https://oktelugu.com/

Independence Day 2023: స్వయం పాలన కోసం వీరోచితంగా పోరాడిన కొమురం భీమ్‌ కథ

ఆదివాసీ ఆత్మగౌరవ ప్రతీక కొమురం భీమ్‌. స్వయంపాలన, అస్తిత్వ ఉద్యమాల వేగుచుక్క. ఆదిలాబాద్‌ అడవుల్లో భీం పోరాటం జరిగి నేటికి తమ హక్కుల సాధన కోసం ఆదివాసీ సమాజాలు ఉద్యమించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 14, 2023 / 02:56 PM IST

    Independence Day 2023

    Follow us on

    Independence Day 2023: అతను ఒక అగ్గి బారాటా. పోరాట యోధుడు. మీసం మెలితిప్పే వీరుడు. గెరిళ్లా పోరాటంలో మడమ తిప్పని త్యాగధనుడు. వీరి పేరు చెబితే నిజాం సర్కారుకు దడ పుట్టేదట. స్వయం పాలన కోసం శ్రమించిన తెలంగాణ బిడ్డ కొమురం భీమ్‌. హైదరాబాదు విముక్తి కోసం అసఫ్‌ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు. 1901, అక్టోబర్‌ 22న కొమరం చిన్నూ – సోంబారు దంపతులకు ఆదిలాబాద్‌ జిల్లా, ఆసిఫాబాద్‌ తాలూకాలోని సంకేపల్లి గ్రామం భీమ్‌ జన్మించాడు. భారతదేశంలో ఆదివాసీల హక్కుల కోసం జరిగిన పోరాటాలు చరిత్రాత్మక మైనవి. ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీ, దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన కొమురం భీమ్‌ ‘జల్‌–జంగిల్‌–జమీన్‌’ నినాదానికి ప్రతీకగా నిలిచిపోయూడు. కొండ కోనల్లో, ప్రకృతితో సహ జీవనం సాగించే ఆదివాసీ ప్రజలకు అడవిపై హక్కు సామాజిక న్యాయంలో భాగమని నినదిస్తూ, 1928 నుంచి 1940 వరకూ రణభేరి మోగించిన కొమరం భీమ్‌ నైజాం సర్కార్‌ గుండెల్లో సింహ స్వప్నంగా మారిన పోరాటయోధుడు. భీమ్‌ 17 ఏళ్ల వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో అతని తండ్రి చిన్నూ మరణించాడు. దీంతో భీమ్‌ కుటుంబం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి ప్రాంతంలోని సర్దాపూర్‌కు వలస వెళ్లింది. అక్కడ వాళ్లు సాగుచేసుకుంటున్న భూమిని సిద్దిఖీ అన్న జమీందారు ఆక్రమించుకోవడంతో ఆవేశం పట్టలేని భీమ్‌ అతన్ని హతమార్చి అసోంకు వెళ్లిపోయాడు.

    చారిత్రాత్మక పోరాటం..
    భారతదేశంలో ఆదివాసీల హక్కుల కోసం జరిగిన పోరాటాలు చరిత్రాత్మక మైనవి. ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీ, దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన కొమురం భీమ్‌ ‘జల్‌– జంగిల్‌–జమీన్‌’ నినాదానికి ప్రతీకగా నిలిచిపోయూడు. కొండ కోనల్లో, ప్రకృతితో సహజీవనం సాగించే ఆదివాసీ ప్రజలకు అడవిపై హక్కు సామాజిక న్యాయంలో భాగమని నినదిస్తూ, 1928 నుంచి 1940 వరకూ రణభేరి మోగించిన కొమరం భీమ్‌ నైజాం సర్కార్‌ గుండెల్లో సింహ స్వప్నంగా మారిన పోరాటయోధుడు.

    తేయాకు తోటల్లో పనిచేస్తూ…
    భీమ్‌ అసోంలో ఐదేళ్లపాటు ఉన్నాడు. కాఫీ, తేయాకు తోటల్లో పనిచేస్తూ జీవనం సాగించాడు. అక్కడ కూడా గిరిజనులపై దొరలు దాడి చేయడాన్ని గమనించాడు. గిరిజనుల బతుకులు ఎక్కడైనా ఇంతే అన్న భావనతో భీమ్‌ తిరిగి కెరమెరి చేరుకున్నాడు.

    నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమం..
    నిజాం నవాబు పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్కతాటిపై నడిపించి ఉద్యమించాడు భీమ్‌. ఆసిఫాబాద్‌ పరిసర ప్రాంతాలు, జోడేఘాట్‌ గుట్టలు కేంద్రంగా నిజాం నవాబుపై గెరిల్లా పోరాటాన్కొనసాగించాడు. ఇందుకోసం 12 గ్రామాల గిరిజనులతో సైన్యం తయారు చేశాడు. భీమ్‌కు కుడిభజంగా కొమురం సూరు కూడా ఉద్యమంలో పాల్గొన్నాడు. వెడ్మ రాము కూడా భీమ్‌కు సహచరుడిగా ఉన్నాడు. నిజాం సైన్యంమీద, అటవీ సిబ్బంది పైనా కొమురం కొదమసింహంలా గర్జించాడు.

