CM Jagan: దేవుడు ఒక్కసారి వరాలిస్తాడేమో.. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ లో కొలువైన జగన్నాథుడు పథకాల పేరిట డైరెక్టుగా అకౌంట్లలో డబ్బులేస్తున్నాడు. అంతే కాదూ ఊహించని విధంగా అందరిపై వరాల జల్లు కురిపిస్తున్నాడు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఒక్క గ్రీన్ సిగ్నల్ తో ఏకంగా 48వేల మందికి ఉద్యోగాలిచ్చాడు.
తాజాగా ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్రంలో టూరిజంపై కీలక సమీక్ష జరిగింది. ఇందులో ఏపీలో పర్యాటక రంగాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చేలా సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. ఒక్కో ప్రాజెక్టుపై కనీసంగా రూ.350 కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు. వివిధ ప్రాజెక్టులపై మొత్తంగా రూ.2868.6 కోట్ల పెట్టుబడులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటి వల్ల దాదాపు 48వేల మందికి ఉద్యోగాల కల్పన ఉంటుంది.
ఈ ప్రాజెక్టుల ద్వారా కొత్తగా 1564 గదులు అందుబాటులోకి రానున్నాయి. ఐదేళ్లలో వీటిని పూర్తి చేస్తామని కంపెనీలు బోర్డుకు తెలిపాయి. విశాఖపట్నం, తిరుపతి , గండికోట, హార్సిలీహిల్స్, పిచ్చుకలంకలో విఖ్యాత కంపెనీ ఓబెరాయ్ ఆధ్వర్యంలో రిసార్టులు అందుబాటులోకి రానున్నాయి. ఓబెరాయ్ విలాస్ బ్రాండ్ తో రిసార్టుల నిర్మాణం జరుగనుంది. హయత్ ఆధ్వర్యంలో విశాఖ, విజయవాడల్లో స్టార్ హోటల్స్, పెనుగొండ లక్ష్మీనరసింహ ఆలయంలో పర్యాటక కేంద్రం ఆమోదముద్ర పడనుంది.
పర్యాటక రంగానికి ఏపీ చిరునామాగా మారాలని అధికారులకు సీఎం సూచించారు. టూరిజం అంటే ఏపీ వైపే చూసేలా ఏర్పాట్లు ఉండాలని జగన్ సూచించారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రాజెక్టులు రూపొందించాలని సూచించారు. అత్యాధునిక వసతులు అందుబాటులోకి రావాలన్నారు. నిర్ధేశిత సమయంలోగా ప్రాజెక్టులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఆధునిక వసతులు అందుబాటులోకి రావడం వల్ల టూరిజం పరంగా రాష్ట్ర స్థాయి పెరుగుతందన్నారు.
రాష్ట్రంలో భారీ ప్రైవేటు ప్రాజెక్టులకు జగన్ ఆమోదం తెలుపడంతో పెట్టుబడుల వరద పారింది. ఈ క్రమంలోనే ఏకంగా దాదాపు 48వేల మందికి ఉపాధి దొరకనుంది. ఈ పరిణామం ఏపీ నిరుద్యోగులకు కలిసివచ్చినట్టే కనిపిస్తోంది.