
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిన్న బస్సులు తిప్పేందుకు నిర్ణయం తీసుకోగా ఈ రోజు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆగస్టు 3న పాఠశాలలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా వైరస్ కారణంగా పాఠశాలల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్టాండర్ ఆపరేషన్ ప్రోటోకాల్ (ఎస్.ఏ.పి) సిద్ధం చేయాలని విద్య, వైద్య ఆరోగ్య శాఖల అధికారులకు సూచించారు.
జులై నెలాఖరులోగా మొదటి విడతలో చేపట్టిన 15,715 స్కూళ్లలో నాడు–నేడు కింద అభివృద్ధి పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. తొమ్మిది రకాల సదుపాలను కల్పించాల్సి ఉందన్నారు. ఇందుకు సంబంధించి రూ.456 కోట్ల రివాల్వింగ్ ఫండ్ కూడా విడుదల చేసినట్లు చెప్పారు.
జులై నెలాఖరు కల్లా అన్ని స్కూళ్లలో పనులు పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లా కలెక్టర్లు ప్రతిరోజూ ఈ అంశంపై సమీక్ష చేయాలన్నారు. ఈ పనుల కోసం సిమెంటు, ఇసుక సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.