CM KCR: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మరో సంచలనానిని తెరలేపారు. పాలనకు సంబంధించి భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీ సహా ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అన్ని శాఖల ఉద్యోగులను భాగస్వామ్యం చేయనున్నట్టు తెలుస్తోంది. అందుకోసం పలు సూచనలు చేయడానికి నలుగురు ఐఏఎస్ అధికారులతో పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశారు. కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ఉద్యోగుల బదిలీలకు సంబంధించి జారీ అయిన జీవో 317 దాదాపు విజయవంతం అయినట్టుగా కనిపిస్తున్నా.. ఉద్యోగుల్లో మాత్రం తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతోంది.
పరిపాలనా సంస్కరణల కమిటీకి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజీ అండ్ కమిషనర్ శేషాద్రి అధ్యక్షత వహిస్తుండగా.. ఓఎస్డీ స్మితా సభర్వాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, మహిళా శిశుసంక్షేమశాఖ కమిషనర్ దివ్య ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
Also Read: యూపీలో బెంగాల్ సీన్ రిపీట్.. అప్పుడు ఏం జరిగిందో తెలుసుగా..?
ప్రెసిడెంట్ ఉత్తర్వుల ప్రకారం 38,643 మంది ఉద్యోగులను ఉమ్మడి జిల్లాల్లో సర్దుబాటు చేయగా.. 101 మంది ఉద్యోగులు మినహా 38,542 మంది ఉద్యోగులు ఆయా స్థానాల్లో చేరిపోయారని అధికారులు సీఎంకు వివరించారు. ఆయా జిల్లాల్లో ఏర్పడ్డ ఖాళీలను వెంటనే భర్తీ చేసేలా నోటిఫికేషన్ జారీ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఈ కమిటీకి సూచించారట.
వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే దేశంలో ప్రథమస్థానంలో నిలిచిందని, ఇంకా మెరుగైన పరిపాలనా సంస్కరణలు తీసుకువచ్చి ప్రజలకు అద్భుతమైన సేవలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజలకు నిత్యం ఎక్కువగా అందుబాటులో ఉండాల్సిన విద్య, వైద్యం, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల ద్వారా ఇంకా మెరుగైన సేవలు, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఉద్యోగుల సేవలను ఎలా ఉపయోగించుకోవాలనే విషయంలో తగు సూచనలు చేయాలని సీఎం కేసీఆర్ ఈ కమిటీకి సూచించారని తెలుస్తోంది.
Also Read: ముగ్గురు ప్రాణాలను బలిగొన్న పుకారు.. పిల్లలతో సహా కెనాల్లో దూకి..!