KCR Rajashyamala Yagam: తెలంగాణ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది. మూడు ప్రధాన పార్టీలు రేసులో ఉన్నా ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్‌ఎస్ మాత్రమే నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. గులాబీ బాస్ కేసీఆర్ ఇప్పటికే రెండో విడత ప్రచారంతో దూకుడు పెంచారు. మరోవైపు కాంగ్రెస్ కూడా ఢిల్లీ నేతలను ప్రచారంలోకి దింపుతోంది. ఏకంగా రాహుల్ గాంధీ తెలంగాణలోనే మకాం వేశారు. ఇక.. ఏ ముఖ్యమైన కార్యక్రమం తలపెట్టినా కేసీఆర్ యాగం నిర్వహించడం పరిపాటే. తాజాగా తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావాలని యాగం మొదలు పెట్టారు. గజ్వేల్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో మూడు రోజులపాటు ఈ యాగం నిర్వహించనున్నారు.
రాజశ్యామల యాగం..
సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో మూడు రోజులపాటు రాజశ్యామల యాగాన్ని అధికారులు నిర్వహించనున్నారు. విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పర్యవేక్షణలో యాగం జరగనుంది. 200 మంది వైదికులతో యాగం నిర్వహించనున్నారు. రాజశ్యామలా అమ్మవారు, చండీ అమ్మవార్లతోపాటు ఐదుగురిని ఆవాహనం చేసుకొని హోమం నిర్వహించనున్నారు.
నేటి నుంచి ప్రారంభం..
రాజశ్యామల యాగం బుధవారం నుంచి బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ విజయ సంకల్పంతో ప్రారంభం కానుంది. రెండో రోజు వేద పారాయణాలు, హోమం చివరి రోజు పుర్ణావుతితో యాగం ముగియనుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో రాజశ్యామల, శత చండీ యాగాలను నిర్వహించనున్నారు.
శత్రువలను బలహీన పర్చేందుకే..
అధికారం రావడానికి, శత్రువుల(ప్రతిపక్షాల)బలం తగ్గడానికి, జన వశీకరణ కోసం ఈ యాగం చేస్తారని పండితులు చెబుతున్నారు. తొమ్మిది హోమ కుండాలు, వంద మంది రుత్వికులతో రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. మొదటి రోజున సీఎం కేసీఆర్ దంపతులు గోపూజ చేసి యాగ ప్రవేశం చేస్తారు. రుత్వికులు పారాయణం, జపాలు, హోమాలు నిర్వహిస్తారు. మూడో రోజున పూర్ణాహుతి కార్యక్రమాల్లో కేసీఆర్ దంపతులు పాల్గొంటారు. 2018 ఎన్నికల సమయంలోనూ ఈ యాగం చేసిన కేసీఆర్ అధికారం నిలబెట్టుకున్నారు. ఏపీలోనూ 2019 ఎన్నికల సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి ఈ యాగం నిర్వహించి అధికారంలోకి వచ్చారు.
వర్కవుట్ అయ్యేనా..
విజయం ఆకాంక్షిస్తూ చేసే ఈ యాగం ఇద్దరు సీఎంలకు సెంటిమెంట్‌గా మారింది. ఇప్పుడు ఎన్నికల్లో తిరిగి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలనేది కేసీఆర్ లక్ష్యం. అయితే ఇటీవల ఢిల్లీలో బీఆర్‌ఎస్ కార్యాలయంలోనూ కేసీఆర్ ఈ యాగం చేశారు. కానీ, అది పెద్దగా ఫలితం ఇవ్వనట్లు కనిపిస్తోంది. ప్రధాని పీఠంపై కన్నేసిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో సక్సెస్ కావాలని యాగం చేశారు. కానీ ఆరు నెలల్లోనే జాతీయ రాజకీయాల నుంచి గులాబీ బాస్ వైదొలిగినట్లు కనిపిస్తోంది. ఒక్క మహారాష్ట్రలో మినహా దేశంలో ఏరాష్ట్రంలోనూ బీఆర్‌ఎస్ సభలు నిర్వహించకపోవడమే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో మళ్లీ యాగం చేస్తున్నారు. మరి ఈ యాగం ఫలితంగా కేసీఆర్‌కు హ్యాట్రిక్ విజయం వరిస్తుందో లేదు చూడాలి మరి!