Homeజాతీయ వార్తలుఒక్క ల్యాండ్‌.. ఇద్దరు యజమానులు

ఒక్క ల్యాండ్‌.. ఇద్దరు యజమానులు

One Land‌ Two Owners
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ తీసుకుంటున్న నిర్ణయాలతో అంతటా గందరగోళం నెలకొంది. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ల విషయంలో ఈ గందరగోళం ఎక్కువ కనిపిస్తోంది. ఒక్కో భూమి ఇద్దరేసి పేర్ల మీద రిజిస్ట్రేషన్లు అవుతున్నట్లు కూడా తెలుస్తోంది. స్వయంగా మంత్రి కేటీఆర్‌‌ ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. ‘‘రిజిస్ట్రేషన్లు పూర్తయి.. రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్‌ కాని భూములను మళ్లీ విక్రయిస్తున్నట్లు సమాచారం ఉంది. డబుల్‌ రిజిస్ట్రేషన్‌ చేస్తున్నట్లు ఫిర్యాదులొస్తున్నాయి. వారందరి ఫోన్‌ నంబర్లు ఉన్నాయా? లేకుంటే వారి చిరునామాలకు లేఖలు రాయండి. డబుల్‌ రిజిస్ట్రేషన్లను అడ్డుకోకపోతే ధరణి చట్టం తేవడం వల్ల తాము భూమి కోల్పోయామని ఆ రైతులు బాధపడే అవకాశం ఉంది’’ అంటూ చెప్పారు.

Also Read: కేసీఆర్ ను ఓవర్ టేక్ చేస్తున్న జగన్

ఒకవైపు భూముల విలువలు అమాంతం పెరిగిపోవడం.. మరోవైపు ధరణి రికార్డుల్లో తమ పేరిటే ఉండడంతో డబుల్‌ రిజిస్ట్రేషన్లకు ఆస్కారం ఏర్పడుతోంది. గతంలో ఎప్పుడో భూములు విక్రయించిన వారు.. మళ్లీ అదే భూమిని అమ్మేందుకు, లేదా వారసుల పేరిట బదలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో మ్యుటేషన్‌ చేసుకోని కొనుగోలుదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాము కొన్న భూములు ధరణిలో కానరాకపోవడంతో వాటిని కాపాడుకునే పనిలో పడుతున్నారు. తమకు అన్యాయం జరిగిందంటూ తహసీల్దార్‌ కార్యాలయాలకు పరుగులు తీస్తున్నారు.

నవంబరు 2 నుంచి ధరణి ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా.. ఇలాంటి ఫిర్యాదులు డజన్లకుపైగానే వచ్చాయి. తాజాగా ధరణిపై జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో మంత్రి కేటీఆర్‌ కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. ధరణి మాటున డబుల్‌ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా అడ్డుకోలేని దుస్థితి తహసీల్దార్లది. నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలంలో ఇటీవల ఇలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. పెద్దఅడిశర్లపల్లిలో సర్వేనెం.1140/అ లో ఉన్న 1.32 ఎకరాల భూమిని సదరు యజమాని 2019 ఆగస్టు 14న వేరొకరి పేరిట రిజిస్ట్రేషన్‌(డాక్యుమెంట్‌ నంబర్‌15113/2019) చేశారు. ఈ భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి.. మ్యుటేషన్‌ చేసుకోకుండానే ప్లాట్లుగా చేసి అమ్మేశాడు.

Also Read: పీసీసీ చీఫ్‌ ఎవరైనా పాదయాత్ర చేసుడే..

నవంబరు 2న ఆ పాత యజమాని అదే భూమిని మళ్లీ తమ వారసుల పేరిట రిజిస్టర్‌ చేయడం కలకలం సృష్టించింది. ఇలాంటి వాటిని అరికట్టాలంటే.. ప్రతి లావాదేవీకి ఇన్‌కంబ్రాన్స్‌ సర్టిఫికెట్‌ను జతచేసేలా నిబంధన పెట్టాలని తహసీల్దార్లు వేడుకుంటున్నా ప్రభుత్వం కనికరించడం లేదు. వాస్తవానికి 2 లక్షలకు పైగా మ్యుటేషన్లు పెండింగ్‌లో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటిదాకా కేవలం 18 వేల మంది మాత్రమే మ్యుటేషన్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ రిజిస్ట్రేషన్ల గందరగోళంలో ఇంకెన్ని వింతలు చూడాల్సి వస్తుందోనని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

1 COMMENT

Comments are closed.

Exit mobile version