Polavaram project: పోలవరం ప్రాజెక్టు ఏపీ ప్రజల జీవనాడి. ప్రాజెక్టు పూర్తయితే ఎన్నో జిల్లాలకు సాగు, తాగునీరు అందుతుంది. ఎత్తులో ఉన్న ప్రాంతాలు కూడా పంటలతో సస్యశ్యామలం అవుతాయి. ఏ సమయాన దీన్ని ప్రారంభించారో కానీ నిత్యం ఏదో ఒక ఆటంకం ఏర్పడుతోంది. గత ప్రభుత్వం పోలవరాన్ని పట్టించుకోలేదని అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు .. వెంటనే పనులను వేగిరం చేసింది. కొద్ది సమయంలోనే ప్రాజెక్టును పూర్తిచేసి ప్రజలకు అంకితమిస్తామని సీఎం జగన్ కూడా చాలా సార్లు ప్రకటించారు. అయితే ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగాలంటే.. నిధులు కూడా అంతే వేగంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక్కడే అసలు సమస్య ఏర్పడుతోంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్రాజెక్టు అయిన పోలవరానికి నిధులు విడుదల చేసే అంశంలో స్తబ్దతను కొనసాగిస్తోంది. అరచేతిలో అన్నం పెట్టి.. కంచాన్ని బీజేపీ ప్రభుత్వం దాచేసుకుంటోందని ఏపీ పాలకులు ఆరోపిస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయడంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రూ. లక్షల్లో నిధులు ఇస్తున్నామని చెబుతున్న మోదీ సర్కారు.. పైసా కూడా రాల్చడం లేదు. పనులు పూర్తి చేశాం.. అందుకు సంబంధించిన రీయింబర్స్మెంట్ పెట్టండని జగన్ సర్కారు దరఖాస్తు పెట్టుకుంటే.. బిల్లులు చెల్లించే విషయంలో వందలాది కారణాలు చెబుతూ వస్తోంది. కొర్రీలు పెడుతూనే.. నిధుల విడుదల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పోలవరం ప్రాజెక్టు ఉద్దేశం సాగు, తాగునీరు అందించడం కాగా.. తాగునీరు అందించేందుకు తాము బిల్లులు ఇవ్వమని తెగేసి చెబుతోంది. ప్రాజెక్టులు కేవలం సాగునీటి కోసమే వినియోగించాలని అడ్డుదిడ్డమైన సమాధానాలు చెబుతోంది.
సాధారణంగా ప్రాజెక్టులను సాగునీటితో పాటు తాగునీటికోసం వాడుకుంటారు. కాల్వల ద్వారా సాగునీరు సరఫరా చేస్తూనే అవసరమైన తాగునీటిని ప్రజలకు ఫిల్టర్ చేసి అందిస్తుంటారు. అయితే పోలవరం విషయంలో కేవలం సాగునీటికి అయ్యే ఖర్చును తాము భరిస్తామని కేంద్ర సర్కారు చెబుతోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా ఒప్పించాలో అని ఏపీ ప్రభుత్వ అధికారులు ఆలోచనలో పడ్డారు. ఇదెక్కడి కొర్రీ అని ఆందోనళ చెందుతున్నారు. పంపిన ప్రతీ బిల్లులో సగానికి పైగా వెనక్కి వస్తుండగా.. ప్రాజెక్టు ఎలా కట్టేదిరా నాయనా అంటూ.. ఏపీ అధికారులు అయోమయానికి గురవుతున్నారు.
పోలవరం ప్రాజెక్టు 2014 ఏప్రిల్ 1 నాటికి సంబంధించిన సాగునీటికి అయ్యే ఖర్చునే ఇస్తామని గతేడాది కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించేసింది. దాని ప్రకారం ఏపీకి ఇచ్చేది కేవలం ఏడు వేల కోట్లు మాత్రమే.. దీంతో సవరించిన అంచనాలన మరోసారి పరిశీలించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని అడుగుతోంది. కానీ బీజేపీ సర్కారు మాత్రం వచ్చిన ప్రతీ బిల్లును తిరస్కరిస్తూ.. వస్తోంది. డ్యాంకు సంబంధించిన విద్యుత్ ప్రాజెక్టుకు రావాల్సిన రూ.50కోట్లు కూడా తమకు సంబంధం లేదని చెబుతోంది.
దీంతో ఏపీ ప్రభుత్వానికి మళ్లీ పోలవరం ప్రాజెక్టు కష్టాలు ప్రారంభం అయ్యాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టు పూర్తి చేసి పరిసర ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని చెబుతూ వచ్చిన జగన్ కు తిప్పలు మొదలయ్యాయి. 2021 జూన్ నాటికే ప్రాజెక్టు పనులు అన్ని పూర్తి చేసి ప్రారంభించుకుంటామని చెప్పిన జగన్ కు కేంద్రం ఇస్తున్న షాక్ లతో దిమ్మ తిరుగుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే మేఘా కంపెనీతో రీ టెండరింగ్ వేయించిన ఏపీ ప్రభుత్వం పనులకు చెల్లించాల్సిన బిల్లులు రాకపోవడంలో ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోంది. దీంతో ఎక్కడి పనులు అక్కడే ఉండిపోగా.. మళ్లీ ఎన్నికలు వచ్చేనాటికైనా పోలవరం అందుబాటులోకి వస్తుందా అని ప్రజలు అనుకుంటున్నారు.