KCR Vs Governor : కంటపడ్డవా కనికరిస్తానేమో.. వెంటపడ్డావా వేటాడేస్తా..’ అన్నట్టుగా ఉంటుంది కేసీఆర్ తీరు.. వేడుకుంటేవరాలు ఇచ్చే బోళా శంకరుడిగా ఉండే కేసీఆర్ పగపడితే ఎంత పెద్దవాళ్లైనా సరే పక్కనపడేస్తారు. అయితే పగలు పంతాలు అన్నీ పక్కనపెట్టి తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతికి స్వాగతం పలికారు కానీ.. ఆమె గౌరవార్థం మాత్రం గవర్నర్ ఇల్లు అయిన రాజ్ భవన్ లో అడుగు పెట్టలేదు. గవర్నర్ ఇస్తున్న విందుకు మాత్రం హాజరు కాకుండా షాకిచ్చారు.
ఉద్యమం సమయంలో కెసిఆర్ కు ఈటల కుడి భుజం.. తెలంగాణ వచ్చాక ఆయన స్థానం మారింది. ఇప్పుడు ఏకంగా ఇతర పార్టీలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.. రాజకీయంగా తన అనుయాయులు అయినప్పటికీ కెసిఆర్ తన అవసరం ఉన్నంతవరకే వారికి విలువ ఉంటుంది. ఒక్కసారి తేడా కొట్టిందా ఇక అంతే సంగతులు.. అఫ్కోర్స్ ఖమ్మం సబ్ జైల్లో తనను వేసినప్పుడు కాపాడుకున్న సూది దబ్బుణం పార్టీ నాయకులు తెలంగాణ వచ్చాక ప్రగతి భవన్ కు కొరగాని వారిని చేశాడు.. మునుగోడు ఉప ఎన్నిక పుణ్యమా అని మళ్లీ వారిని దగ్గరికి తీశాడు. రాజకీయంగా ఇలా లెక్కలు వేసుకునే కేసీఆర్… ఇక మిగతా విషయాల్లో ఎలా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇక కొద్ది నెలల నుంచి ప్రగతి భవన్ కు, రాజ్ భవన్ కు ఉప్పు నిప్పులా వ్యవహారం కొనసాగుతోంది. భారత రాష్ట్ర సమితి నాయకులైతే ఒక అడుగు ముందుకేసి తమిళిసైని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు.. ఆమె కూడా తగ్గేదెలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు..
శీతాకాలం విడిదిలోనూ..
రాష్ట్రపతి అయ్యాక ద్రౌపది శీతకాలం విడిది కోసం తొలిసారి హైదరాబాద్ వచ్చారు.. ఈ నేపథ్యంలో కెసిఆర్ గవర్నర్ తమిళి సై తో కలిసి స్వాగతం పలికారు.. కానీ రాజ్ భవన్ లో జరిగిన విందుకు మాత్రం దూరంగా ఉన్నారు. గవర్నర్ తో మాట వరసకైనా మాట్లాడలేదు. గవర్నర్ కూడా ఇందుకు తగ్గట్టుగానే వ్యవహరించారు.. ఇరువురు కూడా ఎవరిదారి వారిదే అన్నట్టుగా రాష్ట్రపతికి స్వాగతం పలికారు. రాష్ట్రపతి కూడా కెసిఆర్ తో మితంగానే సంభాషించారు.. గతంలో ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ లో శీతాకాల విడిది కోసం వచ్చినప్పుడు కెసిఆర్ సాష్టాంగ నమస్కారం చేశారు.. అంటే మా ఉద్దేశం కేసీఆర్ ద్రౌపది కాళ్లు మొక్కాలని కాదు… తనకు నచ్చితే దగ్గరకు తీసుకునే కేసీఆర్… నచ్చకుంటే నిర్మోహమాటంగా దూరం పెడతారు. వాస్తవానికి ఈరోజు ద్రౌపదికి కెసిఆర్ స్వాగతం పలుకుతారని భారత రాష్ట్ర సమితి నాయకులే అనుకోలేదు. మీడియా కు కూడా ప్రగతి భవన్ నుంచి ఎటువంటి లీకులు విడుదల కాలేదు.. చివరిదాకా సస్పెన్స్ కొనసాగించిన ప్రగతి భవన్… కెసిఆర్ కాన్వాయ్ బేగంపేట వైపు వెళ్ళగానే తెరదించింది.. అక్కడ కూడా ఆయన ముభావంగానే స్వాగతం పలికారు..
-విందుకు దూరం
రాష్ట్రపతి పర్యటన పురస్కరించుకొని రాజ్ భవన్ లో గవర్నర్ తమిళసై ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కేసీఆర్ కు ఆహ్వానం కూడా పలికారు. కానీ పాత పగలను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ ఆ విందుకు హాజరు కాలేదు. ఈ విందులో భారత రాష్ట్ర సమితి నాయకులు కూడా పాల్గొనలేదు.. ఇలా రాజ్ భవన్ లో విందులకు కేసిఆర్ గైర్హాజరు కావడం ఇదే మొదటిసారి కాదు. “ఎట్ హోమ్, ఉగాది వేడుకలకు” కూడా ఆయన హాజరు కావడం లేదు.. ఆయన మాత్రమే కాదు తన మంత్రివర్గంలో ఎవరిని కూడా అటువైపు పంపించడం లేదు.. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇద్దరి మధ్య ఎంత వైరం ఉందో. ఇక రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు హైదరాబాదులో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి..
తీవ్ర ఉత్కంఠ
అంతకుముందు రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసైతో కలిసి కెసిఆర్ స్వాగతం పలుకుతారా? లేదా? అనే అంశంపై అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.. గవర్నర్ తమిళ్ సై తో కలిసి వేదిక పంచుకునేందుకు ఇష్టపడని కేసీఆర్… కొంతకాలంగా ఆమెను కలిసేందుకు అవకాశం ఉన్న ఈ కార్యక్రమంలో కూడా కనిపించడం లేదు. అయితే యాదృచ్ఛికంగా సోమవారం ఆమెతో కలిసి రాష్ట్రపతికి స్వాగతం పలకడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.. తాను ఏది చేసినా రాజకీయంగా ఆలోచించే కెసిఆర్… ఈసారి ఎటువంటి ప్రయోజనాన్ని ఆశించి స్వాగతం పలికారో అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.. అయితే ద్రౌపది గిరిజన నేపథ్యం ఉన్న మహిళ కావడంతో… తాను స్వాగతం పలకకపోతే గిరిజన వర్గాల నుంచి వ్యతిరేక భావనను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి… అప్పటికప్పుడు రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు కేసీఆర్ వెళ్లారు. అక్కడితో ఆ తంతు ముగించి… రాజ్ భవన్ విందుకు డుమ్మా కొట్టారు. తలొగ్గినట్టే ఒగ్గి… తన పంతాన్ని నెరవేర్చుకున్నారు.