అయ్యారు. ఖమ్మం సభ ఏర్పాట్ల పర్యవేక్షణకు రంగంలోకి దిగారు. సీఎల్పీ నేత భట్టితోపాటు జిల్లా నేతలతో సమావేశమవుతున్నారు.
పొరుగు జిల్లాలపైనా ప్రభావం..
ఖమ్మం సభ ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటుగా పొరుగు జిల్లాల పైన ఈ ప్రభావం స్పష్టంగా కనిపించేలా కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మం సభా వేదికగా జరిగే చేరికలు, రాహుల్ తెలంగాణ ప్రజల కోసం ఇవ్వనున్న హామీలు ఇప్పుడు ఎన్నికల వేళ బీఆర్‌ఎస్ – బీజేపీకి సవాల్‌గా మారనున్నాయి. ఇప్పటికే నిఘా సంస్థలు ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాయి. ఖమ్మంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా తమ పట్టు జారుతోందనే ఆందోళన బీఆర్‌ఎస్ నేతల్లో కనిపిస్తోంది. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలపై ఖమ్మం సభ ప్రభావం ఉంటుందని రాష్ట్ర ఇంటలిజెన్స్ ప్రభుత్వానికి నివేదించిందని సమాచారం.
మొత్తంగా భట్టి యాత్రకు ముందు.. యాత్ర తర్వాత అన్నట్లు మారిన పార్టీ… ఖమ్మ సభ తర్వాత సభకు ముందు సభ తర్వాత అన్నట్లు నేతల్లో మార్పు వస్తుందని అధిష్టానం భావిస్తోంది.