https://oktelugu.com/

AP Congress: ఏపీలో “హస్తం” హస్తవాసి మారుతుందా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పతనవస్థలో ఉండేది. పదేళ్లుగా అధికారానికి దూరం కావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెట్టుకొకరు.. పుట్టకొకరుగా మిగిలిపోయారు. పార్టీలో ఉన్న చాలామంది ప్రత్యర్థులతో చేతులు కలిపారు.

Written By:
  • Dharma
  • , Updated On : December 8, 2023 12:30 pm
    AP Congress

    AP Congress

    Follow us on

    AP Congress: కాంగ్రెస్ పార్టీకి పతనం లేదు. తాత్కాలిక ఓటమిలే తప్ప.. శాశ్వత పరాజయాలు లేవు. అలా ఉంటే కాంగ్రెస్ పార్టీ బతికి బట్టకట్టి ఉండేది కాదు. కాంగ్రెస్ అనేది ఓ మహా వృక్షం. అప్పుడప్పుడు దాని చిగురు రాలిపోతుందే తప్ప.. దాని జవసత్వానికి మాత్రం ఎటువంటి ప్రమాదం ఉండదు. ఆ మహా వృక్షాన్ని ఎంతలా సంరక్షిస్తే.. అంతలా నీడనిస్తుంది.. రక్షణగా నిలుస్తోంది. ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి ఎంత చెప్పినా తక్కువే.

    తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పతనవస్థలో ఉండేది. పదేళ్లుగా అధికారానికి దూరం కావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెట్టుకొకరు.. పుట్టకొకరుగా మిగిలిపోయారు. పార్టీలో ఉన్న చాలామంది ప్రత్యర్థులతో చేతులు కలిపారు. మరికొందరు కోవర్టులుగా మారిపోయారు.ఇటువంటి తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు అందుకున్న రేవంత్ రెడ్డి కష్టాలను అధిగమించారు. పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ధైర్యం నింపారు. కేసులకు వెనుకడుగు వేయలేదు. జైలు జీవితానికి జంక లేదు. పోరాడితే ఫలితం ఉంటుందని పార్టీ శ్రేణులకు నూరిపోసి ధైర్యం చెప్పారు. బాహుబలి గా మారి.. కట్టప్పలను దాటుకొని విజయతీరాలకు చేరారు.

    ఇప్పుడు అన్నిచోట్ల రేవంత్ మాదిరిగా బాహుబలి లాంటి నాయకత్వం కావాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి. ముఖ్యంగా ఏపీలో ఆ తరహా చరిష్మ సృష్టించుకుని కాంగ్రెస్ పార్టీలో జవసత్వాలు నింపి.. అధికారంలోకి తీసుకు రాగలిగే నాయకుడి కోసం అక్కడ పార్టీ శ్రేణులు ఆశగా ఎదురుచూస్తున్నాయి. బ్యాలెట్ అయినా, ఈవీఎం అయినా ప్రతి పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ పదుల సంఖ్యలో ఓట్లు ఉన్నాయి. అదే సరైన నాయకత్వం, సరైన మార్గనిర్దేశం ఉంటే వదుల ఓట్లు వందలవుతాయి.. వందల ఓట్లు వేలుగా మారే అవకాశం ఉంది. అలా మారేందుకు ఒక నాయకుడు కావాలి. ఏపీ కాంగ్రెస్ ను విజయతీరాలకు చేర్చే నేత ఇప్పుడు అత్యవసరం.

    ఏపీలో కాంగ్రెస్ పార్టీకి అధికారం దూరమై పదేళ్లు అవుతోంది. కానీ పార్టీ హై కమాండ్ మాత్రం కాయకల్ప చికిత్స కే పరిమితం అవుతోంది. 2024 ఎన్నికలకు సన్నద్ధత లేకపోయినా.. కనీసం 2029 ఎన్నికల కైనా పార్టీని సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి మాదిరిగా ఒక బాహుబలిని నియమించి.. పార్టీ పగ్గాలు అప్పగిస్తే సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. 2023 ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెంది.. సరైన నాయకుడు కాంగ్రెస్కు లభిస్తే.. ” హస్తం ” హస్తవాసి మారే అవకాశం ఉంది. మరి హై కమాండ్ మదిలో ఏముందో చూడాలి.