తెలుగు పత్రికలు ఆంధ్రలో మూడు (ఈనాడు, సాక్షి , ఆంధ్ర జ్యోతి ), తెలంగాణా లో నాలుగు ( ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ, ఆంధ్ర జ్యోతి ) గణనీయమైన సర్క్యులేషన్ కలిగివున్నాయి. మిగతా పత్రికలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. 2019 సంవత్సరంలో వాటిని చదివే పాఠకుల సంఖ్య ఎలావుందో ఒక్కసారి పరిశీలిద్దాం.
ఈనాడు :
- ఒకనాడు దేశంలో అత్యధిక పాఠకులు గల టాప్ 10 పత్రికల్లో ఈనాడు వుండేది. 2019 లో ఈనాడు ఆ స్థానాన్ని కోల్పోయింది. కారణం పాఠకులు దారుణంగా పడిపోవటం. ఇది మన తెలుగు వాళ్లకు ఆందోళన కలిగించే విషయం. తెలుగు మాట్లాడే జనాభా హిందీ, బెంగా లీ తర్వాత ఎక్కువగా వున్నా మన భాషా పత్రిక ఒక్కటికూడా మొదటి పది స్థానాల్లో లేకపోవటం బాధాకరం. అదే మలయాళీ పత్రికలు రెండింటికి ఆ పది లో చోటు దక్కింది.
- ఈనాడు ఆంధ్ర రాష్ట్రం లో 2019 మొదటి త్రైమాసకం లో 82 లక్షల 51 వేలు వుంటే సంవత్సరాంతానికి 18 లక్షలా 60 వేలు తగ్గి 63 లక్షలా 91వేలు కి పడిపోయింది. నెల్సన్ ఇండియన్ రీడర్ షిప్ సర్వే ప్రకారం ఈ గణాంకాలు ప్రచురించారు. అదే తెలంగాణ లో 70 లక్షలా 77 వేల నుంచి 51 లక్షలా 49 వేలకు పడిపోయి ఏకంగా 19 లక్షాలా 28 వేలమంది పాఠకులు తగ్గారు. ఇది ఆంధ్రా లో కన్నా ఎక్కువగా వుంది. తెలంగాణ లో అన్ని పత్రికలకి పాఠకులు తగ్గారు.
- మొత్తం రెండు రాష్ట్రాల్లో కలిపి 1 కోటి 53 లక్షల 28 వేలనుంచి 1 కోటి 15 లక్షలా 40 వేలకు పడిపోయింది. అంటే ఏకంగా 37 లక్షలా 88 వేల పాఠకులు తగ్గారు. అందుకే దేశం లోని మొదటి పది అత్యధిక పాఠకుల పత్రికల్లో స్థానం కోల్పోయింది.
సాక్షి :
- రెండో స్థానం లో వున్న సాక్షి పత్రిక ఆశ్చర్యంగా తన పాఠకుల సంఖ్యను పెంచుకోగలిగింది. దీనికి కారణం రాష్ట్రం లో జగన్ పార్టీ అధికారం లోకి రావటం. అధికారం తో పాటు వాళ్ళ అధికార పార్టీ పత్రిక పాఠకులు కూడా పెరిగారు.
- ఆంధ్ర రాష్ట్రం లో 2019 మొదటి త్రైమాసకం లో 52 లక్షలా 38 వేలున్న పాఠకులు సంవత్సరాంతానికి 57 లక్షలా 56 వేలకు పెరిగింది. అంటే ఏకంగా 5 లక్షలా 18 వేల పాఠకుల్ని పెంచుకోగలిగింది.
- తెలంగాణ లో 33 లక్షలా 84 వేల నుంచి 25 లక్షలా 93 వేలకు పడిపోయింది. అంటే ఏకంగా 7 లక్షలా 91 వేల పాఠకులు తగ్గారు. అయినా తెలంగాణాలో కూడా రెండో స్థానాన్ని నిలుపుకోగలిగింది.
- మొత్తం రెండు రాష్ట్రాల్లో కలిపి 86 లక్షలా 22 వేల నుంచి 83 లక్షలా 49 వేలకు పడిపోయింది. అంటే కేవలం 2 లక్షలా 73 వేలు మాత్రమే తగ్గింది. అంటే మొదటి స్థానం లో వున్న ఈనాడు తో వున్న తేడాను 67 లక్షలా 6 వేలనుంచి 31 లక్షలా 91 వేలకు తగ్గింది. అంటే సగానికి పైగా తేడాని తగ్గించుకోగలిగింది. అదే ఆంధ్ర లోనయితే తేడా ప్రస్తుతం కేవలం 6 లక్షలు మాత్రమే. 2020 లో ఇదే ఒరవడి కొనసాగితే ఆంధ్ర లో ఈనాడు ని అధిగమించే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు. అదే జరిగితే ఇదో పెద్ద విషయమే అవుతుంది. ఇంతవరకు ఈనాడు దగ్గరకు కూడా ఏ పత్రిక చేరలేదు. మొట్టమొదటిసారి దాని ఆధిపత్యానికి ఆంధ్ర లో గండి పడే అవకాశం కనబడుతుంది.
