TRS – BJP- Congress: కాళేశ్వరంలో నువ్వు అంత తిన్నావ్. మిషన్ భగీరథ లో భారీగా మెక్కావ్. మిషన్ కాకతీయ పేరుతో తరాలు తినేంత వెనకేశావు. ఇదీ కేసీఆర్ ను ఉద్దేశించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నుంచి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దాకా చేస్తున్న విమర్శలు. నువ్వు అంబానీకి దోచిపెట్టవ్. ఆదానికి మోకరిల్లావ్. నువ్వు ప్రభుత్వ కంపెనీలు మొత్తం అమ్ముతున్నావు. ఇదీ ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ నుంచి కేటీఆర్ దాకా చేస్తున్న ఆరోపణలు. మీ అవినీతి చిట్టా మా దగ్గర ఉందని బీజేపీ నాయకులను ఉద్దేశించి టీఆర్ఎస్ నేతలు అంటుంటే.. మీ దోపిడీ బాగోతం మొత్తం లెక్కలతో సహా నిరూపిస్తామని టీ ఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి బీజేపీ నేతలు అంటున్నారు. ఇందులో ఎవరిది వాస్తవం? ఎవరు దోచుకున్నారు? ఎన్ని కోట్లు దాచుకున్నారు? నిజంగానే ఒకరు అవినీతిని ఇంకొకరు బయట పెట్టగలరా? ఒకవేళ అవినీతి గనుక నిరూపితమయ్యే పక్షంలో అధికారంలో ఉన్న వీరిపై రాజ్యాంగ సంస్థలు నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోగలవా? లేకుంటే కాంగ్రెస్ ను మళ్లీ మట్టి కల్పించేందుకు బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు కలిపి ఆడుతున్న నాటకమా?

చెప్పేది ఒకటి చేసేది ఒకటి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ముఖ్యమైనది. కోసం ప్రభుత్వం రూ.వేలాది కోట్లు ఖర్చు చేసింది. ఆర్బీఐ అప్పులు ఇవ్వకుంటే ప్రత్యేకంగా కార్పొరేషన్ లు ఏర్పాటుచేసి రుణాలు తీసుకొచ్చింది. వీటివల్ల దీర్ఘలిక ప్రయోజనం ఎంత ఉన్నా వీటికోసం తెచ్చిన అప్పులకు రాష్ట్ర ప్రజలు కడుతున్న వడ్డీలే ఎక్కువ. నేటికీ మిషన్ భగీరథ పనులు పూర్తికాలేదు. బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు రోడ్డు ఎక్కుతున్నారు. ఇప్పటికే ఈ పదవి కోసం సుమారు ₹ 40 వేల కోట్లు ఖర్చు చేశామని ప్రభుత్వం చెబుతున్నది. పాత ట్యాంకులకే రంగులు వేసి మిషన్ భగీరథ పేరు రాశారనే ఆరోపణలు ఉన్నాయి. మొన్నటికి మొన్న మిషన్ భగీరథ నీరు తాగి మహబూబ్ నగర్ జిల్లాలో ముగ్గురు కన్ను మూశారు. కాళేశ్వరం ద్వారా ఎంత ఆయకట్టు స్థిరీకరచిందో ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవు. మిషన్ కాకతీయ ఫేస్ 1 , ఫేస్ టు లో నిర్మించిన కట్టలు చాలా వరకు కూడా బలహీనమయ్యాయి. క్షేత్రస్థాయిలో ఇన్ని అవకతవకలు కనిపిస్తున్నప్పుడు పార్లమెంటు సాక్షిగా విపక్ష పార్టీల ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన సమాధానం విస్తు గొలిపేలా ఉంది. కాళే శ్వరంలో అవినీతి జరలేదని కేంద్ర జల శక్తి మంత్రి వివరణ ఇవ్వటం, మా దృష్టికి రాలేదని చెప్పడం గమనార్హం. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ విషయంలోనూ కేంద్రం ఇప్పటివరకు ఎటువంటి సమాధానం చెప్పలేదు.
