Pawan Kalyan- DL Ravindra Reddy: పవన్ కళ్యాణ్ బయటకు వస్తే చాలూ ప్యాకేజీ నాయకుడు, పార్ట్ టైమ్ నాయకుడు, చంద్రబాబు స్క్రిప్ట్ చదివే నేత.. ఒంటరిగా పోటీచేసే దమ్ముందా.. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు పెట్టగలరా? రాజకీయాలు అంటే సినిమాలు అనుకున్నారా? కాపుల ఓట్లను చంద్రబాబుకు అమ్మెస్తారు….అని రకరకాలుగా వైసీపీ బ్యాచ్ పేలాపనతో మనో ధైర్యాన్ని దెబ్బతీస్తోంది. సవాళ్లు విసురుతుంటుంది. చోటా నాయకుల నుంచి సీఎం జగన్ వరకూ వారిది ఒకటే మంత్రం. అదే పవన్ వ్యతిరేక నామజపం. అసలు పవన్ నాయకుడే కాదన్నది వారి అభిప్రాయం. నాయకుడంటే పార్టీ పెట్టగానే పదుల సంఖ్యలో సీట్లు, లక్షాలాది ఓట్లు అన్నదే వారి అభిమతం. అవే వారి లెక్క. ప్రశ్నిస్తే తట్టుకోలేరు. నిలదీస్తే సహించలేరు. వైఫల్యాలపై మాట్లాడితే దాడులు చేస్తారు. అధికారాన్ని ప్రయోగించి కేసులు నమోదుచేయిస్తారు. మొత్తానికైతే అనుకున్న రివేంజ్ తీర్చుకుంటారు. అన్ని రాష్ట్రాలకంటే ఏపీ భిన్నమని రుజువు చేస్తారు. మరి పవన్ విషయంలో వీరి అభిప్రాయం ఇలా ఉంటే..జగన్ తండ్రి వైఎస్సార్ తో పనిచేసిన నాయకులు మాత్రం భిన్నంగా మాట్లాడుతున్నారు.

రాజశేఖర్ రెడ్డితో సమకాలీనులుగా ఉన్న చాలామంది నాయకులు వైసీపీలో ఉన్నారు. కానీ వారెవరూ జగన్ వెన్నంటి ఉండే సాహసం చేయడం లేదు. వారు సాహసించినా వారికి జగన్ ఆ చాన్స్ ఇవ్వడం లేదు. అది తప్పు బాబు అని చెప్పేలోపే వారిని దూరం పెడుతున్నారు. వారికి తనకు మధ్య ఆ ‘నలుగుర్ని’ నియమించారు. వారిని దాటుకొని వచ్చేలోపే తన నిర్ణయాలన్నింటినీ అమలుచేస్తున్నారు. వైఎస్ హయాంలో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని కూడా చూడలేని ఆ నలుగురు అట్టహాసం చూసి జగన్ తండ్రి సమకాలికులు కూడా సైలెంట్ అవుతున్నారు. వినాసకాలే విపరీత బుద్ధి అంటూ నైరాశ్యాన్ని అలవాటు చేసుకున్నారు. తమ నాయకుడి బిడ్డ కనుక ఆయనకు కీడు జరగకూడదని కోరుకోవడం తప్ప మరే పని చేయడం లేదు. అలాగని జగన్ చర్యలను సమర్థించడం లేదు. లోలోపల మాత్రం వ్యతిరేకిస్తున్నారు. తమ అభిప్రాయాలు బయటపడకుండా దాచుకుంటున్నారు. అయితే ఎన్నాళ్లని దాచగలరు. అందుకే ఒక్కొక్కరూ బరెస్ట్ అవుతున్నారు.
తాజాగా వైఎస్ కు అత్యంత సన్నిహితుడైన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఓపెన్ అయ్యారు. తాను అభిమానించే నాయకుడు కుమారుడుఅని భావించి వైసీపీలో చేరానని.. జగన్ తండ్రిలా మంచి పాలన అందిస్తారని భావించానని.. కానీ తన ఆలోచన తప్పు అని తేలిపోయిందని ప్రకటించారు. ఇంత వరస్ట్ పాలన చూస్తానని కూడా అనుకోలేదని తెగ బాధపడ్డారు. అంతటితో ఆగకుండా తానొక వైసీపీనాయకుడినని చూడకుండా పవన్ గురించి కామెంట్స్ చేశారు. పవన్ నిజాయితీపరుడైన నాయకుడని కొనియాడారు. అటువంటి నేతను టార్గెట్ గా చేసుకొని మాట్లాడుతుండడం బాధేస్తోందన్నారు. పవన్ కు మంచి రాజకీయ ఫ్యూచర్ ఉందని.. నిజాయితీతో రాజకీయం చేస్తున్నారని కితాబిచ్చారు.

పవన్ నిజాయితీ గురించి వైఎస్ సహచరులు ఎన్నడో చెప్పారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం పలు సందర్భాల్లో పవన్ నిజాయితీ గురించే మాట్లాడారు. చేగొండి హరిరామజోగయ్య, దాడి వీరభద్రరావు వంటి సీనియర్లు ఎప్పుడో పవన్ నిజాయితీ గురించి క్లీన్ చీట్ ఇచ్చేశారు. అయినా ఎవరో నిర్థారించాల్సిన పనిలేదని జన సైనికులు చెబుతున్నారు. పవర్, మనీ లేకున్నా తన కష్టార్జితంతో పార్టీని నడుపుతున్నారు. సొంత డబ్బులు పెట్టి మరీ ప్రజా సమస్యలకు పరిష్కార మార్గం చూపుతున్నారు. అంతకంటే నిజాయితీ ఏం కావాలి? అని ప్రశ్నిస్తున్నారు.