YS Jagan: కలలు అందరూ కంటారు.. కానీ వాటిని సాకారం చేసుకునేది కొందరే. ఈ విషయంలో జగన్ చాలా కలలు కన్నారు. వాటిని వర్కవుట్ చేసుకున్నారు. తండ్రి మరణం తరువాత సీఎం జగన్ కావాలని భావించారు. అంతులేని మెజార్టీతో సొంతం చేసుకున్నారు. అయితే అధికారమనే కలను సాధించుకున్నారు. కానీ పవర్ చేతిలోకి వచ్చాక మాత్రం చాలా విషయాల్లో ఆయన కలలన్నీ ఫెయిలవుతూ వచ్చాయి. అందులో ఒకటి మూడు రాజధానుల అంశం, చేతిలో పవర్ ఉన్నా అడుగు ముందుకు వేయలేక విశాఖ పాలన అంటూ గడువులు మీద గడువులు పెంచుకుంటూ వస్తున్నారు. కొత్తగా సెప్టెంబరు నుంచి విశాఖ పాలన అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే సెప్టెంబరు నుంచి విశాఖలో పాలన కాదు.. ముందస్తు ముచ్చట ఉంటుందని తెలుస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
సెప్టెంబరులో డిజాల్వ్ ..
కేంద్ర ఎన్నికల సంఘం తొమ్మిది రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించింది. అందులో ఏపీ కూడా ఉంది. అయితే ఇక్కడే చిన్న క్లారిటీ మిస్సవుతోంది. అసలు పార్లమెంట్ ఎన్నికలతో జరగాల్సిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పుడు ఎందుకు కసరత్తు ప్రారంభించారా? అన్నదే చిక్కుముడి వీడని ప్రశ్న. జగన్ ముందస్తు ఆలోచన మేరకే ఈసీ ఇటువంటి ఆలోచన చేసిందన్న టాక్ అయితే మాత్రం ప్రారంభమైంది. సీఎం జగన్ తెరవెనుక ప్రయత్నాల ద్వారా ముందస్తుకు మార్గం సుగమం చేసుకున్నారన్న ప్రచారం ఊపందుకుంది. నవంబరులో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ రావాల్సి ఉంది. అదీ కూడా మొదటి వారంలోనే వస్తుంది. అంటే.. ఎన్నికల సంఘం ఆ ఐదు రాష్ట్రాలతో కలిపి ముందస్తు ఎన్నికలు జరపాలంటే… కనీసం రెండు నెలల ముందు అయినా అసెంబ్లీని రద్దు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన సెప్టెంబరులో అసెంబ్లీని డిజాల్వ్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
కేంద్రం సపోర్టు..
క్లిష్ట సమయాల్లో కేంద్రం సపోర్టు తీసుకుంటున్న జగన్.. ముందస్తు ఎన్నికల విషయంలో కూడా సహాయం కోరినట్టు వార్తలు వచ్చాయి. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి మోదీ, షా ద్వయాన్ని ఇదే కోరుతూ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అసలు కేంద్రం సాయం లేనిదే జగన్ ఇంత పెద్ద సాహసం చేయడానికి చాన్సే లేదన్న టాక్ ఉంది. షెడ్యూల్ కంటే ఆరు నెలల ముందు అసెంబ్లీని రద్దు చేసినా… కేంద్రం కాదంటే మాత్రం.. రాష్ట్రపతి పాలన అయినా విధిస్తారు. కానీ ఎన్నికలు నిర్వహించరు. అయితే ఇది జగన్ కు తెలియంది కాదు. అందుకే
ముందస్తు జాగ్రత్తలతోనే కసరత్తు చేసి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ముందుకా? వెనక్కా?
అయితే వైసీపీ నేతలు మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు. అక్టోబరులో అసెంబ్లీని రద్దుచేసినా ఆశ్చర్యపోనవసరం లేదని చెబుతున్నారు. అలాచేస్తే మిగతా రాష్ట్రాలతో కలిపి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం కాదు. ఒక వేళ జగన్ ను నిర్వీర్యం చేయాలనుకుంటే మాత్రం అసెంబ్లీని డిజాల్వ్ చేసిన తరువాత ఢిల్లీ పెద్దలు పట్టించుకోకపోవవచ్చు. ఎందుకంటే ఆ తర్వాత ఆరు నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. అంటే జగన్ ఆరు నెలల ముందే అధికారం కోల్పోతారు కానీ.. ఎన్నికలు జరగవు. కానీ జగన్ అంత అతి తెలివిగా ఆలోచించరు. చివరి నిమిషంలో డ్రాప్ అవుతారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళతారాని విశ్లేషకులు భావిస్తున్నారు.