
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకూ దీనంగా తయారవుతోంది.. గత ఆరేండ్లుగా పార్టీ పతనావస్థలోకి వెళ్లిపోతోంది.. వైఎస్ హయాం నాటి వైభవం ఇక కలేనా.. అని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉన్న రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకటి. వైఎస్ఆర్ హయాంలో నైతే ఏపీ ఓ వెలుగు వెలిగింది. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఉమ్మడి ఏపీలో పార్టీకి వచ్చిన సీట్లు దోహదం చేశాయి. ఇంతటి ఘన చరిత్ర ఇప్పుడు మసక బారిపోతుందా.. అంటే అవుననే చెబుతున్నాయి విశ్లేషణలు.. తెలంగాణ ఇస్తే ఇటు ఆంధ్ర ప్రదేశ్ లో … అటు తెలంగాణలో పాగా వేయచ్చనే కాంగ్రెస్ అంచనాలు తలకిందులయ్యాయి.. 2014 ఎలక్షన్స్లో తెలంగాణ ఇచ్చినందుకు అక్కడ గెలువక.. రాష్ట్రాన్ని విడగొట్టిన ఆపవాదుతో ఏపీ జనాలకు ఆగ్రహానికి గురికాక తప్పలేదు.. తెలంగాణలో టీఆర్ఎస్.. ఏపీ లో టీడీపీ జెండా ఎగిరేశాయి. ఇదిలా ఉంటే వైఎస్ మరణం తర్వాత జగన్ బయటకు వెళ్లిపోవడం.. వైఎస్ వర్గం జగన్తో వెళ్లిపోవడం కాంగ్రెస్కు కోలుకోలేని పరిస్థితిలోకి వెళ్లిపోయింది.
Also Read: ఉన్నట్టుండి.. ఏపీలో ఈ ఎర్రచందనం రాజకీయం ఏంది..?
జరిగిందేదో జరిగింది.. ఇకనైనా పార్టీని కాపాడుకుందామనుకున్న కాంగ్రెస్ పెద్దలు రాయలసీమ ప్రాంతానికి చెందిన రఘువీరారెడ్డికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. అయితే ఆయనతో పార్టీ పుంజుకుంటుందనుకుంటే.. అనూహ్యంగా ఉన్నవారే వెళ్లిపోయారు. రఘువీరా హయాంలో రెండు ఎన్నికలు వస్తే ఒక్కదాంట్లోనూ సత్తా చాటలేకపోయారు. దీంతో తానంతట తానే తప్పుకుని.. సొంత ఊర్లో వ్యవసాయం చేసుకుంటున్నారు. పార్టీని బలోపేతం చేయడానికి అనేక కారణాలు ఉన్నాయని అప్పట్లోనే ఓపెన్గా చెప్పారు. ప్రధానంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకును తన వైపునకు మళ్లించుకున్న జగన్ పై పోరాడలేకపోయానన్నారు. జగన్ పై చేయి సాధిస్తే తప్ప పార్టీ బతికి బట్టకట్టే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ శత్రువంటే టీడీపో, మరో పార్టో కాదని… వైఎస్ జగన్ పార్టేనని కుండబద్దలు కొట్టి చెప్పారు.
ఇక.. తర్వాత కాంగ్రెస్ పగ్గాలను మళ్లీ సీమ ప్రాంతానికే చెందిన మాజీ మంత్రి సాకే శైలజనాథ్కు అప్పగించారు. ఎస్సీ లీడర్ కావడంతో పార్టీకి సానుభూతి కలిసివస్తుందని అధిష్ఠానం భావించింది.. అయితే ఈయన పగ్గాలు చేపట్టి ఆర్నెళ్లు గడిచినా.. పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. ఏ వ్యూహం అమలు చేయలేక తాను విఫలమై.. పార్టీని బతికించలేకపోయానోనని రఘువీరా చెప్పారో… ఆ వ్యూహాలే అమలు చేయలేక సాకే విఫలమయ్యారు. ఇటీవల పార్టీ సీనియర్ల సమావేశం హైదరాబాద్లో నిర్వహించారు. మీ వ్యూహం ఏంటని ఏపీ వ్యవహారాల ఇన్చార్జి ఉమెన్చాందీ ప్రశ్నించినప్పుడు సాకే నీళ్లు నమిలారని కొందరు లీడర్లు ఆఫ్ ది రికార్డ్ గా చెప్పారు.
Also Read: సీఎం జగన్ ఏరికోరి మరీ పెట్టుకుంటున్నాడా?
పార్టీ పరిస్థితి ఇలా తయారు కావడంత సీనియర్లు నెమ్మదిగా నోరు విప్పుతున్నారు. జగన్ పై విమర్శలు చేయడమేనా వ్యూహమంటే.. అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో బయట పార్టీల్లో అవకాశం లేక ఈ మాత్రం లీడర్లయినా పార్టీలో ఉన్నారని చెబుతున్నారు. సాకే పగ్గాలు చేపట్టాక కేవలం తన సామాజిక వర్గం కోణంలోనే రాజకీయాలు చేస్తున్నారని.. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదంటున్నారు.. పార్టీ సభ్యత్వాలు పెంచుకోవడంపైనా దృష్టి సారించలేదంటున్నారు.. అదే టైంలో ఘర్ వాపసీ నినాదం ఇచ్చి మూడు నెలలైనా.. ఇది ఎంత వరకు సత్ఫలితాలను ఇచ్చిందో డౌటే అంటున్నారు. ఇప్పట్లో ఎలక్షన్లు లేవన్న నిర్లక్ష్యం పనికి రాదని.. సాకే అవలంబిస్తున్న ధోరణి సరికాదని పేర్కొంటున్నారు.