
AP Politics: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మారుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇక వైసీపీ తనకు ఏ మాత్రం ఢోకా లేదని ఎన్ని పార్టీలు కలిసినా విజయం తమదేనని చెబుతోంది. మరోవైపు జనసేన, టీడీపీ మధ్య పొత్తు ఉండబోతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్ని పార్టీలు కలిసినా తమ గెలుపును అడ్డుకోలేవని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఒంటరిగానే పోరాడేందుకు వైసీపీ సిద్ధపడుతోంది. 2019 ఎన్నికల్లో అవలంభించిన వ్యూహాలనే ఈ సారి కూడా అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది.
మొదటి నుంచి జనసేన, టీడీపీ మధ్య రహస్య ఒప్పందం ఉందని వైసీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. దానికి అనుగుణంగానే వారి ప్రవర్తన కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో వీటి మధ్య పొత్తు ఉంటుందనే చెబుతున్నారు. వైసీపీ మాత్రం ప్రశాంత్ కిషోర్ ఫార్ములానే నమ్ముతోంది. ఆయన సూచించిన మార్గంలోనే ముందుకు వెళ్లాలని చూస్తోంది. ఇందుకనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది. గెలుపు ముంగిట నిలవాలని భావిస్తోంది.
మరోవైపు కాపు, కమ్మ ఓట్లను గంపగుత్తగా వేయించుకునేందుకు అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇదివరకే పవన్ కల్యాణ్ జగన్ పై చేసిన విమర్శలతో పలు కులాల్లో వ్యతిరేకత వచ్చినా దాన్ని దూరం చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. కాపు ఓట్లతో గట్టెక్కాలని పవన్ కల్యాణ్ భావిస్తుండగా వారి ఓట్లను చీలకుండా చేయాలని వైసీపీ ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో కాపు, కమ్మలను తమ పార్టీకి అనుకూలంగా మలుచుకునేందుకు ఇరు పార్టీలు సంసిద్ధమవుతున్నాయి.
వైసీపీ బీసీ ఓటు బ్యాంకును చెదరకుండా చూడాలని చూస్తోంది. ఇందుకో సం కార్యాచరణ ప్రణాళిక రచిస్తోంది. జనసేన, టీడీపీ బీసీ ఓట్ల కోసమే పాకులాడుతున్నాయని తెలుసుకున్న వైసీపీ వారి ప్రయత్నాలను వమ్ము చేయాలని భావిస్తోంది. ఇందుకోసం వారికి పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని ఆలోచిస్తోంది. టీడీపీ, జనసేన కలిసినా ఓ పదిహేను నియోజకవర్గాల్లో మాత్రమే తమ పట్టు సాధిస్తాయని అంచనా వేస్తోంది. దీంతో తమ గెలుపుకు ఏ మాత్రం నష్టం లేదని చెబుతోంది.