
Congress BRS Alliance: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అని ఒక నానుడి. తెలంగాణలో దీనిని త్వరలో నిజం చేసే బాధ్యతను భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీ తలకు ఎత్తుకోపోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన సంకేతాలు ఉండడంతో భారత రాష్ట్ర సమితి అధికారిక కరపత్రం నమస్తే తెలంగాణలో గత కొద్దిరోజులుగా కాంగ్రెస్ కు సంబంధించిన వార్తలు ప్రచురితమవుతున్నాయి. కాంగ్రెస్ వార్తలను ప్రచురించడమే మహా పాపంగా భావించిన నమస్తే తెలంగాణ.. తన పేపర్లో విలువైన స్పేస్ ను ఆ పార్టీకి కేటాయించడం ఇప్పుడు సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపుతోంది.
వాస్తవానికి తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ తీసుకుంటూ వస్తున్నాడు. మొదటి దఫాలో ఎన్నికైన ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్న కేసీఆర్.. రెండవ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశాడు. అయితే ఈ సమయంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రత్యామ్నాయంగా ఎదిగింది. కెసిఆర్ కు సవాల్ చేసేలా విజయాలు సాధించింది. అయితే బిజెపి అక్కడితోనే ఆగలేదు. ఏకంగా బీఆర్ఎస్ కుంభస్థలానికే గురి పెట్టింది. దీంతో కెసిఆర్ మొయినాబాద్ ఫామ్ హౌస్ లాంటి ఎపిసోడుకి తెరలేపినప్పటికీ పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో అనివార్యంగా కాంగ్రెస్ వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రోగి కోరుకున్నది పెరుగన్నమే, డాక్టర్ తినమని చెప్పిందీ పెరుగున్నమే.. అన్నట్టుగా రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేసిన నేపథ్యంలో ఇదే అదునుగా అంత కేసీఆర్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. రాహుల్ గాంధీ పై అనర్హత వేటు సరికాదని ఖండించారు. మోడీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఇదే సందర్భంలో రాహుల్ గాంధీకి సంఘీభావంగా మేము నిలబడతామని స్పష్టం చేశారు. దీంతో కేసీఆర్ నుంచి ఇటువంటి స్పందన ఆశించని వారికి ఒక్కసారిగా షాక్ తగిలినట్టు అయింది. అయితే దీని తెర వెనుక కూడా భారీ మంత్రాంగమే నడిచినట్టు ప్రచారం జరుగుతోంది.

గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లు రేవంత్ రెడ్డి పై కారాలు మిరియాలు నూరుతున్నారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. అంతేకాదు రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీకి పనికిరాడని, ఆయన కింద మేము పనిచేయలేమని అప్పట్లో బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు భేటీ కూడా నిర్వహించారు. అయితే అప్పట్లోనే వీరంతా ముఖ్యమంత్రి కేసీఆర్ తో సంప్రదింపులు జరిగినట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఇక అప్పటినుంచి కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి కలిసి పనిచేస్తాయని ప్రచారం జరుగుతూ వస్తోంది.. అయితే దీనిని రేవంత్ రెడ్డి, వరంగల్ సభలో రాహుల్ గాంధీ ఖండించినప్పటికీ.. ఆ వార్తలకు మాత్రం ఫుల్స్టాప్ కావడం లేదు.
తాజాగా కాంగ్రెస్ పార్టీలోని అత్యంత కీలకమైన ముగ్గురు నాయకులు వచ్చే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితితో కచ్చితంగా పొత్తు పెట్టుకోవాలని, ఉంటే తాము భారత రాష్ట్ర సమితిలో చేరుతామని అధిష్టానాన్ని హెచ్చరించినట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు మహారాష్ట్రలో శివసేనతో ఇలాగైతే పొత్తు పెట్టుకున్నారో.. తెలంగాణలో కూడా భారత రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకోవాలని అధిష్టానని పెద్దలకు సదరు నాయకులు సూచిస్తున్నట్టు తెలుస్తోంది.. దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోనప్పటికీ… తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ భారత రాష్ట్ర సమితితో పొత్తు అనేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని గతంలో కేసీఆర్ అనేక ఇబ్బందులు పెట్టాడు. జైలుకు కూడా పంపించాడు. గతంలో జరిగిన అవమానాలను దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి భారత రాష్ట్ర సమితి పై పోరాటం చేస్తున్నాడు. ఈ విషయంలో కాంగ్రెస్ లోని సీనియర్లు కలిసి రాకపోయినప్పటికీ తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తూనే ఉన్నాడు. మరి ప్రస్తుతం పొత్తులు అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాలంటే కచ్చితంగా ప్రతిపక్షాలు ఏకం కావాలని రాహుల్ గాంధీ పిలుపునిస్తున్నారు.. రాహుల్ గాంధీ పిలుపుకు తగినట్టుగానే కేసీఆర్ కూడా స్పందిస్తున్నారు.. మరి పొత్తుల విషయం మీద రాహుల్ గాంధీ ఆల్రెడీ ఒక హింట్ ఇచ్చారా.. అందుకే కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు భారత రాష్ట్ర సమితి తో అంట కాగాలనే నిర్ణయానికి వచ్చారా? అనే ప్రశ్నలకు త్వరలో కాలమే సమాధానం చెబుతుంది.