AP Congress: ఏపీలో పూర్వ వైభవం దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. వైఎస్ షర్మిలకు పీసీసీ పగ్గాలు అందించింది. ఆమె దూకుడుగా ముందుకు సాగుతున్నారు. సొంత సోదరుడుపై రాజకీయ విమర్శలు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పక్కా వ్యూహంతోనే అడుగులు వేస్తున్నట్లు సమాచారం. వైసిపి, టిడిపి,జనసేనలు బిజెపికి బీ టీం అని కాంగ్రెస్ హై కమాండ్ ఆరోపణలు చేస్తోంది. ముఖ్యంగా తమకు నష్టపరిచిన వైసీపీపై ఫోకస్ పెట్టింది. జగన్ ను ఎలాగైనా గద్దె దించాలని భావిస్తోంది. అవసరమైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏపీలో ప్రచార బాధ్యతలు అప్పగించాలని చూస్తోంది.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ముందుగా ఓటు శాతాన్ని పెంచుకోవడం ద్వారా వైసీపీని దెబ్బతీయాలని భావిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం నినాదాలతో ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నాడు ఎన్డీఏ నుంచి చంద్రబాబు బయటకు వచ్చారని.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని తిరిగి ఎన్డీఏలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. అసలు ఏపీలో బిజెపి ఉనికి లేదని.. అయినా సరే జగన్,చంద్రబాబు, పవన్ లు బిజెపి కోసం వెంపర్లాడుతున్నాయని ఆరోపిస్తోంది. అందుకే నేరుగా రంగంలోకి దిగాలని కాంగ్రెస్ పార్టీ బలంగా నిర్ణయించుకుంది.
ఏపీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నాలుగు బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. త్వరలో ప్రియాంక గాంధీ అమరావతిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆటు విశాఖ స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా జరిగే సభలో సైతం కాంగ్రెస్ తన వాణి వినిపించనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పాల్గొంటారని ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ప్రకటించారు. ఏపీపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని తెలంగాణ సీఎం రేవంత్ కు హై కమాండ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ రేవంత్ ఏపీ వస్తే బిజెపితోపాటు చంద్రబాబుపై ఎలాంటి ఆరోపణలు చేస్తారు? జగన్ విషయంలో ఎలా స్పందిస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది.