CM Jagan: సీఎం జగన్ తమ ప్రాంతానికి వస్తున్నారంటే ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఎక్కడ పచ్చని చెట్లు మాయం చేస్తారో.. రోడ్లను ధ్వంసం చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. సీఎం జిల్లాకు వస్తే విద్యా సంస్థలు మూతపడాల్సిందే. పాఠశాలలకు చెందిన బస్సులు జన సమీకరణకు వినియోగిస్తుండడంతో అధికారులు ఏకంగా ఐచ్చిక సెలవులు ప్రకటిస్తున్నారు.సీఎం పర్యటనలకు ఒకవైపు ఆర్టీసీ బస్సులు వినియోగిస్తుండటంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. అవి చాలవన్నట్టు పాఠశాలలకు చెందిన బస్సులను సైతం తరలించకపోతున్నారు. దీంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాల్సిన అనివార్య పరిస్థితి ఎదురవుతోంది.
సీఎం పర్యటన ఉంటే చాలు. అది ప్రభుత్వ కార్యక్రమం అయినా, ప్రైవేటు కార్యక్రమం అయినా ఆరోజు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాల్సిందే. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఇటువంటి పరిస్థితి నెలకొంది.సీఎం జగన్ నేడు జిల్లాలో పర్యటించనున్నారు. దీంతో అధికారులు పాఠశాలకు సెలవు ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు గణేష్ వివాహ రిసెప్షన్ గురువారం జరగనుంది. దివాన్ చెరువులో జరగనున్న వేడుకలకు సీఎం జగన్ హాజరుకానున్నారు. దీంతో రాజానగరం నియోజకవర్గంలోని రాజానగరం, సీతానగరం, కోరుకొండ మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు.. రాజమండ్రి నగరం, రూరల్ ప్రాంతంలోని కొన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. వివాహ విందుకు వచ్చే వారిని తరలించేందుకు పాఠశాలల బస్సులు వినియోగించుకునేందుకే సెలవు ప్రకటించినట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే అధికారుల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా సెలవులు ప్రకటించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు గురువారం పాఠశాలకు సెలవు అంటూ తల్లిదండ్రులకు సమాచారమిచ్చాయి. అయితే దసరా సెలవులు అనంతరం బుధవారమే పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో ఇటువంటి మెసేజ్లు రావడంతో తల్లిదండ్రులు ఆగ్రహం చెందారు. అయితే దీనిపై తూర్పుగోదావరి రెడ్డి అబ్రహం తనకు తెలియదని చెప్పడం విశేషం. ఆప్షనల్ హాలిడే ఇచ్చుకునే అవకాశం పాఠశాల యాజమాన్యాలకు ఉందని.. అందులో తమ ప్రమేయం ఉండదని చెప్పుకు రావడం విస్తు గొల్పుతోంది.