రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత ఆయన పేరుతో స్థాపించిన రాజీవ్ గాంధీ ట్రస్ట్ సేకరించిన విరాళాల పై పెను తుఫాన్ వచ్చేటట్లు వుంది. నిన్న చైనా రాయబార కార్యాలయం నుంచి 3 లక్షల అమెరికా డాలర్లు తీసుకోవటం గురించి వార్తలొస్తే ఈరోజు ఏకంగా ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి నిధులు బదిలీ అవ్వటం సంచలనం లేపుతుంది. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి పై ప్రధానమంత్రి కే పూర్తి నియంత్రణ వుంటుంది. అంటే మన్మోహన్ సింగ్ స్వయంగా ఈ డబ్బులు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి బదిలీ చేసినట్లే. ఇది ఖచ్చితంగా అధికార దుర్వినియోగమే. జాతీయ విపత్తు నివారణ కోసం ఎంతోమంది ప్రధానమంత్రి సహాయ నిధి కి విరాళాలు ఇస్తే వాటిని సోనియా గాంధీ కుటుంబ ట్రస్ట్ కి ఇవ్వటమంటే ఇంతకన్నా అధికార దుర్వినియోగం ఏముంటుంది? ఓ దేశ విపత్తు నివారణ కోసం ఇచ్చిన డబ్బులు ఓ కుటుంబ ట్రస్ట్ కి దానం చేయటం దాతలను అవమానించినట్లే. ఇచ్చింది మన్మోహన్ సింగ్ , తీసుకుంది మన్మోహన్ సింగ్ ట్రస్టీ గా వున్న సోనియా గాంధీ కుటుంబం. ఇంతకన్నా కుంభకోణం ఏముంది? అన్నింటికన్నా ముఖ్యం ఇది అనైతికం. మన్మోహన్ సింగ్ ప్రధానిగా వుండి తనే ట్రస్టీ గా వున్న సంస్థకు డబ్బులు ఎలా ఇస్తాడు? మన్మోహన్ సింగ్ నిజాయితీ అంటే ఇదే. వాస్తవానికి ఇది సముద్రంలో నీటిబొట్టు. యూపీఏ హయాం లో సోనియా గాంధీ పదవిలో లేకుండా రిమోట్ కంట్రోల్ తో చేసిన పనులు ఇన్నీ అన్నీ కాదు. అందులో ఇదొకటి.
అందుకే ననుకుంటా మోడీ ఈ సంవత్సరం పిఎం కేర్స్ ఫండ్ పేరుతో వేరే ఖాతా తెరిచి కరోనా మహమ్మారి నేపధ్యం లో విరాళాలకు పిలుపునిచ్చాడు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి లో ప్రధానమంత్రి తో పాటు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు / అధ్యక్షురాలు సభ్యులుగా వున్నారు. అంటే అధికారం లో వున్నా లేకపోయినా ఆ నిధి కాంగ్రెస్ చేతిలోనే ఉంటుందన్నమాట. కానీ పిఎం కేర్స్ ఫండ్ లో ప్రధానమంత్రి తో పాటు రక్షణ మంత్రి, ఆర్ధిక మంత్రి, హోం మంత్రి సభ్యులుగా వుంటారు. ఇందులో పార్టీలతో సంబంధం లేదు. ఈ కొత్త ఖాతా తెరిచినప్పుడు చాలామంది విమర్శించారు. ఇప్పటికే ఒకటి వున్నప్పుడు రెండో దానితో పనేముందని. ఇప్పుడు తెలుస్తుంది ఎందుకు అవసరమో. ఒక పార్టీ అధ్యక్షురాలు ప్రధానమంత్రి ఆధ్వర్యాన వున్న ట్రస్ట్ లో ఎక్స్ అఫిసియో సభ్యురాలుగా ఉండటాన్ని ఎలా సమర్ధించుకుంటారు? రెండోది, ఇప్పటికే ఆ ట్రస్ట్ లో అవకతవకలు జరిగినవని అర్ధమవుతుంది. కాంగ్రెస్ పాపాల చిట్టా రోజు రోజుకీ పెరిగిపోతుంది.
ప్రధానమంత్రి ఆధ్వర్యాన మూడు ట్రస్టులు వున్నాయి. ఒకటి 1948 లో ప్రారంభించిన ప్రధానమంత్రి సహాయ నిధి. ఇందులో 2019 ఆర్ధిక సంవత్సరానికి 3800 కోట్లు వున్నాయి. రెండోది, జాతీయ రక్షణ నిధి . దీనిలో 1115 కోట్లు వున్నాయి. మూడోది, ఇటీవల ప్రారంభించిన పిఎం కేర్స్ ఫండ్. ఇందులో 10 వేల కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి. ఇందులోనుంచే ఆరోగ్య మౌలిక సౌకర్యాలకు తక్షణమే నిధులు విడుదల చేయటం జరిగింది. ఇటీవల ఒక వెయ్యి కోట్లు వలస కార్మికులకు , 2 వేల కోట్లు 50 వేల వెంటిలేటర్లు కొనటానికి విడుదల చేయటం జరిగింది.
