కొన్ని సందర్భాల్లో అధికార పార్టీ నేతలు తీసుకున్న నిర్ణయాలు వినటానికి బాగానే ఉన్నా ఆచరణలో మాత్రం అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. గతేడాది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇచ్చే బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వం, ప్రైవేట్, ఉమ్మడి సంస్థలు ఉపాధి కల్పనలో స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలి.
Also Read : సీఐని బెదిరించిన వైసీపీ ఎమ్మెల్యే.. ఫోన్ సంభాషణ లీక్?
రాబోయే అన్ని పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలకు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికే ఉన్న పరిశ్రమల్లో మరో రెండేళ్లలో స్థానికుల ఉద్యోగాలను 75 శాతానికి పెంచాల్సి ఉంది. పరిశ్రమలకు, కంపెనీలకు తగిన అర్హత కలిగిన వారు లేని పక్షంలో పరిశ్రమలు ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ఉపాధి అవకాశాలు కల్పించాలి. రాష్ట్రం, జిల్లా, జోన్ లను బట్టి స్థానికతను నిర్ణయిస్తారు. ఉపాధి అవకాశాలు పెంచడానికే జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే జగన్ తీసుకున్న ఈ నిర్ణయమే నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందని తెలుస్తోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ వన్ స్థానం సాధించిన ఏపీ స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు అని పెట్టిన నిబంధన వల్ల పలు కంపెనీల యాజమాన్యాలు ఏపీలో తమ కంపెనీ బ్రాంచ్ లను పెట్టడానికి ఆసక్తి చూపడం లేదు. పలువురు ఏపీలో పరిశ్రమలు పెట్టాలని ప్రయత్నిస్తున్నా యువతలో నైపుణ్యం లేకపోతే తమ పరిస్థితి ఏంటని ఆందోళనకు గురవుతున్నారు.
ప్రభుత్వం నిరుద్యోగులకు మేలు చేకూర్చాలని భావిస్తున్నా ఈ నిబంధనల వల్ల ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు ఏపీ వైపు చూడటం లేదు. మరోవైపు ప్రభుత్వం తీసుకున్న స్థానికులకే 75 శాతం రిజర్వేషన్లు అనే నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నిర్ణయం విషయంలో జగన్ సర్కార్ వెనక్కు తగ్గితే బాగుంటుందని లేకపోతే ఏపీలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు కావని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read : ఈ వైసీపీ ఎంపీ మాటలు భలే ఉన్నాయే..?