ఆంధ్ర జ్యోతి
- ఆంధ్ర లో మూడో స్థానం లో, తెలంగాణ లో నాలుగో స్థానం లో వున్న జ్యోతి పత్రిక ఆ స్థానాలు నిలుపుకున్నా పాఠకుల పరంగా బాగా దెబ్బతిన్నదని చెప్పొచ్చు.
- ఆంధ్ర రాష్ట్రం లో 38 లక్షలా 97 వేల నుంచి 30 లక్షలా 56 వేలకు పడిపోయింది. అంటే ఏకంగా 8 లక్షలా 41 వేల పాఠకులు తగ్గారు. మొదటి రెండు పత్రికల కు ఈ పత్రికకు తేడా గణనీయంగా పెరిగింది.
- ఇక తెలంగాణ లో 23 లక్షలా 39 వేలనుంచి 15 లక్షలా 65 వేలకు పడిపోయింది. అంటే ఏకంగా 7 లక్షలా 74 వేలు తగ్గారు.
- మొత్తం మీద చూస్తే 68 లక్షలా 70 వేల నుంచి 46 లక్షలా 21 వేలకు పడిపోయింది. అంటే 22 లక్షలా 49 వేలు తగ్గారు. ఇది గణనీయమైన తగ్గుదల. ఆంధ్ర జ్యోతి ఇటు పత్రికా , చానలు కూడా బాగా తగ్గుముఖం లో వున్నాయి.
నమస్తే తెలంగాణా :
- ఇది కేవలం తెలంగాణ లోనే ప్రచురితమవుతుంది. తెరాస అధికార పత్రిక. ఈ పత్రిక రాష్ట్రం లో మూడో స్థానం లో వుంది.
- మొదటి త్రైమాసకం లో 29 లక్షలా 73 వేల నుంచి 16 లక్షలా 16 వేలకు పడిపోయింది. అంటే 13 లక్షల 57 వేల పాఠకులు తగ్గారు.
- ఇది అన్ని పత్రికలూ రెండు రాష్ట్రాల్లో పోల్చి చూస్తే అత్యధిక తగ్గుదల. కారణం అధికార పార్టీ పత్రిక కావటం. ఎన్నికలముందు పనిగట్టుకొని కార్యకర్తలు చందాలు చేర్పించారు. కానీ ఎన్నికల తర్వాత ఆ ఊపు సహజంగానే వుండదు.
- అయితే ఇప్పటికీ స్వల్ప తేడాతో రాష్ట్రం లో మూడో స్థానాన్ని నిలుపుకోగలిగింది.
- మొత్తం మీద చూస్తే తెలంగాణ లో ఈనాడు కి ఇప్పట్లో ఎదురులేదు. రెండో స్థానం లో వున్న సాక్షి కన్నా చాలా ముందుంది. అంటే ఈనాడు తెలంగాణ లో ఈరోజుకీ అత్యంత ప్రభావ మీడియాగా చెప్పొచ్చు .
స్థూలంగా చూస్తే ఆంధ్ర లో ఈనాడు , సాక్షి పోటా పోటీగా వున్నాయి. అదే తెలంగాణ లో ఈనాడు మిగతా పత్రికలకు అందనంత దూరం లో వుంది. 2019 సాక్షి కి ఆనందాన్ని ఆంధ్ర జ్యోతి , నమస్తే తెలంగాణాల కు దుఖాన్ని మిగిల్చింది. తెలంగాణ లో అన్ని పత్రికలకు పాఠకులు తగ్గితే ఆంధ్రా లో సాక్షి కి మాత్రం పెరిగారు.
ఇక 2020 అన్ని పత్రికలకు ఖేదాన్నే కలిగిస్తాయి. కరోనా మహమ్మారి నేపధ్యం లో పత్రికల సర్క్యులేషన్ విపరీతంగా పడిపోయింది. ప్రింట్ ఎడిషన్ అన్ని పత్రికలకు ఊహించనంత దెబ్బతగిలింది. చూద్దాం ఎటువంటి మార్పులొస్తాయో.
గమనిక : ఈ లెక్కలు సర్క్యులేషన్ కి సంబంధించినవి కావు. నెల్సన్ ప్రతి త్రైమాసకం లో నిర్వహించే రీడర్ షిప్ సర్వే కి సంబంధించినవి. ఈ సంస్థ నిర్వహించే లెక్కల తోనే మార్కెటు లో ప్రకటనలు కంపనీలు ఇస్తుంటాయి. దాదాపు అన్ని పత్రికలూ దీన్ని పరిగణన లోకి తీసుకుంటాయి.