ఈ వానకాలం నుంచి నియంత్రిత పద్ధతిలో పంటలు సాగుచేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇదే అంశానికి సంబంధించి సీఎం కేసీఆర్ ఈనెల 21న మరోసారి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించానున్నారు. 21న మధ్యాహ్నం 2గంటలకు ప్రగతి భవన్ లో విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈసమావేశానికి మంత్రులు, కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా రైతు సంఘం అధికారులను ఆహ్వానించారు. అయితే ఈసమావేశంలో సిఎం వారితో నేరుగా చర్చించి జిల్లాల వారీగా సాగు చేయాల్సిన పంటల సాగుపై చర్చిస్తారు.
ప్రభుత్వం సూచించిన రకం పంటలే రైతులు సాగు చేయాలని, ఆ పంటలకే రైతుబంధు, మద్దతు ధర వర్తిస్తుంది కేసీఆర్ ఇప్పటికే తెలిపారు. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు పంటలు వేసి, మార్కెట్ కు తీసుకొచ్చి కొనమంటే ఎవరూ కొనరని ఆయన అన్నారు. అంగట్ల సరుకు పోసి ఆగం కావద్దని, డిమాండ్ ఉన్న పంటలే సాగు చేయాలని సూచించారు. రాష్ట్ర రైతాంగానికి వీలైనంత లాభం చేకూర్చాలన్న లక్ష్యంతోనే ఈ కొత్త వ్యవసాయ పద్ధతిని ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలంటే రైతుల దృక్పథంలో మార్పులు రావాలని.. ప్రభుత్వం సూచించిన పంటలనే సాగుచేయాలని కోరారు. అటువంటప్పుడే పండించిన పంటకు మద్దతుధర లభిస్తుందని పేర్కొన్నారు. నియంత్రిత పద్ధతిలో పంటలసాగును ఈ వానకాలం నుంచి వరితో మొదలుపెడతామని సీఎం వెల్లడించారు.