హుజురాబాద్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరు రసవత్తరంగా మారుతోంది. రెండు పార్టీలు రెండు కులాలు పట్టుకుని రాజకీయం చేస్తున్నాయి. దీంతో ఎవరిది పైచేయి అవుతుందో వేచి చూడాల్సిందే. ఈటల రాజేందర్ బీసీ కార్డుతో లబ్ధి పొందాలని భావించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ దళితులను టార్గెట్ చేసుకున్నారు. దీంతో రెండు కులాల మధ్య ఏర్పడిన పంచాయితీగా రాజకీయం రంగులు మారుతోంది. కేసీఆర్ దొర అని ఈటల విమర్శలు చేయడంతో ఆయనకు దళితులను దూరం చేయాలని కేసీఆర్ పన్నాగం పన్నుతున్నారు. ఇందులో భాగంగానే గురువారం జరిగిన గొడవ చెప్పుకోవాలి.
రాజకీయాలు చేయడంలో కేసీఆర్ ను మించిన వారు ఉండరు. అపర చాణక్యుడిగా పేరుపొందిన కేసీఆర్ ప్రత్యర్థిని దెబ్బ కొట్టడంలో అందెవేసిన చేయి. అందుకే రాష్ర్టంలో ప్రతిపక్షం లేకుండా చేసుకున్నారు. టీడీపీ, కాంగ్రెస్ లు అడ్రస్ లేకుండా పోవడానికి ప్రధాన కారణం కేసీఆరే. తన పదునైన ఆలోచనలతో ప్రత్యర్థిని ఇబ్బందులు పెట్టే కేసీఆర్ ఈటలను దెబ్బ కొట్టే క్రమంలో ఆయనను దళితులకు దూరం చేసే ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. కేసీఆర్ దొర అని చెప్పుకుంటూ ప్రచారం చేయడంతో ఆయనపై కావాలనే రాజకీయ కోణంలో దళిత వ్యతిరేకి అనే ముద్ర పడేలా చేయడానికి పలు కోణాల్లో ప్రచారాలు కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియాను తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు.
దళిత బంధు పథకం ఆపాలని ఎన్నికల కమిషనర్ కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో దీని వెనుక ఉన్నది ఈటలనే అని ప్రచారం చేస్తున్నారు. దళితులు బాగుపడితే చూడలేని ఈటల పథకానికి మోకాలడ్డుతున్నారని విమర్శలు చేస్తున్నారు. దీంతో దళితుల ఓట్లు ఈటలకు రాకుండా ప్రణాళిక రచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయనపై ఈ విధంగా ప్రణాళికబద్ధంగా దళితుల్లో వ్యతిరేకత వచ్చేలా చేస్తున్నారు. రాజకీయ ఎత్తుగడలతో బీజేపీని దెబ్బ కొట్టేందుకు ఇంకా ఎన్నో రకాల ప్లాన్లు వేసేందుకు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
హుజురాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు దళితులు రాజకీయం చేసింది లేదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇక్కడ మాత్రం వారికి అందలం అందని ధ్రాక్షగానే మిగిలింది. ఈ నేపథ్యంలో ఈసారి ఇక్కడి నుంచి దళితులకు అవకాశం కల్పించి వారి ఓట్లు సాధించాలని కేసీఆర్ తాపత్రయం పడుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు ఎవరికి టికెట్ ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారనే అనుమానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గంలో ఇంకా ఎన్ని మార్పులు చోటు చేసుకుంటాయోనని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మొత్తానికి నియోజవకర్గంలో బీసీ వర్సెస్ దళితులుగా మారిపోయింది రాజకీయం. రెండు వర్గాల చుట్టూ తిరుగుతోంది. బీసీ కార్డు ఉపయోగించుకుని లాభం పొందాలని చూస్తున్న ఈటలను అడ్డుకునేందుకు అధికార పార్టీ ఇంకా ఎన్ని ఎత్తులు వేస్తుందో చూడాల్సిందే. ఇప్పటికే బీజేపీ నేతలను టీఆర్ఎస్ లో చేర్చుకుంటూ బీజేపీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని గులాబీ బాస్ తలపిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయాలకు కేంద్ర బిందువుగా హుజురాబాద్ లో ఇంకా రాజకీయ రంగులు ఏ విధంగా మారుతాయో అని చూస్తున్నారు.
సీఎం కేసీఆర్ హుజురాబాద్ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఎన్ని కోట్లయినా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దళిత బంధు పథకంతో ఇంటికో పది లక్షలు ఇస్తామని ప్రకటించి వారిలో ఆశలు రేపుతున్నారు. ఇంత భారీ బడ్జెట్ ఎక్కడి నుంచి తెస్తారని ప్రతిపక్షాలు సైతం ప్రశ్నిస్తున్నాయి. ఇదంతా ఎన్నికల డ్రామా అని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ మాటలపై కొందరిలో ఇప్పటికే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ప్రజలు సైతం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.