Cockroach Janata Party : ఇటీవలి కాలంలో భారత రాజకీయాల్లో ఒక కొత్త శక్తి ఆవిర్భవించింది. సంప్రదాయ పార్టీలను అధిగమించి ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు కోట్ల మంది అనుచరులను సంపాదించుకున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కేవలం ఆన్‌లైన్ ప్రచారంతో మొదలై, కేంద్ర మంత్రి రాజీనామాకు దారితీసే స్థాయికి చేరుకుంది. ఇది నమోదైన రాజకీయ పక్షం కాదు. జెన్–జీ తరం యువత స్వచ్ఛందంగా నిర్మించుకున్న ఉద్యమం.
ఎగతాళి నుంచి ఉద్యమం వరకు..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి స్పార్క్‌గా పనిచేశాయి. కొందరు యువతను ఉద్యోగాలు లేని, వృత్తుల్లో లేని, పాత్రికేయులు లేదా సామాజిక మాధ్యమ కార్యకర్తలుగా మారి దాడులు చేసేవారిగా పోల్చడం యువతలో అసంతృప్తిని రేకెత్తించింది. బోస్టన్ యూనివర్సిటీలో చదువుకుని, గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో అనుభవం ఉన్న అభిజీత్ దీప్కే మే 16న ఈ ఆన్‌లైన్ ప్రచారాన్ని ప్రారంభించారు. కొద్ది వారాల్లోనే వేలు, లక్షల మంది యువత చేరడంతో అది వేగంగా విస్తరించింది.
నాయకత్వం స్వభావం..
సీజేపీలో ప్రధానంగా పది మంది కీలక వ్యక్తులు ఉన్నారు. అభిజీత్ దీప్కేతోపాటు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా, విజేత దహియా, సోనమ్ వాంగుక్, ప్రకాశ్‌రాజ్, అతుల్ కులకర్ణి, అమూల్య ధవన్, రోనక్ ఖత్రీ, అర్పిత్ శర్మ వంటివారు ముందున్నారు. ఇది అధికారిక రాజకీయ పార్టీ కాదు కాబట్టి సంంప్రదాయ నిర్మాణం లేదు. డిజిటల్ వేదికల ద్వారా సమన్వయం, వేగవంతమైన సమాచార ప్రసారం దీని బలం.
స్పష్టమైన ఎజెండా..
ఎన్నికల్లో పోటీ చేయమని చెబుతున్న సీజేపీ స్పష్టమైన ఎజెండా కలిగి ఉంది. పదవీ విరమణ తర్వాత ప్రధాన న్యాయమూర్తులకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వకూడదని, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ఓటు మోసాలు జరిగితే ఎన్నికల కమిషనర్‌ను కఠిన చట్టం కింద అరెస్టు చేయాలని, మహిళలకు చట్టసభలు, మంత్రివర్గంలో సగం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. అంబానీ, అదానీల మీడియా సంస్థల లైసెన్సులు రద్దు చేయాలని, పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎంపీలను ఇరవై ఏళ్లపాటు పోటీ నుంచి, పదవుల నుంచి నిషేధించాలని కూడా ప్రతిపాదించారు. ఇవి వ్యవస్థాపరమైన సంస్కరణలు, లింగ సమానత్వం, మీడియా స్వేచ్ఛ, రాజకీయ నైతికతపై యువత ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్నాయి.
వీధికెక్కిన ఉద్యమం..
జూన్ 6న అభిజీత్ దీప్కే అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత జంతర్ మంతర్ వద్ద యువత సమావేశమయ్యారు. డిజిటల్ ప్రచారం కొనసాగిస్తూనే జూన్ 20న జంతర్‌మంతర్ వద్ద ధర్నా తలపెట్టారు. తర్వాతి రోజుల్లో వేలాది మందితో నిరసనలు జరిగాయి. జూన్ 28న సోనమ్ వాంగుక్ నిరాహార దీక్ష ప్రారంభించడంతో ఉద్యమం మరింత బలపడింది. ఈ ఒత్తిడి చివరకు కేంద్ర విద్యా మంత్రి రాజీనామాకు దారితీసింది.
కొత్త రకం రాజకీయం
సీజేపీ భారత రాజకీయాల్లో ముఖ్యమైన మార్పును సూచిస్తోంది. సంప్రదాయ పార్టీలు, నిధులు, సంస్థాగత నిర్మాణం లేకుండానే డిజిటల్ మాధ్యమాల ద్వారా వేగంగా మద్దతు సంపాదించి, వీధి ఉద్యమంగా మారి ఫలితం సాధించడం అరుదు. జెన్–జీ తరం నిరుద్యోగం, పరీక్ష వ్యవస్థలో విశ్వసనీయత, రాజకీయ జవాబుదారీతనం వంటి సమస్యలపై తమ అసంతృప్తిని ఇలా వ్యక్తం చేస్తోంది. అయితే ఇలాంటి ఉద్యమాల్లో సవాళ్లు కూడా ఉన్నాయి. నిర్మాణ రహితంగా ఉండటం వల్ల దీర్ఘకాలిక వ్యూహం, అంతర్గత క్రమశిక్షణ కష్టం కావచ్చు. మ్యానిఫెస్టోలోని కొన్ని అంశాలు తీవ్రమైనవి కావడంతో వాటి అమలు సాధ్యతపై చర్చ అవసరం.
సీజేపీ యువత రాజకీయ భాగస్వామ్యంలో కొత్త దశను సూచిస్తోంది. సంప్రదాయ వ్యవస్థలపై అసంతృప్తి, సాంకేతిక సాధనాల వినియోగం కలయిక ఇలాంటి ఉద్యమాలను సాధ్యం చేస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి గొంతులు వినిపించడం ఆరోగ్యకరం. అదే సమయంలో నిర్మాణాత్మక సంభాషణ, వాస్తవిక పరిష్కారాల వైపు దృష్టి సారించడం మరింత ముఖ్యం.





