https://oktelugu.com/

ఆలూ లేదు.. సూలూ లేదు.. కానీ అప్పుడే నామకరణం

ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం అక్కడి నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తోంది. అయితే.. వాటిని ప్రారంభించడంతోపాటే పలు ప్రాంతాలకు అప్పుడే జగన్మోహనపురాల పేరిట నామకరణాలు చేశారు. వైఎస్‌ జగన్మోహనపురం, వైఎస్సార్‌ కాలనీ, జగనన్నకాలనీ ఇలా రకరకాల పేర్లు పెడుతూ వస్తున్నారు. అయితే.. ఆలు లేదు.. చూలు లేదు.. అన్న చందంగా వైసీపీ నేతలు చేసుకుంటున్న ప్రచారాన్ని చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. Also Read: ఆయనే ఓ పెద్ద బోడిలింగం..: పవన్‌పై కొడాలి ఫైర్‌‌ ఈనెల 25న […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 29, 2020 / 03:05 PM IST
    Follow us on


    ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం అక్కడి నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తోంది. అయితే.. వాటిని ప్రారంభించడంతోపాటే పలు ప్రాంతాలకు అప్పుడే జగన్మోహనపురాల పేరిట నామకరణాలు చేశారు. వైఎస్‌ జగన్మోహనపురం, వైఎస్సార్‌ కాలనీ, జగనన్నకాలనీ ఇలా రకరకాల పేర్లు పెడుతూ వస్తున్నారు. అయితే.. ఆలు లేదు.. చూలు లేదు.. అన్న చందంగా వైసీపీ నేతలు చేసుకుంటున్న ప్రచారాన్ని చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

    Also Read: ఆయనే ఓ పెద్ద బోడిలింగం..: పవన్‌పై కొడాలి ఫైర్‌‌

    ఈనెల 25న జగన్మోహన్‌రెడ్డి ఇళ్ల స్థల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. కానీ కొన్నిచోట్ల మాత్రమే మొక్కుబడిగా లేఅవుట్లను సిద్ధంచేసి వాటిలోనే ఎంపిక చేసిన లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేయడంలో ప్రజాప్రతినిధులు బిజీబిజీగా ఉన్నారు. జిల్లాలో తొలి విడతలో 1.53 లక్షల ఇళ్లను రూ.2,765 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణాలకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇవన్నీ పూర్తయితే 110కు పైగా గ్రామాలు ఆవిర్భవిస్తాయనేది జిల్లా అధికారుల అంచనా.

    అమలాపురం రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 20 ప్రాంతాలు ఇలా అభివృద్ధి చెందుతాయని అధికారులు అంచనాల్లో ఉన్నారు. అయితే ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి కేవలం ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో కొందరికి మాత్రమే ఆయా గ్రామాల్లో పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. రోడ్లు, ఇతర ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకుండానే పట్టాల పంపిణీ కార్యక్రమాల రోజునే జగన్‌ పేరిట నామకరణాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా పి.గన్నవరం నియోజకవర్గపరిధిలోని రాజుపాలెం, నరేంద్రపురం గ్రామాలకు చెందిన 120 మంది లబ్ధిదారులకు రాజుపాలెంలో సోమవారం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు నేతృత్వంలో పట్టాలు పంపిణీ చేశారు.

    Also Read: పవన్‌ షో వెనుక అసలు కథ ఇదేనా..?

    ఇక్కడ లేఅవుట్‌ మాత్రమే పూర్తిచేశారు. కానీ.. అప్పుడే అక్కడ కాలనీ ఏర్పాటు అయినట్లు.. వైఎస్‌ జగన్మోహనపురంగా పేరు పెట్టేశారు. భారీ ఎత్తున హోర్డింగులు సైతం ఏర్పాటు చేశారు. ఎక్కడైనా కాలనీలు పూర్తయ్యాకనే ఆ కాలనీలకు పేర్లు పెట్టేస్తుంటారు. కానీ.. ఇక్కడ లబ్ధిదారుల చేతిలో పట్టాలు పెట్టి ఆ లేఅవుట్‌కి జగన్‌ పేరిట నామకరణాలు చేసి వైఎస్సార్‌ సీపీ శ్రేణులు చేస్తున్న హంగామాపై విమర్శలు వస్తున్నాయి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్