https://oktelugu.com/

Telangana Elections 2023: హవ్వా.. పార్టీ గుర్తు ‘కారు’.. కానీ ఆయనకు మాత్రం కారు లేదట!

మన నేతల తీరు విచిత్రంగా ఉంటుంది. వాళ్లకు కార్లు, బంగ్లాలు, పొలాలు.. ఇలా కొన్ని వందల, వేల కోట్ల ఆస్తులు ఉంటాయి. కానీ అవేవీ వారి పేర్లపై ఉండవు. అంతేకాదు.. వారిలో చాలామంది అప్పుల్లో కూరుకుపోయి ఉంటారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 10, 2023 / 01:08 PM IST

    Telangana Elections 2023

    Follow us on

    Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్‌ వేళ మన నేతలకు సంబంధించిన చిత్ర విచిత్రమైన సమాచారం బయటకు వస్తోంది. మొన్న ఈటల రాజేందర్‌ తనకు కారు లేదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. దాదాపు పదేళ్లు మంత్రిగా పనిచేసి కారు లేదని పేర్కొనడం ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు సీఎం కేసీఆర్‌ అంతకు మించి షాక్‌ ఇచ్చారు. గజ్వేల్, కామారెడ్డిలో గురువారం నామినేషన్‌ వేసిన కేసీఆర్‌ అఫిడవిట్‌లో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించారు.

    అన్నీ బినామీల పేరిటేనా..
    మన నేతల తీరు విచిత్రంగా ఉంటుంది. వాళ్లకు కార్లు, బంగ్లాలు, పొలాలు.. ఇలా కొన్ని వందల, వేల కోట్ల ఆస్తులు ఉంటాయి. కానీ అవేవీ వారి పేర్లపై ఉండవు. అంతేకాదు.. వారిలో చాలామంది అప్పుల్లో కూరుకుపోయి ఉంటారు. ఇలాంటి నమ్మలేని నిజాలన్నీ.. వారు ఎన్నికల నామినేషన్‌ సమయంలో అఫిడవిట్‌ సమర్పించినప్పుడు బయటికొస్తాయి. తాజాగా బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అఫిడవిట్‌లో విశేషాలు తెలుసుకుందాం. ఈసారి గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు. గురువారం రెండుచోట్లా నామినేషన్‌ వేశారు. అప్పుడు అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పుల వివరాలు తెలిపారు.

    మొత్తం ఆస్తులు రూ.58.93 కోట్లు..
    సీఎం కేసీఆర్‌కి మొత్తం ఆస్తులు రూ.58.93 కోట్లు ఉండగా.. అప్పులు రూ.24.51 కోట్ల ఉన్నాయి. అంటే.. అప్పులు తీసేయగా.. ఆయన ఆస్తుల విలువ రూ.34.42 కోట్లు. చాలా మంది ఇది నమ్మలేకపోతున్నారు. సీఎం చరాస్తులుగా.. రూ.25.61 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు ఉన్నాయి. స్థిరాస్తులు గమనిస్తే.. బంజారాహిల్స్‌లో ఇల్లు ఉంది. కరీంనగర్‌లో ఫామ్‌హౌస్‌ ఉంది. అలాగే.. రూ.8.50 కోట్ల విలువైన భూములున్నాయి. ఐతే.. కేసీఆర్‌ పేరుతో ఏ వాహనమూ లేదు. ఆయన పార్టీ గుర్తు కారు. కానీ కేసీఆర్‌ తన పేరున కారు కొనుక్కోలేదు.

    భార్య పేరిట భారీగా ఆస్తులు..
    ఇక కేసీఆర్‌ భార్య శోభ సాధారణ గృహిణి. గతంలో కూడా ఆమె ఎలాంటి ఉద్యోగం చేయలేదు. కానీ ఆమె పేరిట భారీగా ఆస్తులు ప్రకటించారు కేసీఆర్‌. శోభ పేరుమీద 2 కేజీల 841 గ్రాముల బంగారు నగలు, 45 కేజీల వెండి వస్తువులు ఉన్నాయి. వాటి విలువ రూ.1.49 కోట్లకు పైగా ఉంది. అలాగే ఆమెకు బ్యాంకులలో రూ.6.29 కోట్లకు పైగా మనీ ఉంది. ఇంకా తెలంగాణ బ్రాడ్‌ కాస్టింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో రూ.2.31 కోట్ల విలువైన వాటాలు, తెలంగాణ పబ్లికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో రూ.4.16 కోట్లకు పైగా విలువైన వాటాలు ఉన్నాయి. ఏ పని చేయని శోభపేరిట భారీ ఆస్తులు మాత్రం ఉన్నాయి.

    కుటుంబ ఆస్తులు..
    కేసీఆర్‌ చాలా వరకు ఆస్తులను కుటుంబ ఆస్తులుగా చూపారు. కుటుంబం పేరిట రూ.9.81 కోట్లకుపైగా స్థిర, చరాస్తులు ఉన్నాయి. ఐతే.. కేసీఆర్‌ పేరు మీద రూ.8.5 కోట్ల స్థిరాస్తులు ఉండగా.. శోభ పేరుమీద ఏమీ లేవు. ఐతే.. తమకు రూ.24.51 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని చెప్పడం ఆశ్చర్యం కలిగించే అంశం. సీఎం కేసీఆర్‌కి అంత భారీగా అప్పులు చెయ్యాల్సిన అవసరం ఏముందన్న చర్చ జరుగుతోంది.