రాజీవ్ గాంధీ ఫౌండేషన్ చైర్ పర్సన్ గా సోనియా గాంధీ , ట్రస్టీ గా మన్మోహన్ సింగ్ , సభ్యులుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, చిదంబరం లు వున్నారు. దీనికి చైనా రాయబార కార్యాలయం నుంచే కాకుండా ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి , వివిధ ప్రభుత్వ మంత్రిత్వ శాఖల నుంచి, అనేక ప్రభుత్వరంగ సంస్థల నుంచి విరాళాలు వచ్చాయి. ఓ ప్రైవేటు సంస్థకి ప్రభుత్వనిధులు విచ్చలవిడిగా ఎలా వరదలై పారాయో, విదేశీ ప్రభుత్వాలనుంచి ఎలా వచ్చాయో చూస్తుంటే ముక్కుమీద వేలేసుకోవటం మనవంతయ్యింది. వడ్డించేవాడు మనవాడయితే పంక్తిలో చివర కూర్చున్నా పర్వాలేదు. యూపీఏ టైం లో ప్రభుత్వ నిధులు ఎలా వెలగ పెట్టారో వీటిని చూస్తే అర్ధమవుతుంది. మరి ప్రభుత్వ నిధులు విరాళాలుగా తీసుకున్నప్పుడు ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టారో కూడా తనిఖీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద వుంది. తక్షణం రాజీవ్ గాంధీ ఫౌండేషన్ నిధుల ఖర్చుపై వున్నత స్థాయీ దర్యాప్తు చేయాల్సిన అవసరం వుంది. సోనియా గాంధీ చేష్టల వలన కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం మిగిలివున్నా ఆ పరువు కాస్తా పోయింది. దీనితోపాటు మన్మోహన్ సింగ్ నిజాయితీ పై కూడా నీలి నీడలు కలుముకున్నాయి. మనం నిజాయితీగా ఉండటమే కాదు, నీముందు అవతలివాడు తింటున్నా మౌనంగా వుండటం కూడా అవినీతి తో రాజీ పడినట్లే కదా.
ఇంతకన్నా అత్యంత ప్రమాదకర మైనది దేశ భద్రతకి సంబంధించినది. చైనా నుంచి డబ్బులు తీసుకున్న సంవత్సరం తర్వాత చైనా కమ్యూనిస్టు పార్టీ తో రహస్య అవగాహనా ఒప్పందం కుదుర్చుకోవటం, వీటికి పర్యవసానంగా కొన్ని విధాన పర నిర్ణయాల్లో చైనాతో రాజీకి ప్రతిపాదనలు చేయటం ఇవన్నీ ఒకదాని కొకటి లింక్ వున్నాయని పరిశీలకులు భావించటం ఆందోళన కలిగించే అంశం. మొత్తం మీద సోనియా గాంధీ హయాం లో అత్యంత ప్రతిష్టగల కాంగ్రెస్ పార్టీ ని అధః పాతాళానికి తీసుకెళ్ళిన ఖ్యాతి ( అప ఖ్యాతి ) మూట కట్టుకుంది. ఇప్పట్లో కాంగ్రెస్ ని అక్కడనుంచి పైకి తీసి నిలబెట్టే పని చేసే వాళ్ళు కనబడటం లేదు. ఈ పరిస్థితుల్లో బతికి బట్ట కట్టాలంటే ఒకే ఒక్క దారి వుంది. సోనియా గాంధీ కుటుంబం పక్కకు తప్పుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపి కొత్త నాయకత్వానికి పగ్గాలు అప్పచెప్పటమొక్కటే దారి. ఆ పని ఇన్ని సంవత్సరాలు భోగ భాగ్యాలు ప్రసాదించిన కాంగ్రెస్ కోసం సోనియా గాంధీ చేయగలదా? మీ కుటుంబం కోసం కాంగ్రెస్ సభ్యులు త్యాగాలు చేసారు, వాళ్ళ కోసం కొన్నాళ్ళు మీరు పదవిని త్యాగం చేయలేరా మేడం సోనియా గాంధీ గారూ ….
An Independent Editor, Trend Stetting Analyst.
Read MoreWeb Title: Congress in doldrums because of sonia gandhi
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com