KCR Meeting With Ministers: తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. బీజేపీ తన జోరు కొనసాగిస్తోంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు సిద్ధమవుతోంది. దీంతో టీఆర్ఎస్ కూడా తన వైఖరి మార్చుకుంటోంది. పైగా ఇటీవల రెండు రేప్ లు జరగడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇవాళ సాయంత్రం మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో పార్టీ వైఖరి తెలియజేస్తారని సమాచారం. దేశంలో జరిగే మార్పులకనుగుణంగా టీఆర్ఎస్ తన రాజకీయ విధానాలు వెల్లడించాల్సి ఉంటుంది. దీనికి గాను మూకుమ్మడిగా నిర్ణయం తీసుకునేందుకు మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.
రాష్ట్రపతి ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల కావడంతో టీఆర్ఎస్ వైఖరి ఏంటో అనే దానిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ తమ అభ్యర్థిగా వెంకయ్యనాయుడు, లేకపోతే రాంనాథ్ కోవింద్ లనే తమ పార్టీ తరఫున బరిలో దింపనున్నట్లు చెబుతున్నారు. ప్రతిపక్షాలు మాత్రం అన్నాహజారే పేరు ప్రస్తావనకు తెస్తున్నాయి. కానీ వారి ప్రయత్నాలు మాత్రం ముందుకు సాగడం లేదు. ఇంతవరకు ఎలాంటి ప్రకటన వెలువడ లేదు. దీంతో కేసీఆర్ సమావేశంపై అందరి దృష్టి పడుతోంది.
Also Read: Nupur Sharma Controversy: బీజేపీ విధానాలే నుపుర్ శర్మ వ్యాఖ్యలకు కారణమా..?
ఇటీవల కాలంలో బీజేపీని వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్ మాత్రం మూడో కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేసినా అందులో స్పష్టత మాత్రం కానరావడం లేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ మీటింగ్ పై అందరిలో ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారో? సభ్యుల చేత ఏం సలహాలు, సూచనలు తీసుకుంటారో తెలియడం లేదు. అందుకే నేటి సాయంత్రం జరిగే మంత్రివర్గ సమావేశంపై చర్చ సాగుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నట్లు చెబుతున్నారు.
మరోవైపు రాష్ట్రంలో వారం రోజుల వ్యవధిలో ఇద్దరు బాలికలపై అత్యాచారాలు జరిగిన నేపథ్యంలో ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతంతో ప్రభుత్వ ప్రతిష్ట ప్రశ్నార్థకంలో పడింది. దీంతో మంత్రి కేటీఆర్ స్పందించినా సీఎం గా కేసీఆర్ కూడా మాట్లాడాల్సి ఉంది. దీంతో వారి దురాగాతాలపై సీఎం ఏం చెబుతారో అని కూడా అందరు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం నాటి సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. రాష్ట్రంలో నెలకొన్ని పరిస్థితులు ఒక వైపు మరోవైపు రాష్ట్రపతి ఎన్నిక వ్యవహారంపై కూడా కూలంకషంగా చర్చించనున్నట్లు చెబుతున్నారు.
రాజకీయం రోజుకో మలుపు తిరుగుతున్నందున సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ చదరంగంలో కేసీఆర్ వ్యూహాలు రచించే దిట్టగా పేరున్నా ఈసారి మాత్రం ఆయనకు ప్రతికూల పరిస్థితులు ఎదురుకానున్నట్లు తెలుస్తోంది. అందుకే మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Also Read:Early Elections in Telangana: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు?