Huzurabadb By Elections: హుజూరాబాద్.. ఇక్కడ గెలుపు అధికార టీఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకం.. ఇక్కడ ఓటమి బీజేపీకి అంతకుమించిన అవమానం.. పైగా పంతం మీద జరుగుతున్న ఎన్నికలివి.. అందులో ఓటుకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకూ పంచుతున్నట్టుగా వీడియోలు బయటకు వచ్చాయి. అధికార టీఆర్ఎస్ మాత్రమే కాదు.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఈ పంచుడు పోటీలో ఉందని వీడియోలను బట్టి తెలుస్తోంది.
మధ్యలో యువకుడిని బరిలోకి దింపిన కాంగ్రెస్ చూస్తూ ఊరుకుంటుందా? ఈ పంచుడు పోటీకి చెక్ పెట్టాలని సంచలన నిర్ణయం తీసుకుంది. హుజూరాబాద్ లో నోట్ల కట్టలు నాట్యమాడుతున్నాయని కాంగ్రెస్ ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఈ ఉప ఎన్నిక రద్దు చేయాలని సంచలన ఫిర్యాదు చేయనుంది. దీంతో ఈసీ కనుక స్పందిస్తే టీఆర్ఎస్, బీజేపీల డబ్బుల పంచుడు పోటీలో ఓటర్లకు లాభం కలుగుతుంది. అదే సమయంలో డబ్బులు పంచిన పార్టీలు నిండా మునగడం ఖాయం..
హుజురాబాద్ ఎన్నికలు (Huzurabadb By Elections)రద్దు చేయాలని కోరుతూ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర ను కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో కలవాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించింది. ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి శ్రీ దాసోజు శ్రవణ్, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు కుసుమ కుమార్, హర్కర వేణుగోపాల్ తదితర తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఈసీని కలిసి హుజూరాబాద్ఉప ఎన్నికలు రద్దు చేయాలని కోరనున్నారు.
అడ్డగోలుగా అక్రమాలు, ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తూ హుజురాబాద్ లో ఓటర్లను టిఆర్ఎస్, బీజేపీ పార్టీలు కొనుగోలు చేస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఓటుకు 6 వేల రూపాయల నుంచి రూ.10 వేల వరకు డబ్బులు ఇచ్చి ఓట్లను కొనుగోలు చేస్తున్నారని ఆధారాలతో కాంగ్రెస్ ఫిర్యాదు చేయనున్నట్టు తెలిసింది.
బహుమతులు, ప్రలోభాలు, ఓట్ల కొనుగోలు, అధికార దుర్వినియోగం తదితర అక్రమాలు జరిగాయని ఆధారాలతో ఫిర్యాదు చేస్తోంది.
మూడు గంటల్లో లక్షన్నర మంది ఓటర్లకు 90 కోట్ల రూపాయలు పంపిణీ జరిగిందని, ఇంత ఘోరంగా విచ్చలవిడిగా అడ్డగోలు అక్రమాలు, ఎన్నికల నిబంధనల అతిక్రమణలు ఎక్కడా జరగలేదని ఆరోపణ లతో కాంగ్రెస్ ఫిర్యాదు చేయనుంది. ఈసీ కనుక సీరియస్ గా స్పందిస్తే ఎన్నిక రద్దు కావడం ఖాయం. అదే జరిగితే డబ్బులు పంచిన పార్టీలు నిండా మునగడం ఖాయం. ఏం జరుగుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.
Also Read: నేటితో హుజూరాబాద్, బద్వేలు ప్రచారానికి తెర.. హోరా హోరీ