    నమ్మక ద్రోహంతో భీమ్‌ హత్య…
    కుర్దు పటేల్‌ అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో, అర్ధరాత్రి కుమురం స్థావరాలను సైన్యం చుట్టుముట్టగా జోడేఘాట్‌ అడవుల్లో 1940, అక్టోబర్‌ 27న, అంటే ఆదివాసీలు పవిత్రంగా భావించే ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజున భీమ్‌ వీరమరణం పొందాడు. అప్పటి నుంచీ ఆ తిథి రోజునే కొమరం భీమ్‌ వర్ధంతి జరుపుకోవడం ఆదివాసీల ఆనవాయితీ.

    ఉద్యమాల వేగుచుక్క..
    ఆదివాసీ ఆత్మగౌరవ ప్రతీక కొమురం భీమ్‌. స్వయంపాలన, అస్తిత్వ ఉద్యమాల వేగుచుక్క. ఆదిలాబాద్‌ అడవుల్లో భీం పోరాటం జరిగి నేటికి తమ హక్కుల సాధన కోసం ఆదివాసీ సమాజాలు ఉద్యమించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. వారి జీవనాధారమైన అడివినుంచి వారిని తరిమేసే విధానాలు, చట్టాలతో వారు తలపడ్డారు. ఆదివాసీ ఆవాసాల్లోకి గిరిజనేతర భూస్వాముల వలస నిరాటంకంగా సాగింది. పోడు వ్యవసాయం గోండుల జీవనాధారం. అడవిని నరికి పంటవేస్తే అది జంగ్లాత్‌ భూమి అని ఒకరు, కాదు రెవెన్యూ భూమి అని మరొకరు వచ్చి గోండులను వారి భూముల నుంచి తరిమేశారు. పంటలను ధ్వంసం చేశారు. జరిమానాలతో వేధించారు. ఈ వేధింపులు, అణచివేతల నేపథ్యంలోంచే.. ఆదిలాబాద్‌ గోండన్నలు పోరుబాట పట్టారు. తమ విముక్తి కోసం పోరాట జెండాపట్టారు. ‘మాఊర్లో మా రాజ్యం’అంటూ పన్నెండు గూడేలు బాబేఝరి లోద్దుల్లో రణభేరి మోగించాయి.

    భీమ్‌ సారథ్యంలో..
    కొమురంభీం నాయకత్వంలో ఆదివాసులు సంఘటితమై తమపై జులుం చేస్తున్న దోపిడీవర్గాలపై తుడుం మోగించారు. కొమురంభీమ్‌ పోరాటం పలు ప్రాంతాలకు విస్తరించేలోపే నిజాం సేనలతో యుద్ధం జరిగింది. భీమ్‌తో సహా పన్నెండు మంది ఆదివాసీ వీరులు అమరులయ్యారు. నిజాం సర్కారు పాశవికంగా కొమరంభీం పోరాటాన్ని అణచివేసింది. భీమ్‌ అమరత్వం జోడేఘాట్‌ లోద్దుల్లో నేటికీ ప్రతిధ్వనిస్తున్నది. ఏహక్కుల కోసమైతే.. నాడు భీమ్‌ ఉద్యమించాడో.. ఆ హక్కుల కోసం ఆదివాసులు నేటికీ నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు.

    దండకారణ్యంలో తిరుగుబాటు..
    1940లోనే ఆత్మగౌరవం, స్వపరిపాలన పునాదులుగా కొమురం భీం సాయుధ తిరుగుబాటు చేశాడు. అతని ముందు చూపు వివిధ ఉద్యమాలకు ప్రేరణగా నిలుస్తున్నది. బాబేఝురి లోద్దుల్లో పన్నెండు గూడేలపై రాజ్యాధికారం కోసం తుడుం మోగించిన కొమురం భీం వారసత్వం నేటికీ దండకారణ్యంలో కొనసాగుతున్నది. నిజాం పాలకుల నిరంకుశత్వానికి.. అధికారుల దమన నీతికి ఎదురు నిలిచి పోరాడిన కొమురంభీం ఆశించిన లక్ష్యాలను నేటి పాలకులు నెరవేర్చలేక పోతున్నారు. ఏండ్లు గడుస్తున్నా జల్, జంగిల్, జమీన్‌పై ఆదివాసీలు నేటికీ హక్కులు పొందలేకపోతున్నారు.