Maharashtra-Jharkhand Election Results : దేశంలో రెండు నెలలుగా ఆసక్తి చేపుతున్న మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 20 ముగిసింది. దీంతో నవంబర్ 23న ఈసీ కౌంటింగ్ చేపట్టింది. శనివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలైంది. దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఫలితాలో మరో మూడు నాలుగు గంటల్లో రానున్నాయి. మొదట పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వచ్చాయి. ఇందులో ఎగ్జిట్ పోల్స్‌కు అనుగుణంగానే మహారాష్ట్రలో మహాయుతి కూటమికి, జార్ఖండ్‌లో బీజేపీకి ఆధిక్యం వచ్చింది. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు 13 రాష్ట్రాల్లోని 46 అసెంబ్లీ, కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి, మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ కూడా జరుగుతోంది.
హోరా హోరీగా ఫలితాలు..
ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర, జార్ఖండ్‌లో హోరాహోరీగా వస్తున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కాస్త అధిక్యం కనబరుస్తోంది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూడా ట్టి పోటీ ఇస్తోంది. దీంతో హంగ్ వస్తుందన్న అంచనాలు వస్తున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రెండు రోజుల గడువే ఉన్న నేపథ్యంలో మహావికాస్ అఘాడీ తమ కూటమిలోని ఎమ్మెల్యేలు జారిపోకుండా ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా గెలిచిన ఎమ్మెల్యేలను క్యాంపుకు తరలించాలని నిర్ణించింది.
తెలంగాణకు తరలింపు…
మహారాష్ట్రలో తెలుగు ఓటర్లు ఎక్కువ. ఈ నేపథ్యంలో మహా వికాస్ అఘాడీ ఎమ్మెల్యేలను కూడా తెలంగాణకు తరలించాలని భావిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలకు రక్షణ ఉంటుందని కూటమి భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్‌తో కాంగ్రెస్ అధిష్టానం టచ్‌లోకి వచ్చింది. మహారాష్ట్ర నుంచి వచ్చే ఎమ్మెల్యేలను ఉంచేందుకు హోటళ్లు బుక్ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని ప్రముఖ స్టార్ హోటళ్లలో రూమ్స్ బుక్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
జార్ఖండ్ నుంచి..
ఇక జార్ఖండ్ నుంచి కూడా ఎమ్మెల్యేలను క్యాంపునకు తరలించే అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఫలితాలో పోటాపోటీగా వస్తున్నాయి. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ 40, జేఎంఎం కూటమి 37 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఈనేపథ్యంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా 41 స్థానాలు కావాలి. ఈ నేపథ్యంలో తమ కూటమి ఎమ్మెల్యేలను క్యాంప్‌కు తరలించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.