Pawan Kalyan- Comedian Ali: వాళ్లిద్దరూ ప్రాణస్నేహితులు.. కలిసి సినిమాలు చేశారు. కలిసి ఒకరి ఆనందాన్ని మరొకరు పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా అంటే అలీ ఉండాల్సిందే. పవన్ ఏరికోరి మరీ అలీని తన స్నేహితుడిగా పక్కన పెట్టుకునేవాడు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సినిమాల్లో అలీకి అవకాశాలు తగ్గడంతో రాజకీయాల బాటపట్టారు. తన స్నేహితుడు పవన్ పై నమ్మకం లేక జగన్ పంచన చేరాడు. ఇప్పుడు జగన్ ఇచ్చిన పదవితో ఆయనకు నమ్మకస్తుడిగా మారాడు. సొంత స్నేహితుడిపైనే పోటీకి రెడీ అయ్యారు.

కమెడియన్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఆదేశిస్తే పవన్ పై పోటీకి సిద్ధమని ప్రకటించాడు. అలీ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అలీ వ్యాఖ్యల వెనుక జగన్ వ్యూహం ఉందా ? అన్న చర్చ ఏపీలో మొదలైంది. ఇటీవలే ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారులుగా అలీని జగన్ ప్రభుత్వం నియమించింది. తాజాగా అలీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
పవన్ కళ్యాణ్ కు ప్రాణ స్నేహితుడు కమెడియన్ అలీ. పవన్ కళ్యాణ్ సినిమాల్లో అలీ పాత్ర తప్పకుండా ఉండేది. అంతలా అలీ, పవన్ మధ్య స్నేహ బంధం కొనసాగింది. అయితే.. పవన్ జనసేన పార్టీ స్థాపించాక.. పవన్ తో దూరంగా ఉంటూ వచ్చారు అలీ. జగన్ కు దగ్గర అవుతూ వచ్చారు. 2019 ఎన్నికల్లో కూడ వైసీపీ తరపున అలీ ప్రచారం నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవి ఇస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఆ తర్వాత రాజ్యసభ సీటు ఇస్తున్నారంటూ ప్రచారం చేశారు. చివరికి ఏపీ ఎల్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి అలీకి ఇచ్చారు.
ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటి వరకు పవన్ పై నోరు విప్పని అలీ.. తొలిసారిగా పవన్ పై మాట్లాడారు. పవన్ తనకు మంచి మిత్రుడని అన్నారు. కానీ సినిమాలు వేరు.. రాజకీయాలు వేరని చెప్పారు. “ రాష్ట్రానికి ఎవరు ఏం చేశారనేది అందరికీ తెలుసు. సీఎం ఆదేశిస్తే ఎవరిపైనైనా కూడా పోటీ చేస్తానన్నారు. విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం సాధారణమన్నారు. 2024లో వైసీపీ 175కి 175 స్థానాల్లో విజయం సాధిస్తుంది“ అని అలీ ధీమా వ్యక్తం చేశారు.

అలీ అనూహ్యంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక వైసీపీ వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సినిమా రంగం నుంచి పవన్ పై విమర్శలు చేసేవారు చాలా అరుదు. అలీ కూడ విమర్శలు చేసే రకం కాదు. అలాంటి అలీతో పవన్ పై విమర్శలు చేయించడం వెనుక వైసీపీ దురుద్దేశ్యం ఉందని జనసేన భావిస్తోంది. ఇటీవల పవన్ వైసీపీ పై విరుచుకుపడుతున్నారు. పవన్ పై వైసీపీ మంత్రులతో విమర్శలు చేయిస్తోంది. మరో అడుగు ముందకేసి పవన్ కు సన్నిహితంగా ఉండే అలీతో విమర్శలు చేయించడం వెనుక వైసీపీ రాజకీయ ప్రయోజనం ఉందని పలువురు భావిస్తున్నారు. జనసేన, టీడీపీ పొత్తులు, వేగంగా మారుతున్న ఏపీ రాజకీయాల్లో అలీ వ్యాఖ్యలు దుమారం రేపాయని చెప్పొచ్చు
Edu Oka Errihook Care Cheyoddu 👎🏻pic.twitter.com/P3ttEAZi7g
— PK Cults 🔥 (@PKCults_) January 17, 2023