Congress Schemes: తెలంగాణలో సానుకూల పవనాలు వీస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గేర్ మార్చింది. ఇప్పటికే అధికార భారత రాష్ట్ర సమితి ప్రజా ఆశీర్వాద సభల పేరుతో ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో.. దానికి దీటుగా కాంగ్రెస్ పార్టీ కూడా రంగంలోకి దిగింది. ఏకంగా రాహుల్ గాంధీ ని బరిలోకి దింపింది. ఆరు గ్యారంటీలకు అదనంగా మరొకటి జోడించి ఎన్నికలవేళ ఓటర్లకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది.
ఐక్యతను చాటేందుకు..
నేతల మధ్య ఐక్యతను చాటేందుకు రాష్ట్రంలో బుధవారం నుంచి కాంగ్రెస్ పార్టీ తొలి విడత బస్సు యాత్ర చేపట్టనుంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇది సాగనుంది. ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం వద్ద తన సోదరి.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో కలిసి ఈ బస్సు యాత్రను రాహుల్ గాంధీ బుధవారం ప్రారంభించనున్నారు. బుధవారం సాయంత్రం 3 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న రాహుల్, ప్రియాంక అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో రామప్ప దేవాలయానికి చేరుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల బ్రోచర్‌ను రామప్ప దేవాలయంలో శివలింగం వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేయిస్తారు. అక్కడి నుంచి వెంకటాపూర్ మండలంలోని రామాంజపురం నిర్వహించే ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం బస్సు యాత్రను ప్రారంభించి దాదాపు 25 కిలోమీటర్ల మేర యాత్రలో ఇద్దరూ పాల్గొంటారు. రాత్రి భూపాలపల్లిలోని కేటీపీపీలో బస చేస్తారు. తిరిగి మరుసటి రోజు 19న ఉదయం 7 గంటలకు భూపాలపల్లిలోని 5 ఇన్‌క్లైన్ కమాన్ నుంచి 3 వేల బైకులతో నిరుద్యోగ యువతతో కలిసి రాహుల్‌గాంధీ ర్యాలీ నిర్వహించనున్నారు. అంబేద్కర్ సెంటర్ వద్ద నిరుద్యోగ యువతను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం బస్సు యాత్ర పెద్దపల్లి జిల్లా రామగుండం బయల్దేరుతుంది. మొదటి రోజు ములుగు జిల్లాలో, రెండో రోజు భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో, నాలుగో రోజు నిజామాబాద్ జిల్లాలో రాహుల్‌గాంధీ పర్యటన కొనసాగనుంది. ఇందుకు కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాంగ్రెస్ కు ములుగు సెంట్‌మెంట్
ఏజెన్సీ జిల్లా ములుగు సెంట్‌మెంట్ కాంగ్రెస్ లో నెలకొంది. గత ఫిబ్రవరిలో రేవంత్‌రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర ములుగు జిల్లా మేడారం వనదేవతల గద్దెల నుంచి ప్రారంభించారు. అలాగే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న బస్సు యాత్రను కూడా ములుగు జిల్లా రామప్పలోని శివాలయం నుంచి రాహుల్, ప్రియాంక గాంధీ ప్రారంభించనున్నారు. కీలకమైన రెండు యాత్రలు కూడా ములుగు జిల్లా నుంచే ప్రారంభించటం కాంగ్రెస్ కు సీతక్క సెంట్‌మెంట్ ఉందా? అనే చర్చ జరుగుతోంది. అలాగే ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామాంజపురం వద్ద బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభను రేవంత్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అగ్ర నేతలు మొత్తం ములుగు చేరుకున్నారు. కీలక నేతల రాకతో ఆ ప్రాంతం మొత్తం సందడిగా మారింది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మెజారిటీ సీట్లు సాధించడమే లక్ష్యంగా తమ పని చేస్తున్నామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. బస్సు యాత్ర కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపుతుందని వారు భావిస్తున్నారు.