కేంద్రంపై ఆరోపణలు
మొన్నటి దాకా బీజేపీతో సఖ్యతగా ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు కారాలు మీరాలు నూరుతోంది. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతోందని, అంబానీ అదాని కోసమే పనిచేస్తోందని ఆరోపిస్తోంది. కానీ ఇదే టీఆర్ఎస్ 2015లో ఆదిలాబాద్ జిల్లా తాడిచర్ల లోని సింగరేణి గనులను ఓ కంపెనీకి కట్టబెట్టింది. ఆ కంపెనీ ఆదానికి బినామీ. ఇక పలుమార్లు జరిగిన సమావేశాల్లో అంబానీ ఆదానీలను పెట్టుబడులు పెట్టాలని కెసిఆర్, కేటీఆర్ కోరారు. మరోవైపు రాష్ట్రానికి కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని తరచు ఆరోపించే కేటీఆర్.. మొన్నటి బడ్జెట్ లెక్కల్లో కేంద్రం నుంచి సుమారు 40 వేల కోట్ల వరకు గ్రాంట్లు వస్తాయని లెక్క కట్టారు. వీటి ఆధారంగానే హరీష్ రావు నేతృత్వంలోని అధికారులు బడ్జెట్ రూపొందించారు. గతంలో పటాన్ చెరువు సమీపంలోని ఓ కంపెనీకి చెందిన సోలార్ పవర్ ప్లాంటును అదానీ దక్కించు కోవడంతో కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కొద్ది ఏళ్లు గడిచాకా ఇప్పుడు ఆ దాని, అంబానీ ల పై నిప్పులు చెరుగుతున్నారు.

కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టేందుకేనా
ఇప్పటికీ తెలంగాణలో రూరల్ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు చాలా బలంగా ఉంది. దీనిని చెక్కు చెదిరించేందుకు అటు బిజెపి ఇటు, టిఆర్ఎస్ చేయని ప్రయత్నం అంటూ లేదు. 2014 నుంచి 2019 దాకా బిజెపికి టిఆర్ఎస్ పద్దతు ఇచ్చుకుంటూనే వస్తోంది. నోట్ల రద్దు, ఆర్టికల్ 317 రద్దు, త్రిబుల్ తలాక్ రద్దు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, జీఎస్టీ ని ప్రవేశపెట్టడం వంటి చర్యల్లో బిజెపికి టిఆర్ఎస్ పరోక్షంగా మద్దతు ఇచ్చుకుంటూనే వస్తోంది. కానీ ఎప్పుడైతే 2019 పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి తెలంగాణ రాష్ట్రంలో నాలుగు స్థానాలు గెలుచుకుందో అప్పుడే టిఆర్ఎస్ కమలం పార్టీకి దూరం జరిగింది. ఇక అప్పటి నుంచి మొదలైన వైరం ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. ఈ మధ్యలో అయితే ఉప్పు నిప్పుగా మారింది. లోనే అటు బిజెపి ఇటు టిఆర్ఎస్ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. దీనివల్ల కాంగ్రెస్ సోయిలో లేకుండా పోతోంది. దుబ్బాక, హుజురాబాద్, జిహెచ్ఎంసి ఎన్నికల్లో కనీస స్థాయిలో ఓట్లను సాధించలేక పడింది. మరోవైపు కాంగ్రెస్ కు ఉన్న రూరల్ ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు బిజెపి లక్ష్యంగా విమర్శలు చేస్తోంది. మరోవైపు బిజెపి కూడా టిఆర్ఎస్ తమ ప్రధమ శత్రువు అని, కాంగ్రెస్ను మేము ఏమాత్రం పరిగణలోకి కూడా తీసుకోవడం లేదని చెబుతోంది. ఈ పరిణామాలతో అటు టిఆర్ఎస్, ఇటు బీజేపీ ప్రొజెక్ట్ అవుతున్నాయి. ఈ రెండు పార్టీలు ఒకటేనని కాంగ్రెస్ చెప్పే ప్రయత్నం చేస్తోంది. కానీ ఎంత మేరకు సఫలీకృతం అవుతుందనేది కాలమే చెబుతుంది.
Also Read:YSRCP Plenary-2022: జగన్ లోని ఆవేదనంతా ప్లీనరీలో ఇలా బయటపడింది
[…] […]