https://oktelugu.com/

Jagan New Cabinet: ఫస్ట్ టైం బతిమిలాడుతున్న జగన్.. ఎందుకో తెలుసా?

Jagan New Cabinet: ఏపీలో సామాజిక సమతూకం పేరిట కుల రాజకీయాలకు తెర తీశారు. రాష్ట్రంలో ఓట్లు ఎక్కువగా ఉన్న కాపు, బీసీలకు తాజా మంత్రివర్గంలో పెద్దపీట వేశారు. కమ్మ, బ్రాహ్మణ, వైశ్య సామాజికవర్గాలకు పక్కన పెట్టి మరీ ఇతర వర్గాలకు మంత్రి పదవులు కట్టబెట్టారు. వారి ప్రభుత్వం వారిష్టం మరీ. మనం చేసేదేముంది కానీ.. అసంత్రుప్త నాయకులు బుజ్జగించే పనిలో కూడా సామాజిక సమతూకం పాటిస్తుండడం విశేషం. రెడ్డి అయితే అదే సామాజికవర్గ నాయకులకు, కాపు […]

Written By:
  • Admin
  • , Updated On : April 13, 2022 / 08:57 AM IST
    Follow us on

    Jagan New Cabinet: ఏపీలో సామాజిక సమతూకం పేరిట కుల రాజకీయాలకు తెర తీశారు. రాష్ట్రంలో ఓట్లు ఎక్కువగా ఉన్న కాపు, బీసీలకు తాజా మంత్రివర్గంలో పెద్దపీట వేశారు. కమ్మ, బ్రాహ్మణ, వైశ్య సామాజికవర్గాలకు పక్కన పెట్టి మరీ ఇతర వర్గాలకు మంత్రి పదవులు కట్టబెట్టారు. వారి ప్రభుత్వం వారిష్టం మరీ. మనం చేసేదేముంది కానీ.. అసంత్రుప్త నాయకులు బుజ్జగించే పనిలో కూడా సామాజిక సమతూకం పాటిస్తుండడం విశేషం. రెడ్డి అయితే అదే సామాజికవర్గ నాయకులకు, కాపు అయితే అదే కుల నేతలకు, బీసీ అయితే అదే వర్గ నాయకులకు అసంతుష్టులను దారికి తెచ్చుకునే పరిస్థతి కనిపిస్తోంది. వైసీపీలో అధినేత మాటకు తిరుగుండదని.. ఆయన గీసిన గీతను నేతలు కానీ.. ఆ పార్టీ నాయకులు కానీ జవదాటరని ఇన్నాళ్లు వైసీపీ నాయకులు చెప్పుకొచ్చారు. కానీ అది శుద్ధ అబద్ధమని తేలిపోయింది. గత మూడు రోజులుగా అలకల నేతలను దారి తెచ్చుకునేందుకు సీఎం నిమగ్నమయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

    Jagan New Cabinet

    సోమవారం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని శాంతపరచిన సీఎం జగన్ మంగళవారం వరుసగా రెండో రోజూ అసంతుష్ట ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను, మాజీ మంత్రి కొలుసు పార్థసారథితో వ్యక్తిగతంగా మాట్లాడారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ విజయం సాధిస్తున్నామని.. మంత్రివర్గంలో మీకు చోటిస్తానని ముగ్గురినీ బుజ్జగించారు. అయితే ఈ కోవలో హోం శాఖ మాజీ మంత్రి, దళిత నాయకురాలు మేకతోటి సుచరితను ఆయన విస్మరించడం రాజకీయ వర్గాలకు విస్మయం కలిగిస్తోంది. తనను మంత్రివర్గం నుంచి తప్పించిన తీరు బాధించిందని వ్యాఖ్యానించడమే కాకుండా శాసనసభ్యత్వానికి కూడా ఆమె రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

    Also Read: Beast Twitter Review: విజయ్ ‘బీస్ట్’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే?

    ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బెదిరించిన బాలినేని ఇంటికి వెళ్లి మరీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి చర్చలు జరిపారు. ఆయన మెత్తబడేంత వరకూ ఆయన ఇంటి చుట్టూ సజ్జల తిరుతూనే ఉన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే.. ఆయన తన ఇంటికి భోజనానికి వచ్చారని బాలినేని సమాధానం ఇవ్వడమూ చర్చనీయాంశమైంది. ఇక మంత్రివర్గంలో చోటు దక్కని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలకపాన్పు ఎక్కారు. ఫోన్‌ స్విచాఫ్‌ చేసి అందుబాటులో లేకుండా పోయారు. ఇక్కడ కూడా రెడ్డి సామాజికవర్గానికి చెందిన పిన్నెల్లితో.. అదే సామాజికవర్గానికి చెందిన మిథున్‌రెడ్డి, పెద్దిరెడ్డి రాయబారం నెరపి.. ముఖ్యమంత్రితో మాట్లాడించారు. అదేవిధంగా మంత్రివర్గంలో స్థానందక్కలేదని కుతకుతలాడుతున్న కాపు నేత ఉదయభాను, బీసీ నాయకుడు పార్థసారథిపై బీసీ వర్గాని కి చెందిన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణను ప్రయోగించారు. ఆయన వారితో సంప్రదింపులు జరిపి సీఎం వద్దకు తీసుకెళ్లారు. ఈ ప్రక్రియను పరిశీలించిన విశ్లేషకులు.. అలకలు మాన్పించడంలోనూ సామాజిక న్యాయం పాటించారని చమత్కరిస్తున్నారు.

    కొనసాగుతున్న ఆందోళనలు

    మంత్రివర్గ విస్తరణలో అసంత్రుప్త సెగలు వైసీపీలో ఇంకా తగ్గలేదు. కొన్నిచోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమ నేతకు పదవి రాకపోవడానికి జిల్లా నాయకులే కారణమంటూ శ్రేణులు రహదారులపైకి వచ్చి నిరసన తెలుపుతున్నాయి. పదవి రానందుకు అసంతృప్తి లేదంటూనే పలువురు నేతలు అలకబూనారు. పదవులు ఆశించి భంగపడిన వారి అనుచరులు ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. స్థానిక ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేశారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్‌ నిర్ణయాలకు తిరుగులేదు. 2019 మే 8న కొలువుతీరిన తొలి మంత్రివర్గం కూర్పుపైనా ఆయన్ను వేలెత్తిచూపేందుకు ఎవరూ సాహసించలేదు. కానీ మూడేళ్లకే పరిస్థితులు మారిపోయాయి. సోమవారం నాటి పునర్వ్యవస్థీకరణపై నిరసనలు హోరెత్తాయి. పైకి అంతా బాగుందంటున్నా.. పదవి దక్కని నేతల ముఖాల్లో చిరునవ్వే కరువైంది. అన్నిటికీ మించి కుటుంబంలో భాగమైన బాలినేని వ్యవహారం వైసీపీని కుదిపేసింది.

    Jagan

    ఇప్పటి వరకూ తనవాళ్లు తనను పొగడ్తలతో ముంచెత్తడం, ప్రతిపక్ష నాయకులపై బూతులతో విరుచుకుపడడమే చూసిన జగన్‌కు.. వాళ్ల అసంతృప్తి, వారి అనుచరులు, కార్యకర్తల ఆగ్రహావేశాలు నివ్వెరపరిచాయని అంటున్నారు. పదవి దక్కనివారు ఆక్రోశంతో విమర్శలు గుప్పించడం సర్వసాధారణమే. కానీ ఇంతకాలం ఎవ రూ నోరెత్తకుండా చూసుకున్న నేతలు.. ఒక్కసారిగా అసమ్మతిగళం వినిపించడం విస్మయానికి గురిచేసింది. దీంతో.. సీఎం నేరుగా రంగంలోకి దిగి బుజ్జగింపులు మొదలుపెట్టారు. క్యాంపు కార్యాలయంలో ఆయన్ను కలిసేంతవరకూ ముభావంగా.. మీడియాతో మాట్లాడకుండా నేరుగా ఆయన వద్దకు వెళిన నేతలందరూ.. బయటకు వచ్చాక మాత్రం 2024 ఎన్నికల్లో విజయం సాధించాక మంత్రివర్గంలో స్థానం తప్పకుండా కల్పిస్తానని సీఎం మాటిచ్చారని చిలక పలుకులు వినిపించారు. మంత్రి పదవిపై ఆశే లేనప్పుడు అసంతృప్తికి అవకాశమెక్కడిదని బాలినేని, పిన్నెల్లి అన్నారు. మరి అనుచరులు రాస్తారోకోలు చేస్తూ పదవులకు రాజీనామాలు చేస్తుంటే.. ఎందుకు వారించలేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

    Also Read:CM KCR: కేసీఆర్ అబద్దాల్లో గిన్నిస్ రికార్డే బద్దలు కొడతారా?

    Tags