KCR Khammam Sabha: ” ఖమ్మంలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ కనివిని ఎరుగని స్థాయిలో నిర్వహిస్తాం. దేశానికి కొత్త దశ చూపిస్తాం.. గుణాత్మక అభివృద్ధిని ప్రజలకు అందే విధంగా రూట్ మ్యాప్ తయారు చేస్తాం.” ఇవీ ఇటీవల కొత్తగూడెంలో కలెక్టరేట్ ప్రారంభించినప్పుడు సీఎం కేసీఆర్ నోటి నుంచి వెలువడిన మాటలు.. కానీ ఇవాళ ఖమ్మం ఆవిర్భావ సభలో మాట్లాడిన మాట తీరు చూస్తే బభ్రజమానం భజగోవిందం! అంతే అంతకుమించి ఏమీ లేదు.

వాస్తవానికి ఒక పార్టీ ఆవిర్భావ సభ అంటే భారీ ఎత్తున ఉండాలి. వాళ్లు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. వాళ్లు అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను కూడా ప్రజలకు వివరించాలి. ఇవాళ ఖమ్మంలో కేసీఆర్ అలా చెప్పే ప్రయత్నం చేయలేదు. పైగా ఎప్పటిలాగే మోదీపై విమర్శలు చేసేందుకే ప్రయత్నించారు. ఢిల్లీలో రైతులు నిరసనకు దిగారు అని చెబుతున్న కేసీఆర్… దానికి కారణమైన చట్టాలకు జై కొట్టింది తను కాదా? దేశమంతా ఉచిత విద్యుత్ ఇవ్వాలని కోరిన కేసీఆర్… తెలంగాణలో ఈరోజు డిస్కములు పీకల్లోతు కష్టాల్లో ఉండటానికి కారణం తను కాదా? ఇలాంటి నెత్తి మాసిన విధానాలతో దేశాన్ని ఏం చేద్దామని? ఎస్… కేసీఆర్ మాటల్లో మోడీ ఎందుకు పనికిరాని వాడే అనుకుందాం… కానీ తెలంగాణలో కేసీఆర్ చేసింది ఏముందని? ఒక విమర్శ చేస్తే హుందాగా ఉండాలి… మరీ ముఖ్యంగా ఒక భారీ బహిరంగ సభలో మాట్లాడే ప్రతి మాట కూడా పద్ధతిగా ఉండాలి.. ఇప్పటికీ కూడా దేశంలో గుణాత్మక మార్పుకు సంబంధించి డ్రాఫ్ట్ తయారీలో ఉందన్న కేసీఆర్… ఆగ మేఘాల మీద సభ ఎందుకు నిర్వహించినట్టు? ఎవరిని మభ్యపెట్టినట్టు?
కింద నలుపులు లేవా
ఇక ఈరోజు కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్, తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, అఖిలేష్ యాదవ్, భగవంత్ సింగ్ మాన్, అరవింద్ కేజ్రీవాల్ వంటి వారు మాట్లాడారు. వాస్తవానికి వీళ్ళ కింద బోలెడు మరకలు ఉన్నాయి. అఖిలేష్ యాదవ్ మీద నమ్మకం లేకనే ఉత్తర ప్రదేశ్ జనాలు మళ్లీ యోగిని గెలిపించారు. కేరళలో పినరై విజయన్ గోల్డ్ స్కాం లో ఇరుక్కుపోయారు. ఇక అక్కడి కలెక్టర్ కృష్ణ తేజ అధికార పార్టీకి చుక్కలు చూపిస్తున్నాడు.. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ మద్యం తాగి పరువు తీసుకున్నాడు. అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణంలో ఇరుక్కుపోయాడు. ఇప్పుడు తాజాగా స్కూళ్ల కుంభకోణంలోనూ పేరు వినిపిస్తోంది. ఇలాంటి వ్యక్తులతో కేసీఆర్ ఎలాంటి గుణాత్మక మార్పు తీసుకురావాలి అనుకుంటున్నారు? ఎలాంటి సందేశం ప్రజలకు ఇవ్వాలి అనుకుంటున్నారు? గుణాత్మక మార్పుకు సంబంధించి ఇంతవరకు ఫైనల్ డ్రాఫ్ట్ తయారు కానప్పుడు దీనికి సభ నిర్వహించినట్టు?

ఆంధ్ర ప్రదేశ్ తో ఇప్పటికి తెలంగాణకు విభజన సమస్యలు ఉన్నాయి.. రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు.. వీటిని పక్కన పెట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడటం దేనికి సంకేతం? కేంద్రం ప్రైవేట్ పరం చేస్తామని చెప్పడంతో ఈ ఏడాది లాభాల్లోకి వచ్చింది. మరి ఇదే తీరుగా ఉద్యోగులు కష్టపడితే ప్రభుత్వానికి ఆ ఆలోచన వచ్చేది కాదు కదా? ఇక దేశమంతా ఉచిత విద్యుత్, 24 గంటల పాటు సరఫరా అని చెబుతున్న కేసీఆర్… తెలంగాణలో ప్రస్తుతం 12 గంటలు మాత్రమే వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తున్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. మరోవైపు సభకు నాలుగు లక్షల మంది దాకా వస్తారని లక్ష మంది మాత్రమే హాజరయ్యారు. దీంతో కేసీఆర్ కూడా ప్రసంగాన్ని మధ్యలో ముగించారు.