CM KCR: తెలంగాణలో ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నికలు హాట్ టాపిక్‌గా మారాయి. ఏ నలుగురు ఒక్క దగ్గర కలిసినా.. ఆ ఎన్నికల గురించే మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఎవరు గెలుస్తారు. ఏ వర్గం ఓట్లు ఎవరికి పడే ఛాన్స్ ఉంది అంటూ చర్చలు సాగుతున్నాయి. దుబ్బాకలో గెలిచినట్టుగానే హుజూరాబాద్ లో బీజేపీ విజయం సాధిస్తే రాష్ట్రంలో టీఆర్ ఎస్ పరిస్థితి ఏమిటి అంటూ ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇదే ఆలోచన సీఎం కేసీఆర్‌ను కూడా కలవరపెడుతున్నట్టుగా తెలుస్తోంది. దుబ్బాకలో సులువుగా గెలుస్తామన్న ధీమాతో ఉన్న టీఆర్ఎస్ కు రఘునందన్‌రావు గెలుపు ఊహించని షాక్ ఇచ్చింది.

దుబ్బాక ఫలితమే రిపీట్ అయితే…
టీఆర్ఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దుబ్బాక ఉప ఎన్నికలో ఫలితం అనుకోని విధంగా వచ్చింది. అంత వరకు సునాయాసంగా గెలుస్తామనే ధీమాతో ఉన్న ఆ పార్టీకి బీజేపీ పెద్ద షాక్ ఇచ్చినట్టయ్యింది. దీంతో బీజేపీకి రాష్ట్రంలో మళ్లీ ఆశలు చిగురించాయి. ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ రాష్ట్రంలో అధికారం చేపట్టాలనే ఉద్దేశంతో ఆ పార్టీ చర్యలు సాగుతున్నాయి. అదే క్రమంలో ఈటల తన మంత్రి పదివికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, వెనువెంటనే దానిని సీఎం కేసీఆర్ ఆమోదించడం, దాని తరువాత ఆయన బీజేపీలో చేరడం, ఉప ఎన్నిక రావడం వెనువెంటనే జరిగిపోయాయి. టీఆర్ఎస్ కూడా పెద్డగా పలుకుబడి లేని ఓ విద్యార్థి నాయకుడిని పోటీలో నిలిపింది. ఇక్కడ అభ్యర్థిని కాకుండా టీఆర్ఎస్‌ను చూసి ఓట్లు వేయాలని అభ్యర్థిస్తోంది. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే టీఆర్ ఎస్‌ను గెలిపిస్తాయనే ధీమాతో ఆ పార్టీ నాయకులు ఉన్నారు. అయితే దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో కూడా ఇలాగే అనుకొని దెబ్బ తిన్నామనే భయం దెబ్బతిన్నామనే భయం సీఎం కేసీఆర్‌లో కనిపిస్తున్నట్టు ఉంది. అందుకే ఈ ఎన్నికల్లో తాను ప్రత్యక్ష ప్రచారానికి దిగాలని భావిస్తున్నారు. ఎన్నికలకు రెండు, మూడు రోజుల ముందు తాను బహిరంగ సభ నిర్వహించి హుజూరాబాద్ ప్రజల మనసు గెలుచుకోవాలని చూస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు ఒప్పుకోకపోతే కనీసం రోడ్ షో అయినా నిర్వహించాలని భావిస్తున్నారు.
హుజూరాబాద్ కోసమే కొత్త పథకాలు, పనులు.. ?
హుజూరాబాద్ ఎన్నికలను సీఎం ఛాలెంజింగ్ తీసుకున్నారనడానికి ఈ మధ్య కాలంలో ప్రవేశపెట్టిన దళిత బంధు పథకమే ఒక ఉదహారణ. అక్కడ ఎన్నికల్లో గెలవడానికే ఆ పథకాన్ని ప్రవేశపెట్టారని రాష్ట్రం అంతా చర్చిస్తోంది. అలాగే కేవలం హుజూరాబాద్ పరిధిలో ఉన్న గ్రామాల్లో మాత్రమే కొత్త పనులు సాగడం, పెద్దగా మిగితా ఎక్కడా జరకపోవడాన్ని చూస్తుంటే సీఎం కేసీఆర్ దీనిని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థమవుతోంది. ఇది ఒక్క హుజూరాబాద్ ఎన్నికే కాదు.. దీనిని బట్టి రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ భవితవ్యం ఎలా ఉండబోతుందే తెలిపే ఓ యుద్ధమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చూద్దాం.. హుజూరాబాద్ ప్రజలు ఎవరికి పట్టం కడతారో, ఎవరిని ఆశీర్వదిస్తారో..