కరోనా వ్యాప్తి కారణంగా దేశంలో మూడోదశ లాక్ డౌన్ ఈ నెల 17తో ముగియనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడి మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగిస్తారని ప్రధాని కార్యాలయం తెలిపింది. కాగా లాక్ డౌన్ సడలింపులు, కరోనా కట్టడి చర్యలపై ఆయన ప్రసంగించనున్నారు. తొలి దశ లాక్ డౌన్ లో తీసుకున్న పలు చర్యలు రెండో దశలో తీసుకునే అవసరం లేదని, అలాగే, రెండో దశలో తీసుకున్న పలు చర్యలను మూడో దశలో తీసుకోలేదని మోడి నిన్న సీఎంలతో అన్నారు. ఇప్పుడు మూడో దశలో తీసుకున్న చర్యలు నాలుగో దశలో తీసుకునే అవసరం లేదని మోడి స్పష్టం చేశారు. దీంతో మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక జాతినుద్దేశించి ప్రధాని చేసే ప్రసంగంలో వివిధ రంగాలకు ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోడి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సీఎం అభిప్రాయాలను తీసుకున్నారు. మెజార్టీ సీఎంలు లాక్ డౌన్ కొనసాగించాలని కోరారు. మరికొందరు సడలించాలని కోరారు. ఈనేపథ్యంలో ప్రధాని లాక్ డౌన్ కొనసాగింపు లేదా ఎత్తివేతపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ లాక్ డౌన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారా? అనే ఆసక్తి దేశ ప్రజల్లో నెలకొంది.