Bathukamma Sarees: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్దించాక బతుకమ్మకు ప్రాముఖ్యత పెరిగింది. అంతకు ముందు కూడా పల్లెల్లో ఆడపడుచులు బతుకమ్మను కొలిచినా.. తెలంగాణ వచ్చిన తరువాత బతుకమ్మకు విశ్వ వ్యాప్త గుర్తింపు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర పండగగా బతుకమ్మను గుర్తించి, అధికారికంగా నిర్వహించడం ప్రారంభించింది. ప్రభుత్వ ఆఫీసుల్లో, స్కూళ్లలో బతుకమ్మ పండగ నిర్వహించుకోవాలని సూచనలు చేసింది. అందులో భాగంగా రాష్ట్రంలోని మహిళలందరికీ బతుకమ్మ చీరలను దసరా కానుకగా పంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి వచ్చిన సారెగా భావించాలని కోరింది. దీంతో నేత కార్మికులకు కూడా ఉపాధి దొరుకుతుందని భావించింది. దీని కోసం ప్రతీ ఏటా కొన్ని కోట్లు ఖర్చుపెడుతోంది.
మహిళలను ఎందుకు మెప్పించడం లేదు..
బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ఎక్కడో ఓ చోట లొల్లి నడుస్తూనే ఉంది. బతుకమ్మ చీరల క్వాలిటీ బాగా లేదని, తెలంగాణ ఆడపడుచులకు ఇలాంటి చీరలా ఇచ్చేది అంటూ ఆందోళనలు సాగాయి. కొన్ని చోట్ల చీరలను తగులబెట్టారు కూడా. అయితే ఇవి ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలని, మహిళలందరూ సంతృప్తిగానే ఉన్నారని ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తోంది. కానీ నిజానికి క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే ఈ చీరల పట్ల మహిళలు కొంత వరకు అసంతృప్తిగా ఉన్నారే. పాలిస్టర్ వంటి చీరలు ఇవ్వడం, క్వాలిటీ సరిగా లేకపోవడం వల్ల ఈ చీరలు మహిళల మనసు మెప్పించడం లేదు. ఇలాంటి చీరలు ఇవ్వకపోవడమే మంచిదనే భావన మహిళలలో కనిపిస్తోంది.
బక్కెట్ల కోసం చీరలు అమ్ముతున్న మహిళలు.. అప్రతిష్టపాలైన ప్రభుత్వం
బతుకమ్మ చీరలు ఇస్తే ప్లాస్టిక్ బక్కెట్లు ఇస్తాం అంటూ ఓ మహిళ మహిళ టబ్బులు పట్టుకొని తిరగే ఫొటో ఈ మధ్య వైరల్‌గా మారింది. దాదాపు ప్రతీ పత్రిక ఈ వార్తను ప్రచురితం చేశాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రతిష్టపాలైంది. నాలుగు చీరలిస్తే 100 రూపాయిల విలువైన బక్కెట్టు ఇవ్వడం వల్ల.. వాటి రేంజ్ ఏంటో అర్థమవుతోందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. చీరల కోసం కోట్లు కేటాయించి, ఇలాంటి చీరలనా ప్రజలకు ఇవ్వడం అంటూ మండిపడుతున్నాయి. ఏదీ ఏమైనా ప్రభుత్వం మాత్రం చీరల నాణ్యత పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.