Homeజాతీయ వార్తలుTelangana Congress: టీ కాంగ్రెస్‌లో కలకలం.. కమలం గూటికి మరో ఐదుగురు?

Telangana Congress: టీ కాంగ్రెస్‌లో కలకలం.. కమలం గూటికి మరో ఐదుగురు?

Telangana Congress: అభ్యర్థుల వేటలో పడ్డ బీజేపీ.. ప్రధానంగా కాంగ్రెస్‌ పార్టీలోని సీనియర్‌ నేతలపై ఫోకస్‌ పెట్టింది. కాంగ్రెస్‌ను బలహీనపరచడం ద్వారానే రాష్ట్రంలో తాము మరింత బలపడతామని భావిస్తున్న కమలం పార్టీ జాతీయ నాయకత్వం.. ఈ దిశగా వ్యూహాత్మక కార్యాచరణకు తెరతీసింది. హస్తం పార్టీలో ప్రజాకర్షణ ఉన్న నేతలను సాధ్యమైనంత త్వరగా ఆకర్షించే పనిలో పడింది. ఫలితంగా వచ్చే ఒకటి రెండు నెలల్లో కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి చేరికలు పెరుగుతాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో కీలకం కాబోతోందని అంటున్నాయి. మొన్న ఆ పార్టీ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో రాష్ట్రంలో పాలిటిక్స్‌ పీక్స్‌కు చేరాయి. పరిస్థితులు చూస్తుంటే బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ను వేగవంతం చేసిందనే చర్చ జరుగుతోంది. కాకపోతే కాషాయ పార్టీ ఈసారి రూట్‌ మార్చింది. మునుగోడు ఉపఎన్నిక ముందు టీఆర్‌ఎస్‌ నేతలపై ఫోకస్‌ పెట్టిన బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్‌ నాయకులను ఆకర్షిస్తోంది. మర్రి శశిధర్‌రెడ్డి పార్టీని వీడుతూ కాంగ్రెస్‌కు క్యాన్సర్‌ వచ్చిందని ఇప్పట్లో కోలుకోవడం కష్టమని చేసిన సెన్సేషనల్‌ కామెంట్స్‌ ఇప్పుడు కాంగ్రెస్‌లో కలకలం రేపింది. ఆ పార్టీలో సీనియర్‌ నాయకునిగా ఉన్న మర్రి తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. మరికొంతమంది సీనియర్లు పార్టీని వీడుతారని కూడా ప్రకటించారు. ఈ క్రమంలో పార్టీలో మరో ఐదుగురు నాయకులు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది.

Telangana Congress
Telangana Congress

త్వరలో బీజేపీలోకి?
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలిచి ఉంటే ఈపాటికే రాజకీయ సమీకరణాలు మారేవి. అయితే, ‘‘ఓటమి చవిచూసినా.. టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చిన నేపథ్యంలో బీజేపీలో చేరాలా! వద్దా! అని సందిగ్ధంలో ఉన్నవారికి నచ్చజెపుతున్నాం’’ అని కమలం పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో రేవంత్‌ వర్సెస్‌ సీనియర్లు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇక రేవంత్‌కు టీపీసీసీ పదవి ఇవ్వడం సీనియర్లకు అస్సలు నచ్చలేదు. ఈ క్రమంలో వారు ప్రత్యామ్నాయ పార్టీని చూసుకునే పనిలో పడ్డట్టు తెలుస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉండి, రాష్ట్రంలో పుంజుకుంటున్న బీజేపీవైపే అసంతృప్త నేతలు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఐదుగురు నేతలు ఇప్పటికే బీజేపీతో మంతనాలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఆ ఐదుగురు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ వారు పార్టీని వీడితే మాత్రం అది తెలంగాణ కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి.

అప్పుడు టీఆర్‌ఎస్‌.. ఇప్పుడు కాంగ్రెస్‌..
గతంలో చేరికలపై టీఆర్‌ఎస్‌ నేతలను టార్గెట్‌ చేసిన బీజేపీ ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చింది. దానికి కారణం లేకపోలేదు. ఒకవేళ టీఆర్‌ఎస్‌ నేతలను తమ పార్టీలో చేర్చుకుంటే వారిపై వ్యతిరేకత ఉంటుందనే భావనలో కమలం నేతలు ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ నేతలను చేర్చుకుంటే సానుకూల పవనాలు వీస్తాయని కమలనాథులు ఆలోచన చేస్తున్నారు. అందుకే బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్ష్‌లో భాగంగా ఇప్పుడు టీ కాంగ్రెస్‌ నేతలపై కాషాయ పార్టీ ఫోకస్‌ పెట్టింది. మరోవైపు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, ఆదిలాబాద్, మెదక్‌ జిల్లాలకు చెందిన కొంతమంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో బీజేపీ ముఖ్యనేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. వీరిలో ఎక్కువగారెడ్డి సామాజికవర్గం వారే ఉన్నారని తెలిసింది.

డీకే అరుణకు కీలక బాధ్యతలు
బీసీ సామాజికవర్గం నేతల చేరికలతో పార్టీకి కొత్త ఊపు వచ్చిందని, ఇప్పుడు రెడ్డి సామాజికవర్గం కూడా తోడయితే టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టడం మరింత సులభమవుతుందని బీజేపీ కీలకనేత పేర్కొన్నారు. అందుకే కాంగ్రెస్‌ నుంచి తమ పార్టీలో చేరిన మాజీ మంత్రి డీకే.అరుణకు పార్టీ జాతీయ నాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించిందని సమాచారం. కాంగ్రెస్‌ హయాంలో మంత్రిగా పనిచేసిన డీకే.అరుణకు పలువురు కాంగ్రెస్‌ సీనియర్లతో సత్సంబంధాలున్నాయి. వీరిలో కొంతమందితో ఆమె సంప్రదింపులు జరుపుతున్నారు. అరుణతోపాటు మరో ఇద్దరు కీలక నేతలు కూడా తెరవెనుక మంత్రాంగం నడిపిస్తున్నారు. ఒక్కరొక్కరుగా నేతలు చేరేలా ప్రయత్నాలు ముమ్మరం కాబోతున్నాయని తెలుస్తోంది. బీజేపీ అగ్రనాయకత్వం ప్రస్తుతం గుజరాత్‌ ఎన్నికల బిజీలో ఉందని, ఆ ఎన్నికలు పూర్తికాగానే తెలంగాణపై దృష్టి సారిస్తుందని సమాచారం. ప్రస్తుతం పదిమంది సీనియర్లతో సంప్రదింపులు జరుగుతున్నాయని, వీరిలో ఐదుగురు త్వరలో కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉందని తెలిసింది.

Telangana Congress
Telangana Congress

కాంగ్రెస్‌ ప్రభావాన్ని తగ్గిస్తేనే..
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తేనే వచ్చే ఎన్నికల్లో తమ విజయం సాధ్యమనే విషయాన్ని పార్టీ జాతీయ నాయకత్వం గుర్తించింది. మునుగోడు ఉప ఎన్నికలో ఓటింగ్‌ సరళితో ఇది స్పష్టమైంది. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటుబ్యాంకును గణనీయంగా తగ్గించడం ద్వారా విజయం సాధించగలిగామని, మునుగోడులో అలా చేయలేకపోవడం కూడా తమ ఓటమికి ఒక కారణమని చెప్పారు. అందుకే కాంగ్రెస్‌ను బలహీనపరచాల్సిందిగా పార్టీ జాతీయ నాయకత్వం నిర్దేశించినట్లు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version