CM KCR- Mamatha Benarji Meeting: సందు దొరికితే చాలు బీజేపీ ని, ఆ పార్టీ నాయకులను సీఎం కేసీఆర్ లెఫ్ట్, రైట్ అర్సుకుంటడు. అది ప్రగతి భవన్ అయినా, జనగామ లో మీటింగ్ అయినా జానే దాన్. ఆ టైమ్ కు ఎదురుగా రాహుల్ ఉంటే సార్ నోటికి ఇక హద్దు పద్దు ఉండదు. ఇదీ చాలదన్నట్టు సొంత మీడియాలో రోజూ పేజీల కొద్దీ వార్తలతో తూర్పార బట్టిస్తాడు. ఢిల్లీ పోతా, చక్రం తిప్పుతా, మోడీని దింపుతా అని సవాళ్లు విసురుతాడు. మేధావులతో మీటింగ్ పెడతాడు. రోజుల కొద్దీ ఫామ్ హౌస్ లో చర్చలు జరుపుతాడు. అంతేనా ఉత్తర భారత పత్రికలకు పేజీల కొద్దీ జాకెట్ యాడ్స్ ఇస్తాడు. ఉత్తర భారత రైతులకి ఉదారంగా చెక్కులు ఇస్తాడు. మోదీకి అరివీర భయంకర వ్యతిరేకి అయిన కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక స్టాండ్ ఎందుకు తీసుకోవడం లేదు? స్వయంగా దీదీ ఫోన్ చేసినా నీ బెంగాలీ రసగుల్లా ఎందుకు వద్దు అంటున్నాడు? ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఈ చర్చ అసక్తికరంగా సాగుతున్నది.
మేం రాము
రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల తరఫున అభ్యర్థిని ఎంపిక చేసేందుకంటూ బుధవారం ఢిల్లీలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమావేశం తకపెట్టారు. ఇందులో పాల్గొనకూడదని టీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ పార్టీ నుంచి ఈ సమావేశానికి ఎవరూ హాజరుకాబోరని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. కాంగ్రెస్, బీజేపీల విషయంలో తమ విధానాన్ని టీఆర్ఎస్ ఇప్పటికే పలుమార్లు స్పష్టంచేసింది. ఆ రెండింటికి సమానదూరంలో ఉంటామని పేర్కొన్నది. ఢిల్లీలో సమావేశం నిర్వహిస్తున్న వారికి ఈ విషయాన్ని స్పష్టం చేసింది. కాంగ్రెస్‌ను ఆహ్వానించడంపై టీఆర్ఎస్ అసంతృప్తికి గురైనట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
కాంగ్రెస్ ను ఆహ్వానించడం సరికాదు
కాంగ్రెస్ విషయంలో తమకున్న అభ్యంతరాలు చెప్పినప్పటికీ ఆ పార్టీని ఆహ్వానించడం సరికాదని టీఆర్ఎస్ గట్టిగా అభిప్రాయపడుతున్నది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రధాన పోటీదారైన కాంగ్రెస్‌తో ఏ స్థాయిలోనూ వేదిక పంచుకొనే అవకాశమే లేదని స్పష్టం చేస్తున్నది. ఇటీవల రాహుల్ గాంధీ.. తెలంగాణకు వచ్చి బీజేపీని పల్లెత్తుమాట అనకపోగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై అవాస్తవాలు ప్రచారం చేసి వెళ్లారని.. అందువల్ల అలాంటి పార్టీతో కలసి కూర్చొని చర్చించే అవకాశమే లేదని టీఆర్ఎస్ నేతలు వివరించారు. తెలంగాణలో బీజేపీతో కుమ్మక్కు రాజకీయాలను కాంగ్రెస్ చేస్తున్నదని, గత లోక్‌సభ ఎన్నికలు మొదలుకొని మొన్నటి హుజూరాబాద్ ఎన్నికల దాకా, తనను తాను పణంగా పెట్టుకొని డిపాజిట్లు కోల్పోయి బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తున్నదని, అందువల్ల అలాంటి కాంగ్రెస్‌ను నమ్మబోమని టీఆర్ఎస్ వర్గాలు చెపుతున్నాయి.
సమావేశం తీరు బాగోలేదా?
ప్రతిపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసేందుకంటూ తలపెట్టిన ఈ సమావేశం నిర్వహణ పద్ధతే సరిగా లేదని టీఆర్ఎస్ ముఖ్యనేతలు అంటున్నారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ప్రతిపక్ష నేతలు కలిసి కూర్చొని, ఎవరికీ ఇబ్బంది లేని, అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిపై ముందు చర్చిస్తారని, ఆ తర్వాత అభ్యర్థిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తారని, కానీ ఇప్పుడు మాత్రం ముందే ఒక అభ్యర్థిని అనుకొని, ఆయనతో సంప్రదింపులు ప్రారంభించి, తర్వాత సమావేశాలు పెట్టడంలో ఆంతర్యం ఏమిటని టీఆర్ఎస్ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో సమావేశంలో పాల్గొనడం లేదని స్పష్టం చేశాయి. రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ విషయంలో ఎలాంటి వైఖరి తీసుకోవాలనే దానిపై టీఆర్ఎస్ తర్వాత నిర్ణయం తీసుకొంటుందని వివరించాయి.
Also Read:NIMS Hospital Thoracic kidney: నిమ్స్ లో అరుదైన చికిత్స..