
ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి రైతుపై తన ప్రేమను చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక రైతు సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ అనే పథకాలను ప్రవేశపెట్టారు. రైతు బీమా, రైతుబంధు, 24గంటల ఉచిత కరెంట్, మద్దతు ధరకు కొనుగోలు వంటివి చేపడుతూ రైతుకు భరోసా కల్పిస్తున్నారు. కేసీఆర్ అపాయింట్ ఒక్కోసారి మంత్రులు, ఎమ్మెల్యేలకే దొరకంతా బీజీగా ఆయన పనులు నిర్వహిస్తుంటారు. అలాంటిది ఓ యువరైతు తెలంగాణలో చేస్తున్న వినూత్న ప్రయత్నాన్ని తెలుసుకునే స్వయంగా తానే ఆ రైతుకు అపాయింట్మెంట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆ రైతు ఎవరు..? అతడిని కేసీఆర్ ఎందుకు కావాలని అనుకుంటున్నారనే ఆసక్తి అందరిలో నెలకొంది.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన కేంద్రే బాలాజీ అందరి రైతులా కాకుండా కొత్తగా ఆలోచించాడు. ఆ వినూత్న ఆలోచనే అతడికి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ఈ యువ రైతు తొలిసారి తెలంగాణ రాష్ట్రంలో ఆపిల్ పంటను పండించి అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు. కెరమెరి మండలంలోని ధనోరకు అనే గ్రామంలో ఎన్నో వ్యయప్రసాయాలకొర్చి సీసీఎంబీ శాస్త్రవేత్తల సూచనలు, సలహాలతో యాపిల్ సాగు చేస్తున్నాడు. తాను పండించిన యాపిళ్లను సీఎం కేసీఆర్ అందించాలనేది అతడి కోరిక. ఈ విషయం ఆ నోటా ఈ నోటా చేరి కేసీఆర్ వరకు చేరడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అతడి గురించి వాకబ్ చేశారు. రైతు టాలెంట్ ను గుర్తించిన సీఎం అతడిని ప్రగతి భవన్ కు రావాలని కబురు పంపించారు. ముఖ్యమంత్రి పిలుపుతో ఆ యువరైతు ఉక్కిరిబిక్కిరవుతున్నాడు.
ఇంకో వారంతో యాపిల్ పండ్లు చేతికి వస్తుందని వాటిని తీసుకొని సీఎం కేసీఆర్ కు అందించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం తనకు ప్రోత్సాహం అందిస్తే తెలంగాణలో భారీగా యాపిళ్లను పండించాలన్నదే తన లక్ష్యమని అంటున్నాడు. కశ్మీర్లో మాత్రమే కన్పించే యాపిల్ పండ్లను తెలంగాణలో పండించిన ఆ యువరైతును ప్రతీఒక్కరు అభినందించి తీరాల్సిందే..!