BJP- CM KCR: కేంద్రంలో బీజేపీని గద్దె దించాలన్న లక్ష్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లోల అధికార బీజేపీని ఢీకొట్టడానికి బలమైన ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలని భావిస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. కలిసి వస్తారనుకున్న మిత్రులే ఇప్పుడు హ్యాండ్ ఇస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు ఒక్కొక్కటిగా కేసీఆర్‌ను దూరం పెడుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే ఎన్నికల నాటికి కేసీఆర్ ఒంటర పోరాటం చేయాల్సి వచ్చేలా ఉంది.
విపక్ష కూటమికి కేసీఆర్ ప్లాన్..
2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఎవరికి వారు వ్యూహాత్మకంగా ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తమతో కలిసి వచ్చే పార్టీలన్నింటినీ ఏకతాటి మీదికి తీసుకువచ్చి వచ్చే ఎన్నికల్లో బీజేపీపై సమరం చేయాలని భావిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీ యేతర విపక్షాలను ఏకతాటి మీదకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎన్నికల నాటికి బలమైన ప్రతిపక్షాలనన్నిటినీ ఒకచోటకు చేర్చి బీజేపీపై యుద్ధాన్ని ప్రకటించాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. దీనికోసం వివిధ రాష్ట్రాలలో ప్రతిపక్షంలో ఉన్న బలమైన నాయకులపై ఫోకస్ పెట్టారు. అందులో మమతా బెనర్జీ కూడా ఉన్నారు. దీదీ తమతో జత కడితే బీజేపీపై పోరాటం సునాయాసం అవుతుందని కేసీఆర్ భావించారు.
షాకిచ్చిన దీదీ..
అయితే మమతా బెనర్జీ మాత్రం కేసీఆర్‌కు బిగ్ షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికలలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పొత్తు ప్రజలతోనే ఉంటుందని స్పష్టం చేశారు. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికల ఫలితాల అనంతరం మాట్లాడిన మమతా బెనర్జీ 2024 ఎన్నికల్లో కేవలం ప్రజలతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళతామే తప్ప, ఇతర పార్టీలతో కూటమి ఏర్పాటు చేయబోమని స్పష్టం చేశారు. ఇక మమతా బెనర్జీ పొత్తుల డోర్ క్లోస్ చేసినట్లేల.
దూరంగా ఉంటున్న స్టాలిన్, కుమారస్వామి..
మరోవైపు కేసీఆర్ తమతో కలిసి పనిచేస్తాయని భావించిన డీఎంకే, జేడీఎస్ పార్టీల నేతలు కూడా ఇప్పుడు అంటీ ముట్టనట్లే ఉంటున్నారు. కేసీఆర్‌తో రాసుకపూసుకు తిరిగిన కుమారస్వామి తెలంగాణవైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. త్వరలో కర్ణాకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ ఎన్నికల్లో జేడీఎస్‌కు మద్దతు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. అయినా, కుమారస్వామి చాలాకాలంగా కేసీఆర్‌కు దూరంగా ఉంటున్నారు. ఇక తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా మమత బాటలోనే పయనించే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ కూటమితో ఉన్న స్టాలిన్, దానిని వీడకపోవచ్చు. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం స్టాలిన్ పుట్టిన రోజు ఘనంగా నిర్వహించారు. ఈవేడుకలకు కేసీఆర్‌ను ఆహ్వానించలేదు. దీంతో కేసీఆర్‌తో కలిసి పనిచేయడానికి డీఎంకే పెద్దాగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. బిహార్ సీఎం నితీశ్‌కుమార్ కూడా కేసీఆర్ కూటమిలో చేరే అవకాశం లేదు. నితీశ్ కాంగ్రెస్‌తోనే కలిసి పనిచేస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్ కూడా ఒంటరి పోరుకే మొగ్గు చూపుతున్నారు. ఎస్పీ, ఆర్జేడీ, ఎన్‌సీపీ, శివసేన ఇప్పటికే కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నాయి.
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పేరుతో జాతీయ రాజకీయాల కోసం చేస్తున్న ప్రయత్నాల్లో మిత్రులు అనుకున్నవారే ఇప్పుడు ఒక్కొక్కరూ దూరం అవుతున్నారు. అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి కేసీఆర్ ఒక్కరే మిగిలే పరిస్థితి కనిపిస్తోంది.