CM KCR: తెలంగాణ అసెంబ్లీకి మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. హ్యాట్రిక్ కొట్టాలని గులాబీ బాస్ వ్యూహ రచన చేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల్లోనే ఉండాలని, చేసింది చెప్పాలని సూచించారు. సర్వే నివేదికల ఆధారంగా కొందరిని మందలించారు. 30 నుంచి 40 మందిని మార్చే యోచన కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌లో 15 మంది నాయకులు వచ్చే ఎన్నికల్లో తమ వారసులను రంగంలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈమేరకు అధినేతకు ప్రతిపాదనలు పంపుతున్నారు.
వారసులకు చెక్..
మనకో రూలు.. మందికో రూలు అన్న నిబంధన బీఆర్‌ఎస్‌లో మొదటి నుంచే ఉంది. మన నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలు.. మిగతా నియోజకవర్గాలతో మనకు పనిలేదు అన్నట్లుగా ఇప్పటికే గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకే నిధులు కుమ్మరించుకుంటున్నారు. మిగతా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రుల నియోజకవర్గాలకు తూతూమంత్రంగా నిధులు ఇస్తున్నారు. ఇక ఎన్నికల విషయానికి వచ్చేసరికి.. మన కుటుంబంలో ఎంతమైందైనా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఉండొచ్చు.. మన కులం వాళ్లు తక్కువ మంది గెలిచినా మంత్రులు కావాలి అన్నట్లు బీఆర్‌ఎస్ బాస్ వ్యవహరిస్తున్నారు. ఈమేరకు మంత్రి వర్గంలో వెలమలకు అగ్రస్థానం కల్పించారు. ఇక కొడుకు, అల్లుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిచాక మంత్రి పదవులు ఇచ్చారు. బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకోలేకపోయారు. కానీ, మళ్లీ ఎమ్మెల్సీని చేశారు. బంధువుకు కరీంనగర్ ఎంపీ టికెట్, అక్కడ ఓడిపోతే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టారు. సడ్డకుని కొడుక్కు రాజ్యసభ టికెట్ ఇచ్చారు. ఇక ప్రస్తుత ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు తమ వారసులకు టికెట్ అడిగితే మాత్రం నో చాన్స్ అంటున్నారు.
వారసుల రేసులో వీరు..
ప్రస్తుత ఎమ్మెల్యేలలో చాలా మంది వచ్చే ఎన్నికల్లో తమకు కాకుండా పుత్రులకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆయన కుమారుడిని రంగంలోకి దింపాలనే ఆలోచన చేయగా, ఇటీవల అక్కడ పర్యటించిన సీఎం.. మళ్లీ పోచారమే పోటీ చేస్తారని ప్రకటించారు. పోచారం కూడా తానే పోటీ చేయనున్నట్లు తాజాగా వెల్లడించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కుమారుడి కోసం ప్రయత్నించగా.. కుదరదని అధినేత చెప్పినట్లు తెలిసింది. నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోని ఒక్కో ఎమ్మెల్యే తమ కుమారులను పోటీ చేయించాలని కోరుతుండగా సీఎం సానుకూలత వ్యక్తం చేయలేదని తెలిసింది. కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న ఓ ఎమ్మెల్యే, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా తమ వారసులకు వచ్చే ఎన్నికల్లో పోటీకి అవకాశమివ్వాలని కోరుతున్నారు.
దారి తప్పేవారిని గాడిలో పెట్టేలా..
‘మీ అంతట మీరు పొరపాట్లు చేస్తే తప్ప.. ఈసారి ఎన్నికల్లో సిటింగ్ ఎమ్మెల్యేలెవరినీ మార్చే ఉద్దేశం లేదు’ అంటూ సీఎం ఇటీవల కొన్ని సందర్భాల్లో సూచనప్రాయంగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే క్షేత్రస్థాయి నుంచి వచ్చే సమాచారం ఆధారంగా.. పనితీరు సరిగా లేని వారిని ఆయన పిలిచి హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంపై పూర్తిగా దృష్టి సారించడం లేదని, ఎక్కువ కాలం బయటే గడుపుతున్నారని, మారకుంటే ఇబ్బంది తప్పదని ఒకరికి.. కింది స్థాయి నాయకులను కలుపుకొని వెళ్లడం లేదని మరొకరికి.. ఇలా పలువురు ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి మందలించినట్లు తెలిసింది. నియోజకవర్గంపై పట్టులేని వారు, పలు విషయాల్లో వెనుకబడిన ఎమ్మెల్యేలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అప్రమత్తం చేస్తూ.. నడవడిక మార్చుకోకుంటే నిర్ణయం మరోలా ఉంటుందని సీఎం ఇప్పటికే పిలిపించి చెప్పినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. దారి తప్పుతున్న వారిని గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్ ఏమేరకు సఫలీకృతం అవుతారో చూడాలి.