CM Jagan Signature Fake: ఏపీలో చివరకు సీఎం జగన్ సంతకానికి కూడా రక్షణ లేకుండా పోయింది.ఏకంగా ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేశారు. గత ఆరు,ఏడు నెలలుగా చేస్తున్నా ప్రభుత్వం పసిగట్ట లేకపోవడం నివ్వెర పరుస్తోంది. ప్రభుత్వానికి మాయని మచ్చగా నిలుస్తోంది. అసలే పాలనే సాగించడం లేదని అపవాదు జగన్ సర్కార్ పై ఉంది. ఇప్పుడు సొంత కార్యాలయంలో సైతం అవినీతి వెలుగు చూడడం ప్రభుత్వ పనితీరును తెలియజేస్తోంది.
తాజా వ్యవహారంతో ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వం దివాలా తీసినట్లుగా అర్థమవుతుంది. సిఐడి దర్యాప్తులో ఇది వెల్లడయ్యింది. సీఎం జగన్ డిజిటల్ సంతకాలను ఆరు,ఏడు నెలలు గా దుర్వినియోగం చేస్తున్న విషయం ఏపీ సిఐడి బయట పెట్టింది. దీంతో అసలు ప్రభుత్వం ఉందా లేదా అన్నఅనుమానం కలుగక మానదు. సి ఎం ఓ అంటే సెక్రటేరియట్ కన్నా పవర్ ఫుల్. అందునా సీఎం సంతకం అంటే అంత ఆషామాషీ కాదు. సీఎం డిజిటల్ సంతకాలకు ఏ స్థాయిలో సెక్యూరిటీ ఉంటుందో చెప్పనక్కర్లేదు. కానీ చాలా సులువుగా కిందిస్థాయి సిబ్బంది ఫేక్ సంతకాలు సృష్టించినట్లు తెలుస్తోంది. అయితే ఇది పెద్ద తలకాయ సాయం లేనిదే జరిగే పని కాదని అధికార వర్గాలు చెబుతున్నాయి.
వాస్తవానికి ఈ డిజిటల్ సంతకాలనేవి సీఎం ప్రధాన కార్యదర్శులుగా ఉండే ఐఏఎస్ అధికారులకే తెలుస్తాయి. అటువంటిది ఐఏఎస్ అధికారుల నుంచి సమాచారం సేకరించి డిజిటల్ సంతకాలను పక్కదారి పట్టించారు అంటే ఏ స్థాయి నేరమో అర్థమవుతుంది. అందుకే దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత పెద్ద అవినీతి అటెండర్లకు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఎలా సాధ్యమన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అసలు ఈ ఆఫీస్ ను వినియోగించాలంటే శిక్షణ తీసుకుని ఉండాలి. అది దిగువ స్థాయి సిబ్బందికి తెలిసే అవకాశం లేదు.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో అటెండర్ లను బలి పశువు చేశారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఈ బాగోతంలో సీఎంఓ ముఖ్య అధికారి పాత్ర పై అనుమానాలు ఉన్నాయి.ప్రతి ఫైలుకు ఒక రేటు కట్టి తతంగం నడిపించినట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయం బయటకు వచ్చేసరికి పెద్దలు జాగ్రత్త పడినట్లు సమాచారం.దిగువ స్థాయి సిబ్బందిని ఇరికించి తాము సేఫ్ జోన్ లోకి వెళ్ళినట్లు ప్రచారం జరుగుతోంది. అవినీతి వెలుగు చూసింది కాబట్టి సిఐడి దర్యాప్తునకు ఆదేశించారు. కానీ ముఖ్య అధికారుల పాత్రను తగ్గించిన సిఐడి.. కింది స్థాయి సిబ్బందిని మాత్రం బాధ్యులను చేసింది. అందుకే సమగ్ర దర్యాప్తు చేయాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది.