CM Jagan: ఏపీలో ఎన్నికల ఫీవర్ స్పష్టంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా అన్ని రాజకీయ పక్షాలు పావులు కదుపుతున్నాయి. సీఎం జగన్ జిల్లాల పర్యటనను చుట్టేస్తున్నారు. తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి చెబుతూనే ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.ఇవి ప్రజల్లో చర్చనీయాంశమవుతున్నాయి. అటు చంద్రబాబు సైతం వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఆయన సభలు, రోడ్డు షోలకు ప్రజల నుంచి విశేషస్పందన లభిస్తోంది. జనసేనాని పవన్ తో పాటు ఆ పార్టీ కీలక నేత నాదేండ్ల మనోహర్ కూడా ప్రజల్లోనే ఉంటున్నారు. పవన్ నేరుగా సోషల్ ఆడిట్ పేరిట వైసీపీ ప్రభుత్వ అవినీతిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. నేరుగా జగనన్న కాలనీ లేఅవుట్లను సందర్శంచి.. అక్కడి నుంచే విమర్శనాస్త్రాలు సంధించారు. నాదేండ్ల మనోహర్ ఉత్తరాంధ్రలో పర్యటించి బీసీ వర్గాలను కలుస్తున్నారు. దీంతో జగన్ లో పునరాలోచనలో పడ్డారు. ఎన్నికల వ్యూహాలు అమలుచేసేందుకు సిద్ధపడుతున్నారు. డిసెంబరు 4న మరోసారి వర్క్ షాపునకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లకు సమాచారమిచ్చారు.

వర్కుషాపునకు ముందుగానే జగన్ కీలక భేటీకి నిర్ణయించారు. శనివారం తాడేపల్లి ప్యాలెస్ లో బీసీ నేతలతో సమావేశం కానున్నారు. ఇందుకు సంబంధించి యాక్టివ్ రోల్ పోషిస్తున్న తొమ్మిది మంది వైసీపీ బీసీ నేతలకు ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అయితే ఈ భేటీ అజెండా అనేది ఇంతవరకూ బయటకు రాలేదు. కానీ ఇది వచ్చే ఎన్నికల కోసం కీలక నిర్ణయాలు తీసుకునేందుకే ఈ అత్యవసర భేటీ అని మాత్రం తెలుస్తోంది. సదరు నేతలు విధిగా సమావేశానికి హాజరుకావాలని సీఎంవో నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయి. మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, జోగి రమేష్, గుమ్మనూరు జయరాం, చెల్లుబోయిన గోపాలక్రిష్ణ, ఎమ్మెల్సీ జంగా క్రిష్ణమూర్తి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, కొలుసు పార్థసారధి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను ఉన్నపలంగా సీఎం నుంచి పిలుపురావడం అటు పార్టీ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.
వచ్చే ఎన్నికలు హోరాహోరీగా సాగనున్న తరుణంలో జగన్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికే 175 నియోజకవర్గాలను టార్గెట్ గా పెట్టుకున్నారు. వరుసగా రివ్యూలు, వర్కుషాపులు నిర్వహిస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లను మార్చిన ఆయన పార్టీ అభ్యర్థులపై ఫోకస్ పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలను మార్చనున్నట్టు స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారు. గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వచ్చే ఫిడ్ బ్యాక్ ను ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. డిసెంబరు 4న మరోసారి వర్కుషాపునకు సిద్ధపడుతున్నారు.పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా అధ్యక్షులు, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు సమావేశానికి హాజరుకానున్నారు. సమావేశంలో కీలక నిర్ణయాలు వెల్లడించే అవకాశముందని వైసీపీలో ప్రచారం జరుగుతోంది. చాలా మంది ఎమ్మెల్యేలను మార్చడం ఖాయంగా తెలుస్తోంది. ఇప్పటికే రెండు సార్లు గడువు ఇచ్చిన జగన్… కొంతమంది ఎమ్మెల్యేల పేర్లు వెల్లడించి వారి స్థానంలోప్రత్యామ్నయంగా పర్యవేక్షకులను నియమిస్తారన్న ప్రచారం అయితే ఊపందుకుంది.

సీఎంతో భేటీ అవుతున్న బీసీ నేతలు పరిమితంగా ఉండడం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ నుంచి కేవలం తొమ్మిది మంది నేతలకే కీలక భేటీకి పిలవడం పార్టీ వర్గాల్లో సైతం ఒక రకమైనచర్చ అయితే ప్రారంభమైంది. వైసీపీలో బీసీ ప్రజాప్రతినిధులు చాలామంది ఉన్నారు. అందర్నీపిలవకుండా కొంతమందికే ఆహ్వానాలు పంపడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. టీడీపీ, జనసేన బీసీ నినాదాన్ని ఎత్తుకోవడంతో.. ఎలా ముందుకెళ్లాలో తెలుసుకునేందుకేనన్న టాక్ అయితే వినిపిస్తోంది. కేవలం ఆహ్వానం అందిందని.. సమావేశం అజెండా ఏమిటో తెలయదని ఆ తొమ్మిది మంది నేతలు తమ అనుచరుల వద్ద చెబుతున్నారు. మొత్తానికైతే జగన్ ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకునే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి.