ఆంధ్రప్రదేశ్ ఇంగ్లీష్ మీడియం బోధన వివాదాస్పదమైన సంగతి అందరికీ తెలిసిందే. ఎంతమంది వ్యతిరేకించారో అంతమంది మద్దత్తు తెలిపారు. వాస్తవానికి దీనిపై మాతృభాషలో విద్యావిధానం మంచిదా కాదా అనేదానికన్నా సగం మంది పిల్లలు ప్రైవేటు స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం లో ఎందుకు చదువుతున్నారనే దానిమీద ఆధారపడి ప్రభుత్వం ప్రజలను ఒప్పించింది. పెద్దవాళ్ళ పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం లో చదువుతున్నప్పుడు పేద వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం లో ఎందుకు చదవకూడదో చెప్పాలని మేధావుల్ని ప్రశ్నించింది. అంటే యోగ్యతా యోగ్యతల కన్నా అమలులో అది ఎలా సామాజిక విభజన చేసిందనే వాదన తో ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ని తీసుకొచ్చింది. ఈ వాదనను పూర్తిగా కొట్టి పారేయలేము. నిజమే మధ్యతరగతి , ఉన్నత తరగతి వర్గాల పిల్లలు ఒక్కరు కూడా తెలుగు మీడియం లో చదవనప్పుడు యోగ్యతా యోగ్యతల గురించి ఉపదేశాలు కేవలం పేద పిల్లలకేనా? అన్నింటికన్నా ముఖ్యం ఎవరయితే మాతృభాషలో విద్యాబోధన గురించి ఉపన్యాసాలు దంచుతున్నారో వాళ్ళ పిల్లలు ఎవరూ మాతృభాషలో చదవకపోవటం తో వాళ్ళ వాదనకు విలువలేకుండా పోయింది. ఇదంతా ఒక ఎత్తయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నూతన విద్యావిధానం తో చర్చ మళ్ళీ మొదటికొచ్చింది.
భాషా మాధ్యమంపై నూతన విద్యావిధానం ఏం చెబుతుంది?
నూతన విద్యావిధానం లో భాషా మాధ్యమంపై విపులంగా చర్చిటం జరిగింది. మాతృ భాష/ ఇంటి భాష/ ప్రాంతీయ భాషను ప్రోత్సహించాలని చెప్పింది. ఇందులో భాగంగా 5వ తరగతి వరకు మాతృ భాషలోనే విద్యా బోధనా జరగాలని చెప్పింది. అది 8 వ తరగతి వరకయితే ఇంకా మంచిదని చెప్పింది. అలాగే పై తరగతుల్లో కూడా దీన్ని ప్రోత్సహించాలని చెప్పింది. దీనితో ప్రచార మాధ్యమాల్లో చర్చోప చర్చలు జరిగాయి. అదీకాక ఇది ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ళల్లో కూడా అమలుచేయాలని చెప్పింది. దీనితో వివక్ష అంశం వెనకపట్టు పట్టింది. అంటే ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ళల్లో తేడా లేకుండా అందరికీ ఒకే విద్యావిధానం అమలవుతుందని చెప్పింది. దానితోబాటు త్రిభాషా సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తామని కూడా చెప్పింది. అందులో సంస్కృతాన్ని అన్ని తరగతులల్లోనూ కావాలంటే తీసుకోనేవిధంగా ప్రోత్సహించింది. మొట్టమొదటి సారి విదేశీ భాషల ప్రత్యామ్నాయాన్ని కూడా 9 నుంచి 12 వరకు పొందుపర్చింది. అయితే మూడింటిలో రెండు తప్పనిసరిగా భారతీయ భాషలై వుండాలి. ఇదీ స్థూలంగా భాషా విధానం. నూతన విద్యా విధానం ఎన్నో అంశాలపై విన్నూత్న ఆలోచనలను ప్రవేశపెట్టినా భాషా మాధ్యమమే అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆంధ్రాలో ఇది మరో వివాదాస్పద అంశ మయ్యింది
ఈ విద్యావిధానం ప్రకటించగానే ఇంకేముంది జగన్ పని గోవిందా , ఆర్భాటంగా ప్రకటించిన విద్యా విధానం అంతే ఆర్భాటంగా ముగిసిందని పత్రికలు, చానళ్ళు ప్రచారం చేసాయి. కానీ వాళ్ళు ఒక సంగతి మరచిపోయారు. నూతన విద్యావిధానం ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ళకు ఒకేలాగా వుండాలని చెప్పిన విషయం. అప్పుడు అది అందరికీ ఒకేలాగా వర్తిస్తుంది. కాబట్టి వివక్ష వుండదు. వాస్తవానికి ఇందులో జగన్ విధానం దెబ్బతిందని చెప్పటానికేమీలేదు. మాతృ భాషా మాధ్యమం అందరికీ వర్తిస్తే ఇప్పటిదాకా దానిమీదే వ్యాపారం చేసుకుంటున్న ప్రైవేటు స్కూళ్ళు అన్నింటికీ ఇది దెబ్బే. ఇందులో ఒకరికి నష్టం ఒకరికి లాభం కన్నా అందరికీ ఒకే విధానం అనే సూత్రం పైనే ఇది ఆధారపడింది. ఇంతవరకూ బాగానే వున్నా రాను రాను ఇది పూర్తిగా నీరుకారిందని చెప్పొచ్చు. మొదట్లో భావించినట్లు ఇది అందరికీ ఖచ్చితంగా వర్తించే విధానం కాదని తేలిపోయింది. ఇది స్వచ్చందమే కానీ నిర్బంధం కాదు అని వివరణ ఇచ్చారు. స్కూళ్ళు స్వేచ్చగా నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు. అంటే ప్రైవేటు స్కూళ్ళు ఈ మాతృ భాషా మాధ్యమ విధానాన్ని అమలు చేయొచ్చు చేయకపోవచ్చు. దీనితో ప్రైవేటు స్కూళ్ళు పాత విధానాన్నే కొనసాగించే అవకాశముంది. రెండోది రాష్ట్రాలు దీనిపై స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవచ్చు. అంటే ప్రభుత్వ పాటశాలల్లో ఈ మాధ్యమ విధానం అమలుచేయోచ్చు, చేయకపోవచ్చు. మరి అటువంటప్పుడు దీనిపై ఇంత గందరగోళం దేనికి? ఇంత రాజకీయ ప్రచారం దేనికి? 10+2 స్థానం లో 5+3+3+4 ఖచ్చితంగా అమలవుతుంది. కానీ ఇంగ్లీష్ మాధ్యమం నుంచి 5 వ తరగతి వరకు ఖచ్చితంగా తెలుగు మాధ్యమం ప్రవేశపెట్టాలని లేదనీ అది స్కూళ్ళు, రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టమని వివరణ ఇచ్చిన తర్వాత దీనిపై రాజకీయాలు తుస్సుమన్నాయని చెప్పాల్సి వుంది.