CM Jagan- NATA Convention 2023: నాటా తెలుగు మహాసభలకు సీఎం జగన్ ప్రత్యక ఆకర్షణ తీసుకొచ్చారు. తన సందేశంతో ప్రవాస ఆంధ్రులు, తెలుగువారిలో ఆలోచన రేకెత్తించారు. డాల్లాస్ లో నాటా తెలుగు మహాసభలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు తనకు ఆహ్వానం అందినా అనివార్య కారణాలతో సీఎం హాజరుకాలేకపోయారు. దీంతో తన సందేశాన్ని పంపించారు. నాటా నిర్వాహకులు శ్రీధర్, అనిల్, ప్రేమసాగర్ లకు అభినందనలు తెలిపారు. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా కలిసికట్టుగా ఉండడం అభినందనీయమన్నారు. నాలుగేళ్ల కిందట డల్లాస్ లో నాటా తెలుగు మహాసభలకు తానొచ్చిన విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు.
తెలుగువారు తనపై చూపిన అభిమానానికి ధన్యుడునయ్యానని చెప్పుకొచ్చారు. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్న ఐక్యతగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఐకమత్యం చాటుకుంటూ ఇటువంటి సభలను ఏర్పాటు చేసుకోవడం హర్షించదగ్గ పరిణామమన్నారు. అమెరికాలో తెలుగు వారు ఉన్నత రంగాల్లో రాణిస్తుండడం గర్వంగా ఉందన్నారు. ఐటీ నిపుణులుగా, పెద్ద పెద్ద కంపెనీలకు సీఈవోలుగా, నాసా వంటి ప్రఖ్యాత సంస్థల్లో సైంటిస్టులుగా, యూనివర్సీటీ ప్రొఫెసర్లుగా, అమెరికా ప్రభుత్వ ఉద్యోగులుగా, ప్రజాప్రతినిధులుగా రాణించడం గొప్ప విషయమన్నారు. ఇదంతా చదువుతోనే సాధ్యమైందని గుర్తుచేశారు. అందుకే ఏపీ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తున్న విషయాన్ని చెప్పుకొచ్చారు.
ఉన్నతరంగాల్లో రాణిస్తున్న తెలుగువారి మూలాలు మాత్రం కుగ్రామాలేనన్నారు. అంకిత భావంతో చదువుకొని ఈ స్థాయికి వచ్చారని…ఎన్నో ఇబ్బందుల మధ్య వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. మిమ్నల్ని ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తున్నట్టు చెప్పారు. నాడు,నేడు పథకంతో సమూల మార్పులు తీసుకొచ్చిన సంగతిని ప్రస్తావించారు. సాంకేతిక విద్యలో భాగంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు అందించినట్టు చెప్పారు. మనిషి ఎత్తుకు ఎదగాలంటే చదువు ఒక సాధనమన్న విషయాన్ని గుర్తెరగాలని జగన్ స్పష్టం చేశారు.
ప్రపంచాన్ని పరిచయం చేసి ఉద్యోగ, ఉపాధి బాట చూపే ఒక సాధనంగా ఇంగ్లీష్ మీడియం అని జగన్ అభివర్ణించారు. అందుకే ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లీష్ బోధనకు అవకాశమిచ్చినట్టు చెప్పుకొచ్చారు. ఒక విద్యార్థి ఏ రంగంలో స్థిరపడాలన్నా ఇంగ్లీష్ అవసరమన్నారు. చివరకు ఎటువంటి అంశాన్నైనా అవగాహన చేసుకోవాలన్నా ఇంగ్లీష్ మాధ్యమం అనివార్యమన్నారు. అందుకే వైసీపీ సర్కారు పేదల విద్యకు ప్రాధాన్యమిచ్చినట్టు తెలిపారు. ఓ విద్యార్థిని గ్లోబల్ సిటిజన్ గా మార్చేందుకు అవసరమైన అన్ని వనరులను సమకూర్చడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టు జగన్ ప్రవాస ఆంధ్రులకు వివరించారు. సీఎం ప్రసంగాన్ని ప్రవాస ఆంధ్రులు ఆసక్తిగా తిలకించారు.