CM Jagan: గత ఎన్నికల్లో వైసీపీ అంతులేని విజయం సాధించింది. దేశంలో కనివినీ ఎరుగని రీతిలో జగన్ 151 సీట్లో తన పార్టీని గెలిపించుకున్నారు. జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు సాధించారు. అటు తరువాత పవన్ నేతృత్వంలో గెలుచుకున్న ఒకే ఒక శాసనసభ్యుడు సైతం వైసీపీ గూటికి చేరిపోయారు. అటు టీడీపీతో విభేదించిన నలుగురు ఎమ్మెల్యేలు సైతం జగన్ వైపు వాలిపోయారు. ఇప్పుడు వైసీపీకి ఉన్న సంఖ్యాబలం సరాసరి 156. అంటే 175 అసెంబ్లీ సీట్లకుగాను 19 సీట్ల ముంగిట ఉన్నారన్న మాట. అయినా జగన్ కు మాత్రం ఏదో తెలియని వెలితి. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలను గెలవాలని ప్రయత్నిస్తున్నారు. శ్రేణులకు ఇదే నూరిపోస్తున్నారు. నియోజకవర్గాల వారీగా 50 మంది క్రియాశీలక నాయకులతో సమావేశమవుతున్న జగన్ ఇదే విషయాన్ని పదేపదే చెబుతున్నారు. మరో 30 సంవత్సరాలు అధికారంలో ఉండేలా ప్రణాళికలు రూపొందించుకుందామని పిలుపునిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కుప్పంలోసైతం ఓడిస్తామని గంటాపథంగా చెబుతున్నారు. అయితే ఇది సాధ్యమయ్యేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నా.. ప్రయత్నిద్దాం.. పోయేదేముంది అన్న మాట సీఎం నోటి నుంచి వినిపిస్తోంది. విజయంపై నమ్మకం కలిగించడానికే సీఎం అలాఅంటున్నారని.. వాస్తవ పరిస్థితి విరుద్ధంగా ఉందని వైసీపీ వర్గాలు మాత్రం భావిస్తున్నాయి. అయితే రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి…గత ఎన్నికల్లో అంతులేని విజయం దక్కింది కాబట్టి.. వరుస ఉప ఎన్నికల్లో గెలుస్తున్నారు కాబట్టి జగన్ లో ఆమాత్రం విశ్వాసం ఉంటుంది మరి.
ఎప్పుడుచూసినా కుప్పం మాటే..
అయితే సంపూర్ణ విజయంతో పాటు జగన్ మదిలో మరో విచిత్రమైన కోరిక ఉందన్న టాక్ అయితే ఉంది. ఒక ఐదుగర్ని అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వకూడదని ఆయన భావిస్తున్నారుట. అందులో ఎలాగూ ముందు వరుసలో చంద్రబాబు ఉంటారు. ఇప్పటికే తాను ముఖ్యమంత్రిగా మాత్రమే అసెంబ్లీలో అడుగు పెడతానని చంద్రబాబు శపథం చేశారు. దానికి అనుగుణంగా కుప్పంలో మట్టికరిపించి చంద్రబాబును అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వకూడదన్న కృతనిశ్చయంతో జగన్ ఉన్నారు. ఆ పనిని సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు ఓడిపోవాలన్న ప్రయత్నంలో వైసీపీ శ్రేణులను జగన్ నూరిపోస్తున్నారు.
Also Read: AP Capital Issue: రాజధానులపై వైసీపీ కొత్త డ్రామా… రాజ్యసభలో ప్రైవేటు బిల్లు..
సీఎం జాబితాలో ఉన్న రెండో పేరు చంద్రబాబు తనయుడు లోకేష్. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీచేసిన ఆయన ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో అక్కడ నుంచే మరోసారి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇందుకుగాను తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అయితే గతం కంటే లోకేష్ అక్కడ బలం పెంచుకున్నారన్న ప్రచారం ఉంది. వైసీపీ అంతర్గత సర్వేల్లో కూడాఇదే తేలింది. అందుకే జగన్ ఇక్కడ వ్యూహం మార్చుతున్నారు. నియోజకవర్గంలో బీసీలు అధికం. అవసరమైతే స్థానిక ఎమ్మెల్యేరామక్రిష్ణా రెడ్డిని మార్చి బీసీ కార్డు తెరపైకి తేవాలని యోచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోలోకేష్ ను మట్టి కరిపించాలన్న కసిలో జగన్ ఉన్నారు.
ఇక మూడో పేరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గడిచిన ఎన్నికల్లో రెండుచోట్ల పోటీచేసిన పవన్ ఒక్కదగ్గర కూడా గెలవలేకపోయారు. మరోసారి అదే పరిస్థితిని తెచ్చి పవన్ ను రాజకీయ సమాధి చేయాలని జగన్ ఉవ్విళ్లూరుతున్నారు. పవన్ ఉభయ గోదావరి జిల్లాల నుంచి బరిలో దిగుతారన్న ప్రచారం ఉంది. తిరుపతి నుంచి పోటీచేస్తారన్న టాక్ నడుస్తోంది. అయితే ఆయన ఎక్కడ నుంచి బరిలో దిగినా ఓడించాలన్న పట్టుదలతో జగన్ ప్రయత్నిస్తున్నారు. గట్టిగా ప్రయత్నించేనైనా పవన్ ఓటమిని చూడాలన్నది జగన్ భావన.
అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడును ఓడించాలని జగన్ భావిస్తున్నారు. శాసనసభతో పాటుబయట తనపై అచ్చెన్న చేస్తున్న ఎదురుదాడి జగన్ కు రుచించడం లేదట. పైగా శ్రీకాకుళంలో కింజరాపు కుటుంబ హవాను సహించలేకపోతున్నారు. అందుకే టెక్కలి నియోజకవర్గంలో అచ్చెన్నను ఓడించి గట్టిగా బదులు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారుట. బలమైన అభ్యర్థిని బరిలో దించి ఎట్టి పరిస్థితుల్లో అచ్చెన్న ఓటమిని తనివితీరా చూడాలని చూస్తున్నారు.
ఇక ఐదో అభ్యర్థి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. పెద్దాయన హవాభావాలను జగన్ సహించలేకపోతున్నారుట. పైగా సోషల్ మీడియాలో తన పట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేస్తున్న చౌదరిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని తీర్మానించుకున్నారుట. అందుకే అక్కడ పార్టీ నేతలు మోహరించుతున్నారుట. ఎన్నికల్లో ఓడించి రాజకీయాల నుంచి శాశ్వత విరమరణ ఇవ్వాలని భావిస్తున్నారుట.
అయితే గెలుపోటములు నిర్దేశించడం మన చేతిలో లేదు అన్న విషయం సీఎం అయినా.. ఇంకెవరైనా గ్రహించాలి. అదంతా ప్రజల చేతుల్లోనే ఉంటుంది. ప్రజలు వద్దనుకుంటే తప్పనిసరిగా ఓటమి చవిచూస్తారు. వారి మద్దతు ఉంటే మాత్రం ఎన్ని అడ్డంకులు సృష్టించినా వారి విజయాన్ని ఆపలేరు. అసలు గత ఎన్నికలతో పోల్చుకుంటే వైసీపీ గ్రాఫ్ తగ్గిందన్న అంచనాలు ఉన్నాయి. ఇటువంటి సమయంలో కీలక నేతలను పని గట్టుకొని ఓడిస్తామనడం అతిగా కనిపిస్తోంది. కానీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.
Also Read:Ayodya Ramamandir: అయోధ్య రామమందిరం ఇప్పుడు ఎలా ఉందో చూస్తారా?