YS Jagan Visit Kuppam: ఇటీవల ఏపీ సీఎం జగన్ జిల్లాల టూర్ అంటే అధికారులు, పోలీసులు హడలెత్తిపోతున్నారు. సీఎం పర్యటించే నగరం అయినా, పట్టణమైనా ముందుగా తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం వారికి కష్టతరంగా మారుతోంది. అటు ఉన్నతాధికారుల ఒత్తిడి ఒక వైపు.. ఇటు ప్రజల నుంచి ప్రశ్నలు నిలదీతలు ఒక వైపువారికి ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి. రెండున్నరేళ్ల పాలన తాడేపల్లి ప్యాలెస్ నుంచి చేసిన సీఎం జగన్ సంక్షేమ పథకాల ప్రారంభానికి మాత్రం ఇప్పుడు జిల్లాలను ఎంచుకుంటున్నారు. దీంతో సీఎం పర్యటన అంటేనే అటు అధికారులకు, ఇటు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ముందుగా విపక్ష నాయకులు, ప్రజాసంఘాల నేతలను అదుపులోకి తీసుకోవాలి, గృహనిర్భంధం చేయాలి. మరోవైపు సీఎం పర్యటించే రూట్లలో దుకాణాలు బంద్ చేయాలి. ఇళ్ల ముందు బారికేడ్లు ఏర్పాటుచేయాలి. అటువైపు మనుషులు, వాహనాల రాకపోకలను నియంత్రించాలి. ఇవన్నీ చేస్తుంటే ప్రజల నుంచి ప్రశ్నలు, నిలదీతలు ఎదురవుతున్నాయి. కొందరైతే తిట్ల దండకాన్ని అందుకుంటున్నారు. కానీ శాంతిభద్రతల పేరు చెప్పి పోలీసులు, అధికారులు ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. చివరకు సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల్లో పర్యటించిన ఇదే పరిస్థితి నెలకొంది.

వారం రోజుల్లో సీఎం పర్యటన..
ఇప్పుడు సీఎం జగన్ తాజాగా విపక్ష నేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు., వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడించాలన్న కసితో ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అందులో :భాగంగా ఇటీవల కుప్పం నియోజకవర్గ సమీక్షలో జగన్ వైసీపీ శ్రేణులకు హితబోధ చేశారు. అక్కడ గెలుపొందితే ఎమ్మెల్సీ భరత్ ను మంత్రి చేస్తానని కూడా హామీ ఇచ్చారు. అదే సమయంలో కుప్పంలో అభివృద్ధి పనులు చేపడితే ప్రజలు యూటర్న్ అయ్యే అవకాశముందని స్థానిక నాయకులు జగన్ కు విన్నవించారు. దీంతో రూ.60 కోట్లతో కుప్పంలో అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం జగన్ సంకల్పించారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి కుప్పం వెళ్లనున్నారు. అయితే గతం కంటే పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు అందాయి. ఇప్పటికే చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ నేతలు దాడులకు దిగినా టీడీపీ నాయకులపైనే కేసులు నమోదయ్యాయి. దాదాపు 60 మంది క్రియాశీలక టీడీపీ నాయకులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడంతో.. ప్రస్తుతం వారంతా రిమాండ్ లోనే ఉన్నారు. అయితే సీఎం జగన్ పర్యటన వరకూ వారు జైలులోనే ఉంచేలా చూడాలని ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది. రకరకాల కారణాల చూపి టీడీపీ నాయకుల బెయిల్ ను తిరస్కరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి గెలుస్తామన్న వైసీపీ నేతలు ఇలా తమను బెదిరిపోతున్నారని.. ఎలా గెలుస్తారని టీడీపీ నాయకులు ఎద్దేవా చేయడం ప్రారంభించారు.

నిర్వహణ బాధ్యత మంత్రిదే…
ప్రస్తుతం కుప్పం నియోజకవర్గం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నల్లో ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తుంటాయి. ఆయన ఆదేశాలను అక్కడి అధికారులు, ప్రజాప్రతినిధులు అమలుచేస్తుంటారని టాక్ నడుస్తోంది. కుప్పంలో దొంగ ఓట్లు నుంచి బయట నుంచి మనుషులను తెచ్చి దాడులు జరిగిన ప్రతీసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు వినిపిస్తుంటుంది. మరో వారం రోజుల్లో సీఎం జగన్ కుప్పం టూర్ బాధ్యతలను కూడా పెద్దిరెడ్డే చూస్తున్నారు. చంద్రబాబు అడ్డాలో కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించి సవాల్ విసరాలను భావిస్తున్నారు. అందులో భాగంగా టీడీపీ నాయకులకు బెయిల్ రాకుండా మరికొన్ని కేసులు బనాయిస్తున్నారన్న వ్యాఖ్యలైతే వినిపిస్తున్నాయి. అయితే దీనిపై టీడీపీ నాయకులు కూడా అదే రేంజ్ లోబదులిస్తున్నారు. మనసులో ఇంత భయం పెట్టకొని కుప్పంలో చంద్రబాబును ఎలా ఒడిస్తారని ఎగతాళి చేస్తున్నారు. మొత్తానికైతే సీఎం జగన్ టూర్ ను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.